ఇమ్యూనిటీ పెంచే వెల్లుల్లి రెసిపీలు

ఈ మధ్య వర్షాలకు జలుబు, దగ్గు, జ్వరం అంటూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇమ్యూనిటీ లేకనే ఈ తిప్పలు అంటున్నారు డాక్టర్లు. ఇమ్యూనిటీ పెంచుకునే తిండి తినాల్సిందే. అందుకు వెల్లుల్లి, పచ్చిమిర్చి కాంబినేషన్​లో సింపుల్​గా అయిపోయే ఈ రెసిపీలు ట్రై చేయండి.

పొటాటో శ్నాక్​

కావాల్సినవి :

ఆలుగడ్డలు - రెండు 
కార్న్​ ఫ్లోర్ - మూడు టేబుల్ స్పూన్లు
నీళ్లు, ఉప్పు - సరిపడా
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
పల్లీలు, వెల్లుల్లి తరుగు, తేనె లేదా చక్కెర, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్  - ఒక్కో టేబుల్ స్పూన్
నువ్వులు, కశ్మీరీ కారం
వెనిగర్ - ఒక్కో టీస్పూన్
ఎండు మిర్చి తునకలు - అర టీస్పూన్
కొత్తిమీర - కొంచెం

తయారీ : ఆలుగడ్డల్ని తొక్క తీసి, చిన్న ముక్కలుగా తరగాలి. పాన్​లో నీళ్లు వేడి చేసి ఆలుగడ్డ ముక్కల్ని వేసి పది నిమిషాలు ఉడికించాలి. మరీ మెత్తగా అయ్యేవరకు ఉడికించొద్దు. తర్వాత  నీళ్లు వంపేయాలి. ఉడికించిన ఆలుగడ్డల్ని గరిటెతో అదిమితే మెత్తటి ఆలూ పేస్ట్ తయారవుతుంది. అందులో కార్న్​ఫ్లోర్ కలిపి, నీళ్లు పోసి మెత్తటి ముద్దలా చేయాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలు చేయాలి. దానిపై గుండ్రని గుర్తు పెట్టాలి. నీళ్లు వేడి చేసి అందులో ఈ ఉండల్ని వేసి మరికాసేపు ఉడికించాలి. ఉండలు పైకి తేలాక వాటిని చల్లటి నీళ్లలో వేసి కొంచెంసేపు అయ్యాక ప్లేట్​లోకి తీయాలి. ఒక గిన్నెలో సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, నువ్వులు, పల్లీల తరుగు, ఎండుమిర్చి తునకలు, ఉప్పు, తేనె, కొత్తిమీర, కశ్మీరీ కారం వేసి కలపాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి వెల్లుల్లి తరుగు వేగించాలి. ఆ మిశ్రమాన్ని మసాలాలు ఉన్న గిన్నెలో వేసి కలపాలి. తరువాత ఉడికించి, మెదిపిన ఆలుగడ్డల్ని కూడా వేసి కలపాలి.

రోటీలు 

కావాల్సినవి :

వెల్లుల్లి రెబ్బలు - పన్నెండు

పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర - కొంచెం

మిరియాలు - ఆరు
గోధుమ పిండి - ఒక కప్పు

ఉప్పు, నీళ్లు - సరిపడా
నూనె - ఒక టీస్పూన్

తయారీ : వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరగాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి. అందులో మొదట ఉప్పు వేసి తరువాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. మిరియాల పొడిని కూడా అందులో వేయాలి. అన్నీ పిండిలో కలిసేలా బాగా కలిపాక నీళ్లు పోస్తూ పిండిని ముద్దగా కలపాలి. ముద్దగా అయ్యాక నూనె వేసి మెత్తగా కలపాలి. మూతపెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండి ముద్దను చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండను చపాతీల్లా వత్తాలి. వాటిని పెనం మీద వేసి రెండు వైపులా నూనెతో కాల్చితే హెల్దీ గార్లిక్​ రోటీ రెడీ.