ఉమ్మడి పాలమూరులో ఇష్టానుసారంగా రాతి, మట్టి తవ్వకాలు

  • ఎంత తవ్వినా అడగట్లేదు!
  • ఏండ్లుగా కొనసాగిస్తోన్న క్రషర్​ క్వారీ నిర్వాహకుల అక్రమ దందా
  • తనిఖీలు, సర్వేల పేరుతో బేరాలకు దిగుతున్న కొందరు మైనింగ్​ ఆఫీసర్లు 

మహబూబ్​నగర్, వెలుగు : రాతి, ఎర్ర మట్టి గుట్టలకు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రసిద్ధి. కొంతకాలంగా ఇష్టానుసారంగా అక్రమ తవ్వకాలతో గుట్టలు కనుమరుగయ్యే  దుస్థితి నెలకొంది. లీజుల పేరుతో ఏండ్ల కొద్దీ క్రషర్​క్వారీలు ఏర్పాటు చేసి తవ్వకాలు చేస్తుండగా ఆనవాళ్లు కోల్పోతున్నాయి. దీనికి తోడు రియల్​ఎస్టేట్​వెంచర్లు, ఇటుక బట్టీల కు పెద్ద మొత్తంలో ఎర్రమట్టి గుట్టలను తవ్వేస్తున్నారు. అయినా.. సంబంధిత డిపార్టెంట్ ​నిర్లక్ష్యంగా ఉంటోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడబడితే అక్కడే అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నా అడిగే దిక్కు లేకుండాపోయింది.

లీజు పేరుతో ఇష్టానుసారంగా..

మహబూబ్​నగర్, గద్వాల, వనపర్తి, నాగర్​కర్నూల్, నారాయణపేట ప్రాంతాల్లో క్రషర్​క్వారీలు ఉన్నాయి. వీటిలో కొన్ని రెండు దశాబ్దాలకు పైగా.. మరికొన్ని దశాబ్దిన్నర నుంచి నడుస్తున్నాయి. ఇందులో కొన్నింటికి 20 – 30 ఏండ్ల వరకు లీజు పర్మిషన్లు ఇచ్చారు. అయితే అనుమతులు పేరిట కొందరు క్వారీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ర్ట ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని చెల్లించడం లేదు. దీనికితోడు చాలా క్వారీల లీజు డేట్​ ముగిసినా.. యథేచ్ఛగా బ్లాస్టింగ్, తవ్వకాలు చేస్తున్నారు.

మైనింగ్​డిపార్ట్​మెంట్​లోని కొందరు ఆఫీసర్లు మేనేజ్​ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జడ్చర్ల శివారు, అదే మండంలోని శంకరాయపల్లి వద్ద పక్కపక్కనే మూడు క్రషర్​ క్వారీల వద్ద వారం కింద మైన్స్ డిపార్ట్​మెంట్​తనిఖీలు చేసింది. డిఫరెన్షియల్​గ్లోబల్ పొజిషనింగ్​సిస్టం(డీజీపీఎస్​) సర్వే కొనసాగించింది. రెండు రోజుల్లో ఎంక్వైరీ చేసి అక్రమాలు తేల్చుతామని చెప్పింది. రూల్స్​కు విరుద్ధంగా క్వారీ నడుపుతున్న నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కానీ వారమైనా ఇంతవరకు నివేదిక బయటకు రాలేదు. ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా జడ్చర్ల, శంకరాయపల్లి క్వారీలకు సంబంధించి మహబూబ్​నగర్​మైనింగ్​ఏడీ సంజయ్​ను ఫోన్​లో వివరణ అడిగే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.

మట్టి గుట్ట కనిపిస్తే మాయం

ఉమ్మడి జిల్లాలో మట్టి గుట్టలు రాత్రికి రాత్రే మాయం అవుతున్నాయి. మొరం, ఎర్ర మట్టి గుట్టలను అక్రమార్కులు తవ్వేసి ఆనవాళ్లు లేకుండా చేసేస్తున్నారు. కొందరు రాజకీయ లీడర్లు గ్రూపులుగా ఏర్పడి ఈ దందాను నడిపిస్తున్నారు. తవ్విన మట్టిని రియల్​ఎస్టేట్​ వెంచర్లకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిళ్లు మాత్రమే మట్టిని తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలిస్తున్నారు.  కొద్ది రోజుల కిందట అడ్డాకుల  మండలంలో ఓ వెంచర్​ను ఏర్పాటు చేశారు.

హైవేకు సమీపంలోని వెంచర్​రోడ్డుకు రెండు ఫీట్లు దిగువన ఉంది. అయితే నిర్వాహకులు సమీపంలోని గుట్ట నుంచి రాత్రికి రాత్రే తవ్వి మట్టిని తెచ్చి వెంచర్​లో పోశారు.  మరి కొందరు ఇటుక బట్టీల వ్యాపారులతో డీల్​సెట్​చేసుకొని ట్రిప్పర్ల కొద్ది మట్టిని తరలిస్తున్నారు. ఇలా మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లోని ఇటుక బట్టీల వద్ద పెద్ద మొత్తంలో  మట్టిని డంప్ చేశారు. 

తనిఖీలు పేరుతో అవినీతికి పాల్పడుతూ.. 

ఉమ్మడి జిల్లాలో మైన్స్​డిపార్ట్​మెంట్​లోని కొందరు ఆఫీసర్లు తనిఖీల పేరుతో బేరాలకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మట్టి, రాయిని తరలిస్తున్నారనే సమాచారం వస్తే ఆ ప్రాంతాన్ని కొందరు సిబ్బంది విజిట్​ చేస్తున్నారు. కానీ అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా.. వారికే సహకారం అందిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇందుకు వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.