పేద, మధ్య తరగతి జీవితాలకు హైడ్రా భరోసా ఇవ్వాలి

హైదరాబాద్  మహానగరంలో  వరద ముప్పు తప్పించడంతోపాటు  చెరువులు,  కుంటలను  పునరుద్ధరిస్తూ  భూగర్భ జలాల పెంపుదల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం.  అనేక కష్టాలు, నష్టాలు, పైరవీలు, ఒత్తిళ్లు ఎదురువస్తున్నా  ప్రభుత్వం దూసుకెళ్తుండటం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.  నీటి వనరుల పరిరక్షణకు  రేవంత్​ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది.  

ఎన్నో దశాబ్దాలుగా  వరదలు  వచ్చినప్పుడు  ప్రజలు ఆందోళన  వ్యక్తం చేసినా  ఆ  తర్వాత కాలంలో గత ప్రభుత్వాలు దానిపై పెద్దగా శ్రద్ధ  చూపలేదు.  ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ఈ అక్రమ నిర్మాణాల తీసివేత దీర్ఘకాలంలో తెలంగాణ రాష్ట్రానికి మంచి చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. 

దశాబ్దాల కింద ఎంతో  చెమటోడ్చి కడుపు  మాడ్చుకొని,  కాస్త ధర తక్కువ అని సామాన్యులు ఆ స్థలాలను కొని నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలి. వారి అమాయకత్వాన్ని కబ్జాదారులు సొమ్ము చేసుకొని అమ్మి ఉండవచ్చు. అయితే, అది నాలా కింద ఉందని కానీ,  చెరువులో  ఒక భాగమని కానీ వారికి తెలియకపోవచ్చు. 

కొన్నిసార్లు అది చెరువులో  భాగమని తెలిసినా ప్రభుత్వానికి సంబంధించిన హెచ్ఎండిఏ,  మున్సిపాలిటీ,  గ్రామపంచాయతీ అనుమతులు ఇచ్చినందున వాటికి చట్టబద్ధత ఉంది అని భావించి కొనుక్కున్న సామాన్య ప్రజలు కూడా ఉన్నారు.  దశాబ్దాలుగా నివాసం ఏర్పరచుకున్న పేదలు ఎంతోమంది ఉన్నారు.  సొంత ఊర్లో ఉన్న తమ భూములు అమ్ముకొని  ఇల్లు  కొనుక్కున్నవారు,  30 సంవత్సరాల పైగా సర్వీస్ చేసి  రిటైర్మెంట్ డబ్బులతో కొనుక్కున్నవారు  ఉన్నారు.  వీరితోపాటు ఎంతో కష్టపడి కుటుంబంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగం పొందిన యువకులు తమ జీతం ఆధారంగా బ్యాంకు లోను తీసుకొని కొనుగోలు చేసి ప్రతి నెల తమ జీతంలో సింహభాగం ఈఎంఐ రూపంలో క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వేతన జీవులు కూడా ఉన్నారు. 

వర్షాకాలం వచ్చిందంటే అరచేతిలో ప్రాణాలు

వర్షాకాలం వచ్చిందంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించిన బడుగుజీవులు ఎంతోమంది ఉన్నారు. అక్కడక్కడా  పిడుగు పడినట్టుగా తమ ఇల్లు కళ్ళముందే కూల్చివేస్తుంటే కడుపులోని పేగులన్నీ కదిలేటట్టు దుఃఖిస్తున్నారు ఈ సగటు సామాన్య ప్రజలు.  చిన్నా చితక వస్తువులు అమ్ముతూ,  చిన్న ఉద్యోగాలు చేసుకుని  జీవనోపాధి సాగించేవారున్నారు.  నేడు అక్కడక్కడ  అక్రమ నిర్మాణాలని కూల్చివేయటంతో వారు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచక  తల్లడిల్లుతున్నారు.  

 నేడు ప్రభుత్వం పెద్ద మనసుతో  నిరుపేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అర్హులైన వారికి ప్రాధాన్యతను ఇస్తామని పేర్కొన్నప్పటికీ, అవి ఏ రోజుకు, ఎప్పటికి ఇస్తారో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ  నేపథ్యంలో వారికి  సరైన రీతిలో నష్టపరిహారం చెల్లించేవిధంగా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా కనబడుతుంది. 

పేదలకు నష్టపరిహారం చెల్లించాలి

ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉండి నిర్మాణాలు చేపట్టి,  ఇంటి పన్ను,  విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్నటువంటి గృహ యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారాన్ని  హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది.   చెరువులు,  కుంటలు ఆక్రమణలను తొలగిస్తూ ఆ చెరువుల పూడిక తీస్తూ వాటి చుట్టూ తక్షణమే కంచెవేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం పూనుకుంటేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. 

 ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ..  ఇప్పటికే నివాసముంటున్న గృహాలను కూల్చివేయబోమని ప్రకటించటం ఆహ్వానించదగినది. వారికి న్యాయం చేస్తూనే.. నాలాలు, చెరువుల పరిరక్షణ ఏ విధంగా పూర్తి అవుతుందో కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.  ఎందుకంటే ఎఫ్ టి ఎల్ పరిధిలో  కొన్ని నివాసాలు ఉన్నప్పుడు ఆ స్థాయి వరకు నీటిని ఆ చెరువులో  భద్రపరచడం సాధ్యం కాదు.  

అదే కాకుండా ఆ కుటుంబం లేదా ఆ ఇల్లు నీటిలో మునిగిపోయే  ప్రమాదం ఉంటుంది.  కాబట్టి వీటిపైన కూడా స్పష్టమైన వైఖరి తీసుకొని తగు నష్టపరిహారం ఇచ్చి ఆయా కుటుంబాలను సైతం మరొక సురక్షిత ప్రాంతానికి తరలించే ఆలోచన కూడా చేయాలి. 

సామాన్యులకు న్యాయం చేయాలి

ఇలాంటి చర్యల ద్వారా సామాన్యుడికి న్యాయం వర్తిస్తుందని భావన కూడా ప్రజల్లో కలుగుతుంది.  గృహాలకు అనుమతులు ఇచ్చి,  నిర్మాణం చేపట్టని కుటుంబాలకు పూర్తిగా నష్టపరిహారం ఇవ్వకుండా చెరువుల పేరుతో స్వాధీనం చేసుకోవడం కూడా ఆయా కుటుంబాలను అన్యాయం చేసినట్లు అవుతుంది.   కాబట్టి ఆ ఇంటి యజమానులకు కనీస సమయాన్ని ఇస్తూ వారికి తగినట్టుగా నష్టపరిహారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినట్లయితే ఈ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.  అదేవిధంగా,  ఈ రాష్ట్రాన్ని కూడా వరద ముప్పు ప్రాంతాల నుంచి కాపాడుతూ భూగర్భ జలాలను పెంచి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేసిన వారు అవుతారు.

- చిట్టెడ్డి  కృష్ణారెడ్డి,  అసోసియేట్ ప్రొఫెసర్,  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ