హైడ్రా ఆన్​ఫైర్ .. గ్రేటర్ ​చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం

  • చందానగర్​ సర్కిల్​ఈర్ల చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేత
  • కూల్చివేతను పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
  • అక్రమ నిర్మాణాల సమాచారం ఇవ్వాలని పిలుపు

చందానగర్/గండిపేట, వెలుగు: గ్రేటర్​పరిధిలోని చెరువులను ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాలపై ‘హైడ్రా’ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. బఫర్​జోన్లు, ఎఫ్ టీఎల్​పరిధిలో నిర్మిస్తున్న బిల్డింగులను కూలగొడుతున్నారు. శనివారం కూడా కూల్చివేతలు కొనసాగాయి. పోలీస్​బందోబస్తు నడుమ బఫర్​జోన్లు, ఎఫ్ టీఎల్​పరిధిలోని నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ చందానగర్​సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను, అధికారుల తీరును వివరిస్తూ ‘బఫర్ జోన్​లోనూ.. పర్మిషన్లు ఇచ్చేశారు’ అనే శీర్షికన శనివారం ‘వెలుగు’లో స్టోరీ పబ్లిష్​అయింది. స్పందించిన హైడ్రా కమిషనర్​ఏవీ రంగనాథ్​వెంటనే రంగంలోకి దిగారు. 

65 మంది సిబ్బంది, డిమాలిష్​​వెహికల్స్​తో హఫీజ్​పేట డివిజన్​వైశాలీనగర్​లోని ప్లాట్​నంబర్​148, 149, 150 వద్దకు చేరుకున్నారు. నిర్మాణంలోని బిల్డింగులు ఈర్ల చెరువు బఫర్​జోన్ పరిధిలో ఉన్నాయని తేల్చారు. ఆ వెంటనే కూల్చివేత మొదలుపెట్టారు. మియాపూర్​పోలీసుల భారీ పోలీస్​బందోబస్తు నడుమ కూల్చివేత కొనసాగింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ దగ్గరుండి కూల్చివేతను పర్యవేక్షించారు.

 బఫర్​జోన్​లో ఇంటి నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన టౌన్ ప్లానింగ్​ఆఫీసర్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైశాలీనగర్​కు ఆనుకుని ఈర్ల చెరువు ఉంది. కొంత కాలంగా ఈ చెరువు బఫర్​జోన్ ఆక్రమణకు గురవుతోంది. 148,149,150 ప్లాట్లు అలా పుట్టుకొచ్చినవే. ఇరిగేషన్​అధికారులు ఎన్ఓసీ ఇవ్వకుండానే జీహెచ్ఎంసీ టౌన్​ప్లానింగ్ అధికారులు బిల్డింగ్స్​నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారు. అధికారుల సహకారంతో బిల్డర్లు మూడు మూడంతస్తుల బిల్డింగ్స్​నిర్మాణం చేపట్టారు. వాటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. 

శివరాంపల్లిలో తెల్లవారుజాము నుంచే.. 

రాజేంద్రనగర్ నియోజకవర్గం శివరాంపల్లిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. ఏకంగా బమ్ రుక్నథ్ దౌల చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు శనివారం తెల్లవారుజాము నుంచి కూల్చివేయడం మొదలుపెట్టారు. స్థానిక పోలీసులు బందోస్తు కల్పించారు. చెరువులు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి చేపట్టిన ఆక్రమణలను కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్లు దృష్టికి వస్తే వెంటనే 18005990099, 040-–29560509, 040-–29560596, 040–-29565758, 040–-295605935కు కాల్​చేసి చెప్పాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే తనను వ్యక్తిగతంగా కలిసేందుకు 72079 23085 నంబర్‌కు మెసేజ్ చేయాలని సూచించారు.

స్థలాలు, ఫ్లాట్లు కొనే ముందు జాగ్రత్త

చెరువులను ఆక్రమించి కడుతున్న బిల్డింగ్స్​ సమాచారాన్ని మాకు ఇవ్వండి ఆక్రమణలపై ప్రజలతోపాటు స్వచ్ఛంద సంస్థలు స్పందించాలి.చెరువుల సమీపంలో స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా చెరువు పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు ఇంటి స్థలాలు, అపార్ట్​మెంట్లు లభిస్తున్నాయంటే క్రాస్​చెక్​ చేసుకోవాలి. చెరువు ఎఫ్​టీఎల్, బఫర్​జోన్ ​పరిధిలో ఉందో.. లేదో చూసుకోవాలి. సమాచారం కోసం హైడ్రా ఆఫీసులో సంప్రదించండి. ప్రజలను అప్రమత్తం చేసేలా హైడ్రా వెబ్​సైట్​లో త్వరలో పూర్తి సమాచారాన్ని ఉంచుతాం. 
-  ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్