75 ఏళ్లకు మోదీ తప్పుకోకపోతే.. ఇతర మార్గాల్లో కుర్చీ దింపేస్తారు : సుబ్రమణ్యస్వామి

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.75ఏళ్లకు మోడీ తప్పుకోకపొతే, ఇతర మార్గాల్లో కుర్చీ దింపేస్తారని అన్నారు. సెప్టెంబర్ 17న మోడీ 74వ పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు సుబ్రహ్మణ్యస్వామి. 75ఏళ్ళ వయసు వచ్చాక స్వతహాగా తప్పుకొని యువతరానికి స్థానం కల్పించే ఆనవాయితీ బీజేపీలో ఉంది. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

సుబ్రహ్మణ్యస్వామి మోడీపై విమర్శలు చేయటం కొత్తేమి కాదు. గత వారంలో కూడా మోదీసర్కార్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్ జీడీపీ గ్రోత్ రేట్ విషయంలో మాయమాటలు చెబుతోందని, 2014 జీడీపీ గ్రోత్ రేట్ 5శాతంగా ఉంటే, 2016 నుండి 3.7శాతంగా మాత్రమే ఉందని ఎక్స్ వేదికగా మోదీసర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధించారు సుబ్రహ్మణ్యస్వామి.

మరి, బీజేపీలో ఉన్న అనధికారిక నియమం ప్రకారం 75ఏళ్లకు మోడీ రిటైర్ అవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇటీవల బీజేపీలోని పలువురు నేతలను ఉన్నత పదవుల నుంచి తొలగించిన తర్వాత ఈ అంశం చర్చనీయాంశం అయ్యింది. అయితే, ఈ నియమానికి మినహాయింపులు కూడా ఉన్నాయి... కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా కొనసాగటం గమనార్హం.