కావూరి హిల్స్​ పార్క్​లో కట్టడాలు నేలమట్టం

  • హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా, జీహెచ్​ఎంసీ చర్యలు
  • పార్క్​ స్థలం పదేండ్ల కింద స్పోర్ట్స్​సెంటర్​కు లీజు
  • అందులో బ్యాడ్మింటన్​, వాలీబాల్​ కోర్టులు, డ్రెస్​ చేంజింగ్​ రూమ్​, వాష్​రూంలు కట్టిన నిర్వాహకులు
  • అక్రమాలపై హైకోర్టును ఆశ్రయించిన స్థానికులు
  • కూల్చేయాలని కోర్టు ఆర్డర్​.. అమలు చేసిన ఆఫీసర్లు

మాదాపూర్, వెలుగు : హైదరాబాద్​ కావూరి హిల్స్​లోని పార్కు స్థలంలో వెలసిన అక్రమ కట్టడాలను హైడ్రా, జీహెచ్​ఎంసీ అధికారులు కూల్చివేశారు. సోమవారం పోలీసుల బందోబస్తు నడుమ వాటిని నేలమట్టం చేశారు. పార్కు స్థలాన్ని లీజుకు తీసుకున్న స్పోర్ట్స్​ సెంటర్​ నిర్వాహకులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన పార్కు స్థలాన్ని కొందరు సొసైటీ సభ్యులు స్పోర్ట్స్​ సెంటర్​కు లీజ్​కు ఇచ్చారని, అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని కాలనీ సొసైటీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా.. వాటిని కూల్చేయాలని జీహెచ్​ఎంసీ, హైడ్రాకు ఇటీవల న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాటిని అధికారులు నేలమట్టం చేశారు. 

25 ఏండ్లకు లీజుకు తీసుకొని..!

మాదాపూర్​ కావూరి హిల్స్​ ఫేస్​ 1లో లేఅవుట్ అప్పుడు కొంత ఖాళీ స్థలాన్ని పార్కు కోసం వదిలిపెట్టారు. ఈ పార్కు స్థలాన్ని సొసైటీ సభ్యులు కొందరు ఓ స్పోర్ట్స్​ సెంటర్​కు 10 ఏండ్ల కింద 25 ఏండ్ల కోసం లీజుకు ఇచ్చారు. దీంతో స్పోర్ట్స్​ సెంటర్​ నిర్వాహకులు పార్కు స్థలంలో బ్యాడ్మింటన్​ కోర్టు, వాలీబాల్​ కోర్టు, డ్రెస్​ చేంజింగ్​ రూమ్​, వాష్​రూంలు నిర్మించారు. నిర్వాహకులు జీహెచ్​ఎంసీకి రెండు నెలల పాటు ఫీజులు చెల్లించి ఆ తర్వాత ఫీజులు కట్టడం మానేశారు. నాలుగు నెలల కింద కావూరి హిల్స్​ సొసైటీ సభ్యులు.. కాలనీ పార్కు స్థలంలో స్పోర్ట్స్​ సెంటర్​ నిర్వహించడంపై చందానగర్​ సర్కిల్​ జీహెచ్​ఎంసీ అధికారులకు కంప్లైంట్​ చేశారు.

 దీంతోపాటు కాలనీ అసోసియేషన్​ సభ్యులు హైకోర్టుకు వెళ్లారు. కావూరిహిల్స్​ పార్కులో వెలసిన అక్రమాలను తొలగించాలని హైడ్రా, జీహెచ్​ఎంసీని హైకోర్టు ఆదేశించింది. దీంతో సోమవారం జీహెచ్​ఎంసీ, హైడ్రా అధికారులు పార్కు స్థలంలోని టెన్నిస్​ కోర్టు, వాలీబాల్​ కోర్టు, డ్రెస్​ చేంజింగ్​ రూమ్​, వాష్​రూంలను కూల్చివేశారు. కూల్చివేతల సందర్భంగా పోలీసులు బందోబస్తు కల్పించారు. తాము పార్కు స్థలాన్ని 25 ఏండ్లపాటు లీజుకు తీసుకున్నామని, లీజు గడువు ముగియక ముందే కూల్చేయడం ఏమిటని స్పోర్ట్స్​ సెంటర్​ నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కూల్చివేతలు పూర్తయిన తర్వాత చందానగర్​ సర్కిల్​ టౌన్​ ప్లానింగ్​ అధికారులు అక్కడ ‘జీహెచ్​ఎంసీ పార్కు స్థలం 1’ అంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. 

కోర్టు ఆదేశాలతోనే : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

‘‘మాదాపూర్​ కావూరి హిల్స్​ పార్కు స్థలంలో వెలసిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కాలనీ అసొసియేషన్​ సభ్యులు హైకోర్టుకు వెళ్లారు. ఆ నిర్మాణాలను కూల్చేయాలని హైకోర్టు ఆర్డర్​ వేయడంతో సోమవారం ఉదయం జీహెచ్​ఎంసీ టౌన్​ ప్లానింగ్​ విభాగంతో కలిసి హైడ్రా అధికారులు కావూరిహిల్స్​ పార్కు స్థలంలోని మూడు షెడ్లు, టెన్నీస్​ కోర్టును కూల్చేశారు” అని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ వెల్లడించారు. ఆక్రమణకు గురైన 2,000 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని, జీహెచ్​ఎంసీ చందానగర్​ సర్కిల్ అధికారులకు అప్పగించామని వివరించారు.