ఫేక్  పర్మిషన్లతో   ప్లాట్ల దందా!

  • గద్వాలలో రియల్టర్ల మాయాజాలం
  • కోట్లు విలువ చేసే ప్లాట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు
  • రూల్స్  పాటించకున్నా  బిల్డింగ్ లకు పర్మిషన్లు
  • సమాచార హక్కు  చట్టంతో గుట్టురట్టు

గద్వాల, వెలుగు: ఫేక్  ఎల్పీ(ల్యాండ్ పర్మిషన్)లతో వెంచర్లు వేసి అటు ప్రభుత్వానికి, ఇటు గద్వాల మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టి రియల్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. రియల్టర్ల మాయాజాలంతో సామాన్యులు ప్లాట్లు కొని ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారం సమాచార హక్కు చట్టంతో గుట్టు రట్టు అయినా పోలీసులు, ఇతర ఆఫీసర్లతో బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని జమ్మిచేడు శివారులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్ 320/పి,324/పి,343/పి,344/పిలో కోట్ల విలువ చేసే ప్లాట్లను ఫేక్  ఎల్పీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేసి, బిల్డింగ్  పర్మిషన్లు కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం
 గమనార్హం.

అగ్రికల్చర్  ల్యాండ్​గా రిజిస్ట్రేషన్..

జమ్మిచేడు శివారులోని 320/పి, 342/పి, 343/పి, 344/పి లో 5 ఎకరాల 34 గుంటల భూమి ఉంది. దీన్ని 2014లో డాక్యుమెంట్ నెంబర్ ఈ/444/2014 లో అప్పటి భూ యజమానులు నాలా పర్మిషన్ తీసుకున్నారు. నాలా పర్మిషన్  తీసుకున్నాక అగ్రికల్చర్  ల్యాండ్  కిందికి రాదు. ఆ పొలాన్ని ప్లాట్లగానో, ఇతర పొలాల మాదిరిగానో రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ 2018లో నవంబర్ 7న డాక్యుమెంట్  నంబర్ 18259,18260/2018  అగ్రికల్చర్  ల్యాండ్ గా రియల్టర్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్  చేసుకున్నారు. 

ఫేక్  ఎల్పీ నంబర్ తో రిజిస్ట్రేషన్లు..

5 ఎకరాల 34 గంటల భూమిని 2018లో రియల్టర్లు కొనుగోలు చేయగా, 2017లో ఎల్పీ నంబర్ 528/ 2017/ హెచ్ఆర్వో/ హెచ్1 తో ఫేక్  ఎల్పీ నంబర్  సృష్టించి అందులో 42 ప్లాట్లను వేసి ఏడాది నుంచి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఫేక్  ఎల్పీ నంబర్  సృష్టించడంతోపాటు ఫేక్  సర్వే రిపోర్టు సృష్టించారని విమర్శలున్నాయి. ఏ1/385/2016లో సర్వే చేసినట్లు తప్పుడు రిపోర్టును సృష్టించారనే విమర్శలున్నాయి. ఫేక్  ఎల్పీతో పాటు ఫేక్  సర్వే రిపోర్టులు సృష్టించి అటు ప్రభుత్వానికి, ఇటు మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతూ సామాన్యులను మోసం చేస్తున్నారు.

సమాచార హక్కు చట్టంతో గుట్టురట్టు..

జమ్మిచెడ్  శివారులోని ఆరోపణలు ఉన్న సర్వే నంబర్ పై వారు చూపించిన ఎల్పీ నంబరు సర్వే రిపోర్టు గురించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే ఎల్పీ 528/2017/ హెచ్ఆర్వో / హెచ్ 1 కు సంబంధించిన డాక్యుమెంట్  లేదని అది ఫేక్  డాక్యుమెంట్  అని సమాధానం ఇవ్వడం గమనార్హం. అలాగే ఏ1/385/2016 సర్వే రిపోర్ట్ పై కూడా ఇన్ఫర్మేషన్  అడిగితే ఆ ఫైలే లేదని సమాధానం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఫేక్  పర్మిషన్లతో తమకు ప్లాట్లు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్లాట్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఎంక్వైరీ చేసి  చర్యలు తీసుకుంటాం..

మున్సిపాలిటీలో ఉన్న రికార్డులను పరిశీలించి ఫేక్ ఎల్పీపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం. ఫేక్  పర్మిషన్​ ఉన్నట్లు మా దృష్టికి రాలేదు. బిల్డింగ్  పర్మిషన్లను కూడా వెరిఫై చేస్తాం.
- కల్యాణ్ చక్రవర్తి, టీపీవో, గద్వాల

పక్క పొలాన్ని  కబ్జా పెట్టిన్రు..


బరితెగించిన భూ మాఫియా ఆ వెంచర్  పక్కనే ఉన్న సర్వే నంబర్  341పై కూడా కన్నేసి దాన్ని కబ్జా పెట్టారని జమ్మి చెడ్​ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్  వాపోయాడు. 341 సర్వే నంబర్​లో తమకు 21 గుంటల భూమి ఉందని.. దాన్ని కబ్జా చేసి ఫెన్సింగ్​ ఏర్పాటు చేశారని సర్వే చేయడానికి పోతే రాజకీయ పలుకుబడితో పోలీసులతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కోర్టు ఆదేశాలు ఉన్నా తమను రియల్  ఎస్టేట్  వ్యాపారులు, భూ మాఫియా సర్వే చేయకుండా రెండేండ్ల నుంచి ఇబ్బంది పెడుతున్నారని వాపోయాడు.