అక్రమంగా నగదు బదిలీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌‌

  • అమాయకులకు డబ్బు ఆశ చూపించి అకౌంట్‌‌ ఓపెన్‌‌ చేయిస్తున్న వ్యక్తులు
  • ఏటీఎం, డిజిటల్‌‌ బ్యాంకింగ్‌‌ కిట్లను దుబాయ్‌‌కి పంపి అక్కడి నుంచి లావాదేవీలు
  • మిర్యాలగూడకు చెందిన ఓ కౌన్సిలర్‌‌ భర్త, అతడి బంధువు అరెస్ట్‌‌
  • ఈ దందా రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా

మిర్యాలగూడ, వెలుగు : అమాయకులను టార్గెట్‌‌ చేసి, వారి పేరిట బ్యాంక్‌‌ అకౌంట్లను తెరిపించి అక్రమంగా నగదు బదిలీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌‌ సీసీఎస్‌‌ పోలీసులు ఈ నెల 25న అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వ్యాపారంలో బాగా నష్టపోవడంతో ఉద్యోగం కోసం దుబాయ్‌‌కి వెళ్లాడు. అక్కడ గేమింగ్‌‌ జోన్‌‌, ఆన్‌‌లైన్‌‌ స్కామ్‌‌, ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ ఫ్రాడ్స్‌‌కు అలవాటు పడ్డాడు. 

ఇందులో వచ్చే నగదు బదిలీ కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకొని కొందరు వ్యక్తుల పేరున బ్యాంక్‌‌ అకౌంట్లు ఓపెన్‌‌ చేయించేవాడు. అకౌంట్‌‌ ఓపెన్‌‌ అయ్యాక బ్యాంక్‌‌ వాళ్లు ఇచ్చే ఏటీఎం, చెక్స్‌‌, డిజిటల్‌‌ బ్యాంకింగ్‌‌ కిట్లను హైదరాబాద్‌‌లోని పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాల్లో నియమించుకున్న ఏజెంట్ల ద్వారా దుబాయ్‌‌కి తెప్పించుకుంటాడు. దుబాయ్‌‌లోనే ఆఫీస్‌‌ ఓపెన్‌‌ చేసి ఏజెంట్ల ద్వారా తెరిచిన బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు లావాదేవీలను జరిపినట్లు తెలుస్తోంది.

 ఏ ఏజెంట్ ఎన్ని ఖాతాలు తెరిపించారు ? ఎంత నగదు ఏ అకౌంట్‌‌కు ట్రాన్స్‌‌ఫర్‌‌ అయింది ? అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సుమారు 50 మంది సిబ్బందిని సైతం నియమించుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ నగదు బదిలీల కోసం రూ. 20 వేల నుంచి రూ. 26 వేలతో అకౌంట్‌‌ ఓపెన్‌‌ చేయించి, ఇందులో ఏజెంట్‌‌ వాటా మినహాయించుకొని కొంత నగదును ఖాతాదారుడికి ఇస్తూ దందాను కొనసాగిస్తున్నారు. 

ఒక్కో ఏజెంట్ రోజుకు 30 నుంచి 40 అకౌంట్లు ఓపెన్‌‌ చేయించి ఖాతాదారుల ఏటీఎం, ఇతర కిట్లను దుబాయ్‌‌కి చేరవేస్తుంటారు. ఇలా మిర్యాలగూడకు చెందిన ఓ కౌన్సిలర్‌‌ భర్త సుమారు 1000 అకౌంట్లు తెరిపించినట్లు తెలుస్తోంది. వారం వ్యవధిలో ఒక్కో అకౌంట్‌‌ నుంచి రూ. 18 లక్షలకు పైగా నగదు డిపాజిట్‌‌, ట్రాన్స్‌‌ఫర్‌‌ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. 

మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ టైలర్ అకౌంట్‌‌లో ఇటీవల రూ. 34 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు డిపాజిట్‌‌ కావడంతో ఈ విషయం పోలీసులు, ఐటీ ఆఫీసర్ల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. విషయం హైదరాబాద్‌‌ సీసీఎస్‌‌ పోలీసులకు తెలియడంతో ఈ నెల 25న మిర్యాలగూడకు వచ్చి కౌన్సిలర్‌‌ భర్తతో పాటు, అతడి బంధువును అదుపులోకి తీసుకొని నగదు బదిలీ వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ అక్రమ నగదు బదిలీల వ్యవసాయం మొత్తం రూ. 2 వేల కోట్ల వరకు ఉంటుందన్న చర్చ సాగుతోంది.