ఔటర్​ దాటిన హైడ్రా..పెద్దచెరువులోని అక్రమ నిర్మాణాల పరిశీలన

  • ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోని  అక్రమ నిర్మాణాల పరిశీలన
  • రాచ కాల్వ, ఫిరంగి కాల్వ కబ్జాకు గురైనట్లు గుర్తింపు
  • ఇన్నాళ్లూ ఓఆర్​ఆర్​ లోపలే కూల్చివేతలు..  ఇకపై అవతలా యాక్షన్​?
  • జిల్లాలకూ హైడ్రాను విస్తరించాలని పెరుగుతున్న డిమాండ్లు

హైదరాబాద్ సిటీ / ఎల్బీనగర్, వెలుగు : హైడ్రా తన యాక్షన్​ను మరింత స్పీడప్​ చేసింది. చెరువులు, ప్రభుత్వ జాగాల్లోని కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్నది. ఫస్ట్​టైమ్​ ఔటర్​ రింగ్​ రోడ్డును కూడా దాటి.. ఇబ్రహీంపట్నంలోని పెద్దచెరువును పరిశీలించింది. అక్కడ ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్లలో బంగ్లాలు కట్టినట్లు గుర్తించింది. దీంతో ఔటర్​ అవతల కూడా హైడ్రా యాక్షన్​ ఉంటుందన్న చర్చ జరుగుతున్నది. ఇప్పటివరకు ఔటర్​రింగ్​రోడ్డు లోపల ఉన్న మాదాపూర్​ ఎన్​కన్వెన్షన్, గాజుల రామారం, రాజేంద్రనగర్, చందానగర్, బాచుపల్లి, బోడుప్పల్, కూకట్​పల్లి, అమీన్​పూర్, మాదాపూర్​ సున్నం చెరువు, దుండిగల్​పరిధిలోని పలు అక్రమ కట్టడాలను  హైడ్రా నేలమట్టం చేసింది. 

దీంతో జిల్లాల్లోనూ హైడ్రాను దించాలని, చెరువులను కాపాడాలన్న వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి టైమ్​లో సోమవారం ఔటర్​రింగ్ ​రోడ్డును దాటి హైడ్రా బయటకు రావడంతో ఆయా ఏరియాల్లోని అక్రమార్కుల గుండెల్లో దడపుడుతున్నది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఔటర్​రింగ్​రోడ్డు నుంచి 8 కిలోమీటర్ల అవతల ఉంటుంది. దీని పరిధిలోని రాచ కాల్వ, ఫిరంగి కాల్వ కబ్జాకు గురైనట్లు స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. స్థానిక అధికారులు కూడా హైడ్రాను రమ్మని రిక్వెస్ట్​ చేశారు. దీంతో సోమవారం సాయంత్రం హైడ్రా అసిస్టెంట్ కమిషనర్ పాపయ్య టీమ్​పెద్ద చెరువును పరిశీలించింది.

1,452 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కట్టిన నిర్మాణాలను ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు చూశారు. పెద్ద చెరువుకు ఆనుకుని ఉన్న ఇంద్రారెడ్డి కాలనీ, బృందావన్ కాలనీల్లోని ఫంక్షన్ హాల్, కొన్ని ఇండ్లు, సమీపంలోని మిల్లు.. ఉప్పర్ గూడ, పోచారం చర్లపటేల్ గూడ గ్రామాల్లో  ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు, కబ్జాకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఈ మధ్యను కట్టిన నిర్మాణాలనూ చూశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారుల నుంచి హైడ్రా అధికారులు వివరాలు తెలుసుకున్నారు. హైడ్రా బృందం వెంట ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, ఇరిగేషన్ డీఈ ఉషారాణి, ఏఈ రాజ్యలక్ష్మి, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.  

పరిధి పెరగనుందా?

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్  (ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ఏరియా)లోని చెరువులు, కుంటలను కాపాడేందుకు.. ప్రభుత్వ జాగాల రక్షణకు రెండున్నర నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్​గా రంగనాథ్​ను నియమించింది. రంగంలోకి దిగిన హైడ్రా.. ఔటర్​రింగ్​రోడ్డు లోపలున్న సుమారు పన్నెండు ప్రాంతాల్లోని ఆక్రమణలను నేలమట్టం చేసింది. వీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల నిర్మాణాలు ఉన్నా వెనక్కి తగ్గలేదు. కబ్జాల చెర నుంచి చెరువులను విడిపించడంలో హైడ్రా పాత్రను అన్నివర్గాలు స్వాగతిస్తున్నాయి. ప్రతి జిల్లా నుంచి తమ ఏరియాల్లోకి కూడా హైడ్రాను పంపాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా పరిధిని విస్తరించాలన్న డిమాండ్​ వస్తున్నది.

ఔటర్​ అవతలనే ఉన్న జన్వాడ ఫామ్​హౌస్​

ఔటర్​రింగ్​రోడ్డు అవతల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి ఎంతో మంది పెద్ద పెద్ద బిల్డింగులు ఫామ్​హౌస్​లు కట్టుకున్నారు.  ఔటర్​ లోపల ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో.. ఔటర్​బయట ఉన్న అక్కడి మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్​అధికారులు కూడా తమ పరిధిలోని చెరువుల జాగాలపై సర్వేలు చేయడం, ఆక్రమణలను గుర్తించడం లాంటి పనులు మొదలుపెట్టారు.  

ఔటర్​కు 10 కిలోమీటర్ల బయట ఉన్న మోకిలా –పుల్కాపూర్​ ఫిరంగి నాలాపై 20 వరకు ఫామ్​హౌస్​లు ఉండగా.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు 20 రోజుల కింద సర్వే చేశారు. సదరు నిర్మాణాల్లో చాలావరకు నాలాను ఆక్రమించి కట్టినవేనని గుర్తించారు. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు చెందినదిగా ఆరోపణలు ఉన్న జన్వాడ ఫామ్​హౌస్​ కూడా ఔటర్​ అవతలనే ఉంది.