ఇట్ల లొల్లి జేస్తే సభ్యత్వాలు రద్దు కావొచ్చు.. బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్య

  • గతంలో లేచి నిల్చున్నందుకే వెంకట్​రెడ్డి, సంపత్​ సభ్యత్వాలు రద్దు చేశారని ప్రస్తావన
  • అసెంబ్లీలో గత పదేండ్లలో రకరకాల సంప్రదాయాలు తెచ్చారు
  • నన్ను ఏ ఒక్క సెషన్​లో కూడా మాట్లాడనీయలేదు
  • ఇప్పటికైతే సస్పెన్షన్లు కూడా ఉండొద్దని అనుకుంటున్నం
  • వాళ్లు 6 గంటలు మాట్లాడి కూడా మైక్​ ఇయ్యలేదనుడేంది?
  • కేసీఆర్​కు అధికారమే కావాలి.. అట్లయితేనే సభకు వస్తడు 
  • సబితక్కకు అవమానమే జరిగుంటే సభకు కేసీఆర్, హరీశ్ ఎందుకు రాలే.. మీడియాతో ముఖ్యమంత్రి చిట్​ చాట్​

హైదరాబాద్​, వెలుగు: గడిచిన పదేండ్లలో అసెంబ్లీలో రకరకాల సంప్రదాయాలను తీసుకొచ్చారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. సస్పెన్షన్లు, మార్షల్స్​తో బయటికి పంపడం వంటివే కాకుండా, సభ్యుల శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు చేశారని.. ఇప్పుడు కూడా అలాంటివి జరగొచ్చేమోనని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్​ హయాంలో అసెంబ్లీలో కుర్చీలో నుంచి లేచి నిల్చున్నందుకే కాంగ్రెస్​ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సంపత్​ కుమార్​ సభ్యత్వాలు రద్దు చేశారని తెలిపారు.

 బుధవారం అసెంబ్లీలో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు పదే పదే చర్చకు, ప్రసంగాలకు అడ్డు తగలడం, వెల్​లోకి దూసుకెళ్లడం, చప్పట్లు కొట్టడం వంటి వాటిపై సీఎం పైవిధంగా స్పందించారు. ‘‘సస్పెన్షన్లే ఎందుకు.. సభ్యుల శాసనసభ సభ్యత్వం కూడా రద్దు కావొచ్చు. అప్పట్లో కోమటిరెడ్డి, సంపత్​ కుమార్​ సభ్యత్వాలు రద్దు కాలేదా! ఇప్పుడు కూడా స్పీకర్​ చేసినా చేయొచ్చు. ఆల్రెడీ మన దగ్గర ఆ సంప్రదాయం వచ్చింది కదా! లాస్ట్​ టైం (బీఆర్​ఎస్​ హయాంలో) వెంకట్​ రెడ్డి, సంపత్​ మీద గవర్నర్​ ప్రసంగం సందర్భంగా కుర్చీలో నుంచి లేచి ఏం జరుగుతుందని చూసినందుకే.. ‘మా ముందర మీరు నిల్చుంటరా’ అని సభ్యత్వాలు రద్దు చేశారు” అని ఆయన పేర్కొన్నారు. 


బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్​లో మీడి యాతో సీఎం రేవంత్​రెడ్డి చిట్​చాట్​ చేశారు. ఇప్పటికైతే సభలో సస్పెన్షన్లు వంటివి ఉండకూడదని భావిస్తున్నామని, డెమొక్రటిక్​గా ముందుకు 
వెళ్తున్నామని చెప్పారు. 

సబితక్కకు అవమానమే జరిగుంటే కేసీఆర్ ఎక్కడ మరి?

మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్​కు రాష్ట్రం పట్ల పట్టింపు, రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత లేదని సీఎం మండిపడ్డారు. ‘‘వాళ్లు(బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు) అనుకుంటున్నట్లు సబితక్కకు అవమానమే జరిగుంటే  కేసీఆర్, హరీశ్​రావు అసెంబ్లీకి ఎందుకు రాలే. అక్కలకు అన్యాయం జరుగుతుంటే రావాలి కదా. సభలోకి  వచ్చి సభ్యులకు ఇంత అవమానం జరుగుతుంటే ఊరుకునేది లేదని లీడ్​ చేయాలి కదా. 

ఎందుకు కేసీఆర్​, హరీశ్ డుమ్మా కొట్టిన్రు? ఇది ఉత్తగానే డ్రామా. లొల్లి, పంచాయితీ చేయాలన్నదే వాళ్ల వ్యూహం. సబితక్క ఇంత ఆవేదన చెందుతుంటే కేసీఆర్, హరీశ్​ నిలబడాలి కదా ? ఆ ఇద్దరూ అత్తాపత్తా లేరు” అని అన్నారు. ‘‘గత బీఆర్​ఎస్​ హయాంలో రాష్ట్ర అసెంబ్లీలో రకరకాల సంప్రదాయాలు నెలకొల్పారు.

 2014- నుంచి 18 వరకు ఏ ఒక్క సెషన్​లో కూడా నన్ను ఉండనియ్యలేదు. వచ్చిన వెంబడే.. నేను వెనకాల సీట్లో కూర్చున్నా కూడా సెషన్​ మొత్తం బహిష్కరించారు. దీనిపైనా నేను హైకోర్టు కూడా వెళ్లాను. నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతున్నదని, నియోజకవర్గ విషయాలు సభలో చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టులో కోరాను” అని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. 

తమ్ముడికి అండగా ఉండాల్సిన సబితక్క ఏం చేసింది?

అప్పట్లో తాను కాంగ్రెస్​లో చేరిన తర్వాత తనకు మద్దతుగా ఉంటానని చెప్పిన సబితా ఇంద్రారెడ్డి  వెంటనే బీఆర్​ఎస్​లో చేరారని.. అదే విషయాన్ని తాను అసెంబ్లీలో ప్రస్తావించానని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. పొలిటికల్​ అనుభావాలే చెప్పానని, ఎవరినీ దూషించలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘తనకు బాధ వస్తే ఊరంతా బాధ వచ్చినట్లు సబితక్క అనుకుంటున్నది. నేను పర్సనల్​ డీటెయిల్స్​ ఎక్కువ చెప్పను. 

కాంగ్రెస్​లో చేరితే బాగుంటదని చెప్పి నన్ను కాంగ్రెస్​లోకి రప్పించినట్లు సబితక్క చెప్పింది. నేను కూడా నిజం అని ఒప్పుకున్న. అప్పుడు అక్క బాధ్యత ఏముంటది? తమ్ముడిని ఒంటర్ని చేయకుండా, తమ్ముడికి అండగా నిలబడాలి కదా!  నేను మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్​ వేసే టైమ్​కు అక్క అటు పక్క (బీఆర్​ఎస్​లో) చేరి అటుపక్క వాళ్లను గెలిపించాలని చూసింది. నేను అదే విషయం అసెంబ్లీలో చెప్పిన. 

నేనేమైనా తిట్టిన్నా? వేరే లాంగ్వేజ్​ మాట్లాడిన్నా.. అన్​ పార్లమెంటరీ వర్డ్స్​ మాట్లాడిన్నా. పేర్లు ఏమైనా తీసుకున్ననా?  లేదు కదా! నేను పొలిటికల్​ అనుభవాలే చెప్పిన. నాడు ఎంపీ అభ్యర్థిగా నాకు టికెట్​ అనౌన్స్​ అయిన వెంటనే సబితక్క బీఆర్​ఎస్ లోకి పోతే ఏమనుకోవాలి ? నా ఎలక్షన్​ను కంప్లీట్​గా ఉండి చూసుకుంటానని, బాధ్యతగా తీసుకుంటానని చెప్పిన అక్క.. అట్ల చేసుడేందని అడిగిన” అని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. 

6 గంటలు మాట్లాడి కూడా మైక్​ ఇయ్యలేదనుడేంది?

అసెంబ్లీలో తాము ప్రజాస్వామ్యబద్ధంగానే ముందు కు వెళ్లాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్​ అన్నారు. ‘‘హరీశ్​రావు ఒకే ఇష్యూలో 2 గంటల 11 నిమిషాలు, కేటీఆర్​ 2 గంటల 35 నిమిషాలు మాట్లాడారు. ఇక  డిమాండ్స్​ మీదనే జగదీశ్​ రెడ్డి ఒక గంట10 నిమిషాలు మాట్లాడిండు. వీళ్లు ముగ్గురు కలిసి ఇంటర్వెన్షన్స్​ లేకుండానే ఆరు గంటలు మాట్లాడారు. 

అంత మాట్లాడి ఇంకా తమకు మైక్​ ఇయ్యలేదని అంటున్నారు. సబితక్కను కూడా బుల్డోజ్​ చేయలేదు కదా. మైక్​ ఇచ్చినం. నేను మాట్లాడిన తర్వాత ఆమె కూడా మైక్​ ఇస్తే చెప్పుకున్నారు కదా. రాజకీయల్లో వ్యక్తిగతంగా మాట్లాడుకునేవి కలిసి ఉన్నా, వీడిపోయినా వాటిని ప్రస్తావించం. నేను ఎప్పుడూ ఆ లైన్​ పాటిస్త. సబితక్కనే వ్యక్తిగతం మాట్లాడి ప్రస్తావించినందుకు నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఇంకా కొంత మిగిలింది ఉంది అని చెప్పిన” అని ఆయన పేర్కొన్నారు.  

అన్నింటి మీద మాకంటే వాళ్లే ఎక్కువ మాట్లాడిన్రు

అసెంబ్లీలో అన్ని అంశాలపైనా చర్చ జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి​ తెలిపారు. ‘‘బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో డిబేట్ జరిగింది. అందులో 25 శాతం కూడా మేం మాట్లాడలేదు. వాళ్లే(బీఆర్​ఎస్​) ఎక్కువ మాట్లాడారు. కంబైన్డ్​ స్టేట్​లో కూడా ఇంతకంటే ఎక్కువ చర్చ జరగలేదు. గ్రాంట్స్​ మీద, బడ్జెట్​ మీద ప్రభుత్వం నుంచి రిప్లై ఇచ్చినం. కేటీఆర్​ అడిగినదానికంతా సభ నాయకుడిగా సమాధానాలిచ్చిన. 

మేం మోర్​ డెమోక్రటిక్​గా, ఒపెన్​ మైండ్​తో ఉన్నం. వాళ్లు చర్చలను తప్పుదోవ పట్టించినా. ప్రభుత్వం వైపు నుంచి బాధ్యతతో వ్యవహరించినం. షెడ్యూట్​ ప్రకారం జులై 31లోపు బడ్జెట్ కు ఆమోదం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన తర్వాత ఫుల్​ బడ్జెట్​ పెట్టాలని పోయిన ఫిబ్రవరిలో ఓటాన్​ పెట్టినం. కేంద్ర ప్రభుత్వం జులై 23న బడ్జెట్​పెట్టిన తర్వాత అందులో ఏం వచ్చినయో చూసుకుని  25న మేం బడ్జెట్​ పెట్టినం. 

ఎట్లయినా 31వ తేదీలోపు బడ్జెట్​పైనా, పద్దులపైనా, ద్రవ్యవినిమయ బిల్లుపైనా చర్చ జరిగి ఆమోదం తెలపాలి.. సభలో మేం ఒక్క నిమిషామైన వేస్ట్​ చేసినమా? ఒక్కొక్క రోజు 16–17 గంటలు చర్చ పెట్టినం. అదే ఒక్కో రోజు 3 గంటలు మాత్రమే సభ నడిపితే ఎన్నిరోజులు అవుతుంది? చర్చకు ఇవ్వాల్సినంత సమయం ఇచ్చినం. కేంద్ర ప్రభుత్వం 23న బడ్జెట్​ పెట్టడంతో మాకు ఐదు రోజులు సమయమే మిగిలింది. ఒకవేళ కేంద్రం 15న పెడితే మేం కూడా ముందే పెట్టేవాళ్లం. ఇంకా ఎక్కువ చర్చ చేసేవాళ్లం” అని ఆయన పేర్కొన్నారు.  

భట్టి బాధితుడు.. అందుకే ఫీల్​తో మాట్లాడిండు

సభలో కాంగ్రెస్​ సభ్యులు ఎవరి సబ్జెక్ట్​ వాళ్లు మాట్లాడుతున్నారని, సమన్వయం లేదనే మాట రాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘నాయకుడిగా నేను ముందర ఉండి కొట్లాడితే మావాళ్లకు కూడా కొంత సపోర్ట్​గా ఉంటది. మాకెందుకులే అనే ధోరణి మంత్రులకు ఏ మాత్రం లేదు. నేను చర్చ చేస్తుంటే.. భట్టి విక్రమార్క వచ్చి బీఆర్​ఎస్​ వాళ్ల చరిత్ర మొత్తం చెప్పిండు. నాకెందుకులే అనే ధోరణి ఉంటే భట్టి ఔట్​ అండ్​ ఔట్​ చెప్పరు కదా. 

ఆయన కూడా బాధితుడు. బాధితులకే ఆ ఫీల్​ ఎక్కువ ఉంటది’ అని ఆయన పేర్కొన్నారు. తన కొడుక్కు టికెట్​ రాకుండా అడ్డుపడ్డారని సబితా ఇంద్రారెడ్డి మీడియా చిట్​చాట్ లో చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ.. ‘‘సబితక్క కొడుకు టికెట్​ విషయంలో మేమెందుకు అడ్డుపడుతాం. 2018లో​ సబితక్కకు కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చింది.. అప్పుడు కొడుకుకు ఇవ్వలేదంటే నాడు రాజేంద్రనగర్​ టికెట్​ కూటమి పొత్తులో  భాగంగా వేరే పార్టీకి పోయింది.

 అట్ల చాలామంది టికెట్లు పోయాయి. 2014లో సబితక్కకు టికెట్​ రాకపోతే ..  2018లో ఉత్తమ్​ టికెట్ ఇప్పించిండు కదా” అని అన్నారు.  ఇటీవల బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి కేటీఆర్​ను ప్రతిపక్ష నేత చాంబర్​లో కలవడం, వారితో మాట్లాడటంపైనా సీఎం రేవంత్​ స్పందించారు.  ‘‘బండ్ల కృష్ణమోహన్​ కలిస్తే టీ తాగడానికి కలిసుండొచ్చు. 

నా దగ్గరికి ఎనిమిది, పది మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు  మొన్ననే వచ్చి అద్దగంట సేపు కూర్చొని చాలా విషయాలు మాట్లాడిపోయారు. అంతమాత్రాన ఏదో అనుకుంటే ఎట్ల? కలవడం,  టీ తాగడం, కలిసి మాట్లాడుకోవడం అనేది రాజకీయ నిర్ణయాలకు సంబంధం లేదు. ఎవరు ఎవరినైనా కలవొచ్చు” అని ఆయన అన్నారు.  

సునీతక్క కోసం పోతే నామీద కేసులైనయ్​

2018లో నర్సాపూర్​ కాంగ్రెస్​ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ఎన్నికల బరిలో దిగారని, ఆ ఎన్నికల ప్రచారానికి వెళ్తే తనపై రెండు కేసులు పెట్టారని, ఇప్పుడు ఇంకా ఆ కేసుల చుట్టే తాను తిరుగుతున్నానని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘‘నేను నర్సాపూర్​ ఎన్నికల ప్రచారం కోసం ఆ అక్క(సునీతా లక్ష్మారెడ్డి) దగ్గరికి పోతే నాపై రెండు కేసులైనయ్​. నర్సాపూర్​ పీఎస్​లో ఒకటి.. కౌడిపల్లి పీఎస్​లో ఒకటి. 341, 188, 504, 506 సెక్షన్లు పెట్టిన్రు. 

నా కేసులు అట్లనే ఉన్నయ్​. నేను కేసుల చుట్టూ తిరుగుతున్న. అట్లాంటిది ఆ అక్క బీఆర్​ఎస్​లోకి పోయింది. అట్ల పోయిన అక్క.. ఈ తమ్ముడి కోసం ఏం చేయాలి? అరే తమ్ముడూ.. నా ఎన్నికల ప్రచారానికి వస్తే నీపై కేసులైనయ్​ కదా.. తీసేయిస్తా అని చెప్పాలి. అక్క అట్ల చేసిందా? చేయలేదే! అక్క మాత్రం మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ పోస్టు తీసుకున్నది. ‘నేను  అక్క మాటలు నమ్మి ఆమె ఎన్నికల ప్రచారానికి పోయి మోసపోయిన.. నువ్వు పిచ్చోడిలాగా అదే పనిచేస్తున్నవు” అని కేటీఆర్​కు సభలో సూచన చేసిన. నేను ఏమైనా పేరు తీసుకున్ననా? లేదు కదా నేను సీతక్కను కూడా అక్క అనే అంట’’ అని ఆయన తెలిపారు.  

కేసీఆర్​కు ప్రతిపక్ష హోదా ఎందుకు?

‘‘కేటీఆర్​కు ట్రైనింగ్​ ఇవ్వడానికే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేనట్టుంది. సభలో బీఆర్​ఎస్​కు కేటీఆర్​, హరీశ్​రావే సరిపోతరనుకుంటే.. కేసీఆర్​ను ప్రతిపక్ష నాయకుడిగా తీసెయ్యండి మరి. ఆయనకు రాష్ట్రం పట్ల బాధ్యత లేదు.. ప్రజల పట్ల పట్టింపు లేదు. అధికారం ఉంటే ఉంట.. లేకపోతే ఉండ.. అన్నట్లుగా కేసీఆర్​ తీరు తయారైంది. ఆయనకు అధికారమే కావాలి. 

అధికారం ఉంటేనే సభకు వస్తడు.. లేదంటే రాడు. ఎంపీగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్​కు సక్కగా పోలే” అని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. కేసీఆర్​కు ప్రతిపక్ష హోదా ఈ సెషన్​తోనే ముగుస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అది నేనెట్ల చెప్త. ఆయనను ఫ్లోర్​ లీడర్​గా మేం చేయలేదు కదా” అని అన్నారు.