సంక్రాంతి మూడు రోజుల పండుగ. అందులో మొదటిది భోగి. భోగి రోజు ఇంటి ముందు మంటలు వేసుకుని చలి కాచుకుంటారు. అయితే ఇది శీతాకాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు అనుకుంటారు. కానీ, దాని వెనుక ఉన్న కథేంటంటే.. ధనుర్మాసంలో ముగ్గుల్లో పెట్టే గొబ్బెమ్మలనే పిడకలు చేసి మంటల్లో వేస్తారు. దానివల్ల గాలి శుద్ధి అవుతుంది. గాల్లో ఉన్న బ్యాక్టీరియా, వైరస్లు నశిస్తాయి. ఆక్సిజన్ బాగా విడుదలవుతుంది. ఈ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో లంగ్స్‌కు సంబంధించిన రోగాలు వస్తుంటాయి. వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది.
భోగి మంటలు చాలా ఎత్తుకు ఎగిసిపడతాయి. అందుకోసం రావి, మామిడి, మేడి వంటి ఔషధ గుణాలుండే చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. వీటన్నింటి ద్వారా రగిలే మంటల నుంచి వచ్చే ఆక్సిజన్ శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. పూర్వం అందరికీ వైద్యం అందేది కాదు. కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇలా భోగి మంటలు వేసే సంప్రదాయాన్ని కనిపెట్టారు. కులాలకు అతీతంగా అందరూ ఒకచోట చేరుతారు. అందువల్ల ప్రజల మధ్య దూరాలు తొలగి, కలిసిమెలిసి ఉంటారు.
మరొక కారణం ఏంటంటే.. పాత వస్తువులన్నీ మంటలో వేస్తారు. దానివల్ల పాతజ్ఞాపకాలు, నెగెటివ్ ఎనర్జీ పోతాయని నమ్ముతారు. మనసుకు ప్రశాంతత చేకూరుతుందని అంటారు. అలాగే అగ్ని దేవుడికి, వాయు దేవుడికి ఆరాధన అని కూడా భావిస్తారు. కానీ, ఇప్పుడు ఇవన్నీ పల్లెల్లో మాత్రమే కనపడుతున్నాయి. సిటీల్లో అక్కడక్కడ భోగి మంటలు వేస్తున్నారు.