అపరాజిత, శక్తి, దిశ చట్టాల అమలు తక్షణ అవసరం

పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైద్యురాలి హత్యాచారం (అత్యాచారం, హత్య కలిపి ఈ కొత్త పదం సృష్టించుకోవల్సి రావడం ఒక విషాదం) నేపథ్యంలో 'అపరాజిత మహిళా బాలల బిల్లు (పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రిమినల్ చట్ట, సవరణ), 2024ను ఆ రాష్ట శాసనసభ ఏకగ్రీవంగా  ఆమోదించింది.  21-–36 రోజుల్లో నేర పరిశోధన, అందుకు జిల్లాస్థాయిలో  అపరాజిత ఫాస్ట్ ట్రాక్ ఫోర్స్, 52 ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు ఈ చట్టం కీలక లక్ష్యాలు. అందుకు భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత, 2023,   లైంగిక నేరాల నుంచి బాలల  రక్షణ (POCSO) చట్టం, 2012లకు  సవరణలు ప్రతిపాదించారు. పెరోల్​ లేని యావజ్జీవ కారాగార శిక్ష,  మరణశిక్షలు వంటి కఠిన శిక్షలు విధించవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ అయిదేండ్ల  క్రితమే ఇటువంటి  ‘దిశ చట్టం’ (ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019)ను  ఆమోదించింది.  ‘దిశ’ హత్యకు ప్రతిస్పందనగా ఆంధ్రప్రదేశ్ ఆమోదించిన చట్టం నుంచి స్ఫూర్తి పొందిన  మహారాష్ట్ర కూడా ‘శక్తి క్రిమినల్ చట్టం(మహారాష్ట్ర సవరణ) చట్టం 2020’ అమలుచేసే ప్రయత్నం చేసింది. ఈ చట్టాల ప్రకారం బాలలు, మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన పరిశోధన, న్యాయ విచారణ త్వరితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రపతి సమ్మతి రానందున ఈ రెండు చట్టాలు అమలులోకి రాలేదు. 

రాజ్యాంగం ఉమ్మడి జాబితాలో నేరచట్టాల రూపకల్పన

ఇప్పుడు ఈ చట్టాల అవసరం  స్పష్టంగా కనిపిస్తోంది. నేరచట్టాల రూపకల్పన భారత రాజ్యాంగం ఉమ్మడి జాబితా కిందకు వస్తుంది. రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు రెండింటినీ ఈ అంశంపై చట్టం చేయడానికి రాజ్యాంగం అనుమతిస్తుంది.  ఇలా ఒకే అంశంపై రెండు చట్టాలు ఉన్నప్పుడు పార్లమెంటు ఆమోదించిన చట్టమే చెల్లుబాటు అవుతుంది. కానీ, భారత రాజ్యాంగ 254వ అధికరణం  ప్రకారం రాష్ట్రపతి సమ్మతి ఉంటే శాసనసభ ఆమోదించిన చట్టం చెల్లుబాటు అవుతుంది.  గవర్నర్​ శాసనసభ ఆమోదించిన చట్టం రాష్ట్రపతి సమ్మతి కోసం పంపుతారు.  అలాగే, 200వ అధికరణం ప్రకారం హైకోర్టు అధికారాలపై ప్రభావం ఉంటుందని గవర్నర్​ భావిస్తే రాష్ట్రపతి సమ్మతి కోసం పంపవలసి ఉంటుంది.  అయితే, ఈ బిల్లులు ఏండ్ల తరబడి ఆయా మంత్రిత్వ శాఖల వద్ద  పెండింగులో ఉండిపోతున్నాయి. 

జాతీయ స్థాయి చట్టం అవసరం

 ‘దిశ,శక్తి వంటి పేరు ఎందుకు?’ , ‘కొత్త నేర చట్టాలు సరిపోవా?’ వంటి ప్రశ్నలకు రాజ్యాంగం ఆస్కారం కల్పించినట్లు లేదు. ఈ చట్టాలకు వెంటనే అనుమతి ఇవ్వడం లేదా మమతా బెనర్జీ కోరినట్లు పార్లమెంట్ జాతీయస్థాయి చట్టం ఆమోదించడం చేయాలి. జాతీయస్థాయి చట్టం కన్నా పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అపరాజిత, శక్తి, దిశ చట్టాలను కొంతకాలం అమలు చేసి, ఆ అనుభవం ఆధారంగా ఇతర రాష్ట్రాలు అమలు చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది.  

బాధితులకు సమాజం అండగా నిలవాలి

ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ మరో చట్టం కూడా ఆంధ్రప్రదేశ్ ఆమోదించింది. ఈ కొత్త చట్టాల అమలుకు పోలీసు అధికారుల, న్యాయమూర్తుల సంఖ్య, సంసిద్ధత కీలకం. ఇందుకు రాష్ట్రాలు తగిన నిధులు, మానవ వనరులు సమకూర్చడం అవసరం.  మహిళలకు భద్రత ఉంటే,  శ్రామిక శక్తిలో వారి భాగస్వామ్యం పెరిగితే, జాతికి కలిగే ప్రయోజనాలతో పోలిస్తే  అపరాజిత, శక్తి, దిశ  చట్టాల అమలు వ్యయం స్వల్పం. 

పోర్నోగ్రఫీ ప్రభావం?

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా వైద్య విద్యార్థిని హంతకుడు  పోర్నోగ్రఫీ  వ్యసనపరుడని వార్తలొచ్చాయి.   పోర్నోగ్రఫీపై నిషేధం విధించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే బాలల పోర్నోగ్రఫీపై దేశంలో నిషేధం అమలులో ఉన్నది.  పోర్నోగ్రఫీకి, లైంగిక నేరాలకు సంబంధం లేదని వాదించేవారు ఉదాహరణగా చూపించే  దేశాల సామాజిక సంస్కృతి  మన దేశం కంటే భిన్నమైనదని గమనించాలి.  చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు పోర్నోగ్రఫీపై  పకడ్బందీగా  నిషేధం అమలు చేసున్నాయి. ఈ రెండు దేశాలూ బాలలకు, మహిళలకు భద్రమైన దేశాలుగా పేరు ఉన్నది. చైనాలో తల్లిదండ్రులు తమ పిల్లల గురించి నిశ్చింతగా ఉన్నామని చెబుతారు.  నగరంలో రాత్రి పూట ఒంటరిగా తిరుగుతున్న సమయంలోనూ సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నామని యూఏఈ  మహిళలు చెబుతారు.  నేరం ఒక వ్యక్తిపై జరిగినా అది సమాజంపై జరిగినట్లే.  బాధితులను ఒంటరిగా వదిలి వేయకుండా సమాజం, ప్రభుత్వం అండగా ఉండాలి.

- శ్రీనివాస్ మాధవ్, 
సమాచార హక్కు కార్యకర్త