మన ఆటగాళ్లను ప్రోత్సహిస్తే రాణిస్తరు

  •      ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ట్రైనింగ్ ఇప్పిస్తం
  •     స్కూల్స్​లో స్పోర్ట్స్​కు ప్రాధాన్యత ఇస్తం: భట్టి విక్రమార్క
  •     బీసీసీఐతో మాట్లాడి స్టేడియం నిర్మిస్తామని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర క్రీడాకారులను సరైన రీతిలో ప్రోత్సహిస్తే ప్రపంచ స్థాయిలో రాణిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. క్రీడల అభివృద్ధి, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి రూ.350 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రూ.196 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. శుక్రవారం శాసన మండలిలో తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్ కింద వివిధ క్రీడల్లో పతకాలు, అవార్డులు పొందిన ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బిల్లుపై చర్చ నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ‘‘రాష్ట్రంలోని ప్రతి స్కూల్​లో గంట టైమ్ స్పోర్ట్స్​కు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మెడల్స్ సాధించిన తర్వాత క్రీడాకారులను ప్రోత్సహించడం కాదు.. అంతకుముందే వారికి ట్రైనింగ్ ఇస్తే బాగుంటది. ఇలా చేయడంతో క్రీడలపట్ల ఆసక్తి ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటది. 

బహుమతులకు కేటాయించే నిధులతో నైపుణ్యంగల వారికి శిక్షణ ఇప్పిస్తే బాగుంటది’’అని అన్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ప్రజా ప్రతినిధులకు కూడా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. బీసీసీఐతో మాట్లాడి.. రాష్ట్రంలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. 

స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తాం

పంద్రాగస్టు రోజు అన్ని గవర్నమెంట్ స్కూల్స్​లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని భట్టి అన్నారు. ప్రభుత్వ క్రీడా ప్రాంగణాల్లో తరుచూ వివిధ రకాల స్పోర్ట్స్ ఈవెంట్​లు జరిగేలా చూస్తామని తెలిపారు. ‘‘స్పోర్ట్స్ క్లబ్​లు ఏర్పాటు చేసి క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలపై చర్చిస్తాం. కాన్‌‌‌‌స్టిట్యూషన్ క్లబ్ కోసం రూ.30కోట్లు కేటాయించాం. ఎక్కడ నిర్మించాలన్న విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’’అని అన్నారు. 

మండలిలో మూడు బిల్లులకు ఆమోదం

శాసన మండలిలో మూడు బిల్లులకు ఆమోదం లభించింది. ఈ బిల్లులను మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఇందులో తెలంగాణ సివిల్​కోడ్ అమెండ్​మెంట్ బిల్లు, తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్​మెంట్ బిల్లు కింద బాక్సింగ్​లో పతకాలు సాధించిన నిఖత్ జరీన్​కు, వరల్డ్ కప్ విజేతల టీమ్ సభ్యుడు, హైదరాబాద్​కు చెందిన మమ్మద్ సిరాజ్​కు గ్రూప్–1 ర్యాంక్ అధికారి పోస్టు ఇవ్వడానికి నిర్ధేశించిన బిల్లులకు కూడా మండలి ఆమోదం లభించింది. తెలంగాణ స్పోర్ట్స్ బిల్లుకు కూడా మండలిలో ఆమోదం లభించింది.