సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రతిపక్షాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఫెయిల్ అయింది. శనివారం తీర్మానంపై ఓటింగ్‌కు ముందే అధికార పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ)కి చెందిన సభ్యులు వాకౌట్ చేయడంతో తీర్మానం వీగిపోయింది. దీంతో యూన్ సుక్ యోల్ తొలి గండాన్ని గట్టెక్కినట్టయింది. ప్రతిపక్షాలు దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని, పార్లమెంట్‌ను అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ మంగళవారం రాత్రి అధ్యక్షుడు యూన్ అకస్మాత్తుగా ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించడంతో దేశంలో కలకలం రేగింది.
మార్షల్ లాను అధికార పార్టీ నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. అదే రోజు రాత్రికి ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌లోకి దూసుకెళ్లి.. మార్షల్ లా రద్దుకు తీర్మానం పాస్ చేశారు. దీంతో ఆరు గంటల్లోనే బుధవారం ఉదయం కల్లా మార్షల్ లా రద్దయిపోయింది. అయితే, మార్షల్ లా విధించి దేశాన్ని, ప్రజలను యూన్ సుక్ యోల్ ప్రమాదంలోకి నెట్టారని, ఆయనను పదవి నుంచి తొలగించాలని అటు ప్రతిపక్షాలతోపాటు ఇటు అధికార పక్షం నుంచీ డిమాండ్లు వెల్లువెత్తాయి.
యూన్‌ను గద్దె దింపెయ్యాలని దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై శనివారం పార్లమెంట్ (నేషనల్ అసెంబ్లీ)లో ఓటింగ్ జరిగింది. ముందుగా యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలన్న తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఆ వెంటనే అభిశంసన తీర్మానంపై చర్చ మొదలవగా.. అధికార పార్టీ సభ్యులు ముగ్గురు మినహా మిగతావాళ్లంతా వాకౌట్ చేశారు.
రూలింగ్ పార్టీ నుంచి ముగ్గురి మద్దతు..
అభిశంసన తీర్మానంపై చర్చ తర్వాత ఓటింగ్ జరగగా.. తీర్మానానికి అనుకూలంగా 195 ఓట్లు మాత్రమే వచ్చాయి. అభిశంసన తీర్మానం పాస్ కావాలంటే కనీసం మూడింట రెండొంతుల(200 మంది) ఓట్ల మెజార్టీ అవసరం. దీంతో తీర్మానం వీగిపోయిందని నేషనల్ అసెంబ్లీ స్పీకర్ వూ వాన్ షిక్ ప్రకటించారు. యూన్‌ను గద్దె దింపేందుకు సిద్ధమని ప్రకటించిన రూలింగ్ పార్టీ సభ్యులు ఓటింగ్ ముందు సభ నుంచి వాకౌట్ చేయడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. యూన్ పై మరోసారి అభిశంసన తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించాయి.
సియోల్‌లో వెల్లువెత్తిన నిరసనలు
యూన్ సుక్ యోల్‌ను గద్దె దింపాలంటూ శనివారం కూడా సియోల్‌లో జనం పెద్దఎత్తున నిరసనలు తెలిపా రు. పార్లమెంట్ ముందు వేలాదిమంది గుమిగూడి యూన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజలకు యూన్ క్షమాపణ
పార్లమెంట్ లో అభిశంసనపై ఓటింగ్ కు కొన్ని గంటల ముందుగా యూన్ సుక్ యోల్ దేశ ప్రజలకు టీవీ చానెల్ లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. మార్షల్ లా విధించి చాలా తప్పు చేశానని, ఇందుకు పూర్తి బాధ్యత వహిస్తానని తెలిపారు. ప్రతిపక్షాల తీరుపై తీవ్ర నిరాశ, నిస్పృహ కారణంగా మార్షల్ లా విధించాల్సి వచ్చిందని.. మళ్లీ ఇలాంటి తప్పు చేయనని హామీ ఇచ్చారు.