అవునా :భారతీయుల్లో 60 శాతం రోగాలు..సరైన ఫుడ్ తినకపోవటం వల్లే

గత కొన్నేళ్ళగా మనం ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇది మీరు గమనించే ఉంటారు..ముఖ్యంగా బయటి ఫుడ్..అంటే జంక్ ఫుడ్, రెస్టారెంట్లు, హోటళ్లు, వీధుల్లో చిరు వ్యాపారులు అమ్మే చాలా రకాల ఆహార పదార్ధాలకు మనం అలవాటు పడిపోయాం..బిజీ లైఫ్ కారణంగానో..కొత్త పదార్థాలను రుచి చూడా లనే ఇష్టంతోనే మనం రోటీన్ ఆహారంకంటే మార్కెట్లోకి వచ్చే ప్రతి ఫుడ్ ని తింటుంటాం..అయితే ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటోంది ఐసీఎంఆర్. 


సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే భారతదేశంలోని 56.4 శాతం మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ICMR వెల్లడించింది. ఇలాంటి వ్యాధుల నివారణ, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను ఎలా తీసుకోవాలో, నాన్ కమ్యూనికేబుల్ డెసీజ్ లను నిరోధించేందుకు 17 ఆహార మార్గదర్శకాలను బుధవారం( మే 8) వెల్లడించింది. 

గత కొన్ని దశాబ్దాలుగా భారతీయుల ఆహారపు అలవాట్లు గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇది నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు అంటే గుండె జబ్బులు, డయాబె టిస్, కిడ్నీ సమస్యల వ్యాప్తికి దారితీసింది..మరోవైపు పోషకాహార లోపంతో కొన్ని సమస్యలు చాలాకాలంగా కొనసాగుతూనే ఉన్నాయని ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ చెపుతున్నారు. 

ICMR ఆరోగ్య అనుబంధ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ ద్వారా గుండెజబ్బులు, బీపీ, డయాబెటిస్ లను 80 శాతం వరకు తగ్గించవచ్చని తెలిపింది.  అంతేకాదు అరోగ్యకరమైన జీవన శైలితో ఆకస్మిక మరణాలను నివారించవచ్చని చెప్పింది. 

మనం రోజు తీసుకునే ఆహారంలో చక్కెరలు, కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలను వినియోగిం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం, జంక్ ఫుడ్స్ తో పోషకాల లోపం, ఒబిసిటీ (అధిక బరువు ) సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. ఉప్పను తక్కువగా వాడటం, నూనెలు మితంగా వినియోగించడం తగ్గించాలని సూచించింది. దీంతోపాటు సరైన వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని తెలిపింది. 

స్థూలకాయం(ఒబెసిటి)  నివారించాలంటే ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రోటీన్ల కోసం ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వాటి లేబుల్ పై ఉండే సమాచారాన్ని తప్పని సరిగా చదవి వాటి గురించి తెలుసుకోవాలని సూచించింది.