క్యాండిడేట్లు వస్తేనే కదులుతున్నరు..గడప దాటని క్యాడర్, ముందుకు సాగని ప్రచారం

  • ​అన్ని పార్టీల్లోనూ ఇదే ముచ్చట

నాగర్ కర్నూల్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల పోలింగ్​ దగ్గర పడుతున్నా ప్రచారం జోరుగా సాగడం లేదని జనాలు అంటుంటే, ఎండలు దంచికొడుతుంటే ఎలాగని నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఇదిలాఉంటే నాగర్​ కర్నూల్​ పార్లమెంట్​ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్​ క్యాండిడేట్​ మల్లు రవి, బీఆర్ఎస్​ క్యాండిడేట్  ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్, బీజేపీ క్యాండిడేట్  పోతుగంటి భరత్​ ప్రసాద్​ ఇప్పటికే నియోజకవర్గంలో రెండు రౌండ్ల ప్రచారం కంప్లీట్​ చేశారు. మార్నింగ్​వాక్​లు, రోడ్​షోలు, టిఫిన్​ సెంటర్లు, చాయ్​ హోటళ్లు, బస్టాండ్ల దగ్గర జనాలను పలకరించడం, మంచిచెడు అడిగి పనిలో పనిగా తనకే ఓటేయాలని కోరుతున్నారు.

మధ్యలో గుడులు, గోపురాలు, దర్గాలు ఏం కనిపించినా దండాలు మాత్రం మరుస్తలేరు. కార్నర్​ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఈ చివరన  అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్,​ నాగర్​కర్నూల్​ నియోజకవర్గాలు ఉంటే వనపర్తి నియోజకవర్గం మధ్యలోకి వస్తుంది. అటు చివరన ఏపీలోని కర్నూల్​కు దగ్గర ఉండే అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడమంటేనే భయపడుతున్నారు. 44 డిగ్రీల ఎండతో పగటిపూట చుక్కలు కనిపిస్తున్నయ్.

తనదైన శైలిలో ప్రచారం..

కాంగ్రెస్​ అభ్యర్థి మల్లు రవి తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. వాకర్స్​తో భేటీ అవుతూ, కొద్దిసేపు వాలీబాల్​ ఆడుతూ, బస్టాండ్​లో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలును ప్రస్తావిస్తున్నారు. తనకు ఎందుకు ఓటేయాలో సవివరంగా చెబుతున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లోనే ప్రచార జోరు..

ఎంపీ అభ్యర్థులు వస్తే తప్ప పలు నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించడం లేదు. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం పార్టీ ప్రచారానికి లీడ్​ తీసుకోవడం లేదని అంటున్నారు. మల్లుకు మద్దతుగా సీఎం రేవంత్​రెడ్డి బిజినేపల్లి బహిరంగ సభలో పాల్గొన్నారు. కొల్లాపూర్​లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తిలో మేఘారెడ్డి, అచ్చంపేటలో వంశీకృష్ణ క్యాండిడేట్​తో సంబంధం లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో అచ్చంపేట ముందుంది.

ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ ఉదయం పట్టణంలోని వార్డుల్లో ప్రచారం నిర్వహించి, రాత్రి వరకు మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లో రోడ్​షోలు నిర్వ హిస్తున్నారు. ప్రచార బాధ్యతలను మండల నాయకులను అప్పగించి అందరినీ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. నాగర్​ కర్నూల్, కల్వకుర్తి, గద్వాల, అలంపూర్​ నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ప్రచారం మొదలుకాలేదు. ఇంటలిజెన్స్​ నివేదికలు దాదాపుగా ఇవే నిర్దారిస్తున్నాయి. ప్రచారానికి డబ్బు సమస్య ఎదురవుతున్నట్లు సమాచారం. ఇది కూడా ఒక కారణంగా చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన జోష్, కసి పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో లేదన్న వాదనలున్నాయి.

స్పీడ్​ పెంచని కారు పార్టీ..

బీఆర్ఎస్​ క్యాండిడేట్​ ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​ కార్యకర్తల మీటింగులు, మార్నింగ్​ వాక్, కార్నర్​ షోలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గువ్వల, బీరం హర్షవర్దన్​ రెడ్డి, జైపాల్​ యాదవ్, మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి వీలును బట్టి ప్రచారంలో పాల్గొంటున్నారు. గద్వాల, అలంపూర్​లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి కీలకం కానున్నారు. ప్రచారంలో కారు స్పీడ్  కనిపించడం లేదన్న టాక్​ వస్తోంది. ప్రచార ఖర్చు, ఫైనాన్షియల్​ మ్యాటర్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ చూసుకుంటున్నారనే ప్రచారంతో ఖర్చులకు డబ్బులు ఎవరిని అడగాలనే పంచాయితీ నడుస్తోంది.

బీజేపీలోనూ కనిపించని జోష్..

బీజేపీ క్యాండిడేట్​ భరత్​ ప్రసాద్​ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నా, జోష్​ కనిపించడం లేదని అంటున్నారు. కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గాల్లో పార్టీకి నాయకత్వ సమస్య లేదు. నాగర్​ కర్నూల్, అచ్చంపేట, వనపర్తి, అలంపూర్​ నియోజకవర్గాల్లో సెకండ్​ క్యాడర్​ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ నాగర్​కర్నూల్​ బహిరంగ సభలో పాల్గొనడం, భరత్​ నామినేషన్​కు గుజరాత్​ సీఎం, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తదితరులు వచ్చినా జనాల్లో చర్చ జరగుతున్నంతగా ప్రచారంలో జోష్​ లేదన్న టాక్​ ఉంది. పెద్ద లీడర్లుగా ముద్రపడిన వారు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నానే ఆరోపణలున్నాయి. క్యాండిడేట్లు వస్తే తప్ప క్యాడర్​ కదలకపోవడం అన్ని పార్టీల్లో ఉంది. ప్రచార రథాలు పాటలు వినిపిస్తూ తిరుగుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఆరోపణలు, తిట్లు రిపీట్​ అవుతున్నాయి.