బాల్కొండలో జోరుగా ఇసుక  దందా

  •     వాగు పరివాహక ప్రాంతాల్లో  రవాణా

బాల్కొండ, వెలుగు : బాల్కొండలో ఇసుక అక్రమ దందా ఆగడం లేదు. నియోజకవర్గ పరిధిలోని వాగు పరివాహక గ్రామాల్లో వీడీసీల ఆధ్వర్యంలో అక్రమ టెండర్లు నిర్వహించి ఇసుక వ్యాపారం చేస్తున్నారు. రాత్రుల్లో వాగుల్లోంచి ఇసుకను తీస్తూ, పలు గ్రామాల్లో డంపులు పోస్తున్నారు.  సంబంధిత అధికారులు మాత్రం  పట్టించుకోవడం లేదు. బట్టాపూర్ లో వీడీసీ ఆధ్వర్యంలో టెండర్ నిర్వహించి ఇసుకను తరలిస్తున్నారు. రెండు నెలలకు రూ. ఆరున్నర లక్షలకు టెండర్ దక్కించుకున్నట్టు సమాచారం.  

అధికారులు నామమాత్రపు దాడులు చేసి, చేతులు దులుపుకుంటుండడంతో  వ్యాపారులు ఏకంగా జేసీబీలతో ఇసుకను తోడుతున్నారు. దాన్ని ట్రాక్టర్లు, లారీలతో సరిహద్దును దాటిస్తున్నారు.     తెలంగాణ కొత్త గవర్నమెంట్ తెచ్చిన కొత్త ఇసుక పాలసీ అమలుకాకపోవడంతో వీడీసీలు అదే అదునుగా భావించారు. గ్రామాల్లో లక్షల రూపాయలతో టెండర్లు పాడి ఇసుక వ్యాపారాన్ని దక్కించుకుంటున్నారు. వాగు నుంచి ఇసుక తీయడానికి ట్రిప్పునకు రూ. 1800 నుంచి రూ. 2500 వరకూ వసూలు చేస్తున్నారు.  

తడపాకల్ లో మాజీ ప్రజాప్రతినిధులు రూ.నాలుగున్నర లక్షలకు టెండర్ దక్కించుకుని ఇసుక రవాణా సాగిస్తున్నారు. ఎవరూ చూడని ప్రదేశంలో ఇసుక డంప్ చేశారు.    అధికారులు  ఇప్పటికైనా స్పందించి, ఇసుక రవాణా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.