వమనుషుల్లో విచారం వయసు పెరిగే కొద్దీ సహజంగానే ఎక్కువవుతుంది. ముసలితనం వల్ల మానసికమైన, శారీరకమైన సమస్యలు వస్తుంటాయి. దాంతో బాధ కలుగుతుంది. అయితే పెద్దవాళ్లు ఒక్కోసారి బాధను తట్టుకోలేరు. దాంతో వాళ్లలో బాధలోంచి కోపం వస్తుంది. దాన్ని మరొకరి మీద చూపిస్తుంటారు. బాధ కంటే కోపం ఎక్కువ డేంజర్ అని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.
పెద్దవాళ్లలో కోపం ఎక్కువైతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఎలాగంటే కోపాన్ని తమతోతాము అణచుకోలేక బయటకు ప్రదర్శించడం వల్ల గుండె జబ్బులు, మోకాళ్ల నొప్పులు, కేన్సర్ వంటి రోగాలు వస్తాయట. ఇదేదో ఆషామాషీగా చెప్పినసంగతికాదు. అమెరికాలోని కాన్కోర్డియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేసి మరీ చెప్పారు.
ఈ అధ్యయనం కోసం వాళ్లు 59 నుంచి 93 ఏళ్ల మధ్య వయసున్న 226 మందిని ఎంచుకున్నారు. వాళ్ల మానసిక స్థాయిని అంచనావేశారు. కోపం వల్ల వాళ్లలో కలుగుతున్న మానసిక, శారీరక మార్పులను గమనించారు. చివరకు వృద్ధుల్లో బాధకంటే కోపం ఎక్కువ ప్రమాదమని తేల్చారు. అలాగే కోపం ఎక్కువైతే ప్రమాదకరమైన జబ్బులు రావడమే కాదు, ప్రాణాల మీదకు కూడా రావచ్చని చెప్పారు.