IND vs AUS: కుటుంబ బాధ్యతలు మీకేం తెలుసు.. గవాస్కర్‌పై ఫించ్ ఆగ్రహం

త్వరలో భారత జట్టు.. ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ ఇరు జట్ల నవంబర్ 22 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ మొదటి రెండు టెస్టులకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే అతను ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్టు సమాచారం. 

రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో.. మొదటి రెండు టెస్టుల్లో వైస్ కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. ఈ విషయం కాస్త భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెవిన పడగా.. ఆయన కొన్ని విమర్శలు చేశారు. "వ్యక్తిగత కారణాల వల్ల రెండు టెస్టులకు దూరమైన ఆటగాడు.. తిరిగి జట్టులో చేరే ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వాల్సిన అవసరమేంటని మాజీ దిగ్గజం సెలెక్టర్లను ప్రశ్నించారు. మొదటి రెండు టెస్టులకు రోహిత్ అందుబాటులో ఉండకపోతే, అతన్ని ఒక బ్యాటర్‌గా మాత్రమే పరిగణించాలని సెలక్షన్ కమిటీకి సూచించారు. అదే సమయంలో కొత్త కెప్టెన్‌ను ప్రకటించాలని కోరారు.."

ఈ విమర్శలపై స్పందించిన ఆసీస్ మాజీ ఓపెనర్ ఆరోన్ ఫించ్.. సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలను ఖండించారు. భార్య బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు.. ఏ తండ్రైనా పక్కనుండాలని కోరుకుంటారని ఫించ్ అన్నారు. తల్లిదండ్రులకు అదొక అందమైన క్షణమని ఆసీస్ ఓపెనర్ చెప్పుకొచ్చారు.

భార్యాభర్తలకు అదొక అందమైన క్షణం

"నేను సన్నీతో పూర్తిగా విభేదిస్తున్నాను. రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఒకవేళ అతని భార్య బిడ్డకు జన్మనిస్తోందన్న కారణంగా రోహిత్ ఇంట్లో ఉండవలసి వస్తే, అదొక అందమైన క్షణం. కుటుంబ పెద్దగా అదొక బాధ్యత. ఎవరి భర్తైనా.. ఆ సమయంలో భార్య పక్కనే ఉండాలని కోరుకుంటాడు.. కావాలినంత సమయాన్ని తీసుకుంటాడు. ఆ విషయంలో మీకు ఈ సూచన అవసరం.." అని ఫించ్ అరౌండ్ ది వికెట్ పోడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు.

ఈ విషయంలో ఆరోన్ ఫించ్ వ్యాఖ్యలను భారత అభిమానులూ సమర్ధిస్తున్నారు. విదేశీ ఆటగాడినప్పటికీ, ఒక కుటుంబ పెద్దగా.. ఒక భర్తగా బాధ్యతలు ఎంత బాగా చెప్పాడో అని ప్రశంసిస్తున్నారు.