బ్రేకప్ అయిందని కుంగిపోతున్నారా.. ఆ బాధ నుంచి ఇలా బయటపడండి

కలిసి ఉన్నన్ని రోజులు ప్రేమ మధురంగానే ఉంటుంది. కానీ, విడిపోయాకే అది కఠినంగా మారుతుంది. ఇది ప్రేమికులను ఎంతో బాధలోకి నెట్టేస్తుంది. విడిపోవడానికి ఎన్నో కారణాలున్నా బ్రేకప్ బాధనే మిగులుస్తుంది. కొందరిలో ఆ బాధ కొన్ని రోజులే ఉంటుంది. ఇంకొందరిలో మాత్రం ఏండ్లు గడిచినా ఆ బాధ పోదు. పాత సంగతులను తలుచుకుంటూ కుంగిపోతారు.

జీవితం నాశనమైపోయింది అనుకుంటారు. కానీ, అది చాలా తప్పు అంటున్నారు సైకాలజిస్టులు. కొన్ని టిప్స్ పాటిస్తే ప్రేమగాయాల నుంచి బయటపడొచ్చు అని కూడా చెప్తున్నారు. 

ఎక్కువ ఆలోచించొద్దు..

కలకాలం కలిసి ఉంటారని ఎక్కువ ఊహించుకున్న జంట విడిపోతే దాని ఎఫెక్ట్ ఇద్దరి మీదా ఉంటుంది. బ్రేకప్ గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. అలా ఆలోచించడం అంటే స్ట్రెస్ ని పెంచుకోవడమే. అది జీవితాన్ని గందరగోళంలోకి నెడుతుంది. అసలు ప్రాబ్లం ఏంటో అర్థమయ్యాక, ఫెయిల్ అయిన ప్రేమ గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్లడమే బెటర్ అంటున్నారు. 

తొలిప్రేమ అయితే...

ఫస్ట్ లవ్ కు ప్రయారిటీ ఉండటం సహజం. అలాంటి లవ్ కూడా బ్రేకప్ అయితే... రోజులు గడుస్తున్నా కూడా దాని పెయిన్ వెంటాడుతుంది. కానీ, ఆ లవ్ మళ్లీ తిరిగి రాదని తెలిశాక దాన్ని జ్ఞాపకంగా చూడాలి. అంతేకానీ, ఏడుస్తూ కూర్చుంటే మిగిలేవి కష్టాలే తప్ప.. ప్రేమ కాదు. 

పని చేసుకోవాలి..

బ్రేకప్ అయిన లవ్ గురించే ఆలోచిస్తూ.. తమ గురించి తాము ఆలోచించుకోవడం మానేస్తే కుదరదు. ప్రేమ తాలూకు గాయాలకు సరైన ఆయింట్మెంట్.. 'ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోవడమే'. మనసులో ప్రేమ బాధను మోస్తుంటే కంట్లో నీళ్లు నిండుతాయేమో! కానీ, కడుపు నిండదు. 

ఎలిమినేట్..

కొత్త ఆలోచనలే మైండు ఫ్రెష్ గా ఉంచుతాయి. తిరిగి రాదనుకున్న ప్రేమ గురించి ఆలోచిస్తే మైండ్ ఆ విషయాల చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఆ గుర్తులేవైనా ఉంటే మైండ్ నుంచి తీసేయాలి. కొత్త విషయాల మీద ఫోకస్ చేయాలి. పోయిన ప్రేమ గురించి ఆలోచించే కంటే... ఫ్యూచర్ గురించి ఆలోచించడం బెటర్. 

రాసుకోవాలి..

సరైన ఆలోచనలను పేపర్ మీద రాసుకోవాలి. అదే మైండ్ మ్యాపింగ్. ఏఏ పనులు చేయాలి? ఇది వరకు చేసిన తప్పులేంటి? చేయకూడని పనులేంటి? లాంటివి ఆలోచించి క్లియర్ గా మ్యాపింగ్ చేసుకోవాలి. అప్పుడు ఎవరి మీద వాళ్లకు కాన్ఫిడెన్స్ వస్తుంది. "జీవితంలో ఏమి కోల్పోయినా.. కష్టపడి తిరిగి సాధించొచ్చు. కానీ జీవితాన్నే కోల్పోయే పరిస్థితులు ఈ బ్రేకప్ వల్ల తెచ్చుకోవద్దు" అంటున్నారు ఎక్స్ పర్ట్స్.