హైడ్రా దూకుడు..చెరువుల్లో ఆక్రమణలపై కదులుతున్న అధికారులు

  •      చింతల చెరువు బఫర్ జోన్​లో కబ్జాల తొలగింపు
  •     చెరువు జాగాలో కట్టిన 52 ఇండ్లు కూల్చివేత 
  •     రోజుకో చోట చర్యలు తీసుకుంటున్న ఏజెన్సీ

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దూకుడు పెంచింది. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులు కూడా అదే తరహాలో చర్యలు తీసుకుంటున్నారు. రోజుకోచోట కూల్చివేతలు జరుపుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఇందుకోసం పోలీసుల సాయాన్ని తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలకు నేరుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెళ్లి స్థానికులతో మాట్లాడుతున్నారు. 

అధికారులతో మరో దఫా విచారణ జరిపి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఆక్రమణలను తొలగిస్తున్నారు. తాజాగా మంగళవారం గాజులరామారంలోని చింతల చెరువులోని బఫర్ జోన్​లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. దేవేందర్​నగర్, గాజుల రామారానికి సంబంధించిన బఫర్ జోన్​తో సహా 44.3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎల్​టీఎఫ్) పరిధిలో అక్రమంగా నిర్మాణాలను చేప ట్టినట్టు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో పాటు హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టడంతో వెలుగు చూసిన ఈ అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు.

 రంగనాథ్ ఆదేశాల మేరకు ఆర్ఎఫ్ఓ పాపయ్య నేతృత్వంలో డీఎస్పీ శ్రీని వాస్, ఇన్​స్పెక్టర్ బాల్​రెడ్డి సహకారంతో హైడ్రా విభాగం మార్షల్స్, డీఆర్ఎఫ్ బృందాలతో మూడు జేసీబీల సాయంతో ఈ  అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చివేతలకు అడ్డుపడిన వారిని  పోలీసుల సాయంతో నిలువరించారు.

చెరువులపై స్పెషల్ ఫోకస్

చెరువులు ఆక్రమణకు గురికాకుండా వాటి రక్షణలో హైడ్రా కీలకపాత్ర పోషిస్తుంది. భారీ వర్షాల సమయంలో వరద నీరు ప్రధాన మార్గాల గుండా చెరువులకు చేరుకోవాల్సి ఉంది. కానీ, ఈ చెరువుల ఆక్రమణ కారణంగా వరద నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ అంశంపై కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

 రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పవర్స్ ఇవ్వడంతో ఎక్కడ కూడా వెనక్కి తగ్గడంలేదు. ముఖ్యంగా చెరువుల కబ్జాపై వస్తున్న ఫిర్యాదులపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. చెరువుల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు ఎక్స్ పర్ట్స్ నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకున్నారు.

నిర్భయంగా ఫిర్యాదు చేయండి: రంగనాథ్

చెరువులు, పార్కు స్థలాలు తదితర ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే హైడ్రాకు ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ ఏవీ రంగానాథ్ తెలిపారు. హెల్ప్​లైన్ నంబర్లు 18005990099, 040–-29560509, 040–-29560596, 040–-29565758 లేదా 040–-29560593కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.  సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా తనను వ్యక్తిగతంగా కలిసి కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అపాయింట్మెంట్ కోసం 7207923085 నంబర్​కు మెసేజ్ చేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.