హైటెక్ ​సిటీ నాలాలపై హైడ్రా ఫోకస్

 

  • పైలెట్ ప్రాజెక్టు కింద  రెండు నాలాలపై సర్వే 

వారం రోజుల్లో పూర్తి చేసే ఛాన్స్​

ఇప్పటికే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్​జోన్లలో ఆక్రమణను కూల్చేస్తున్న హైడ్రా ఇప్పుడు హైటెక్​సిటీలోని నాలాలపై ఫోకస్ పెట్టింది. బాడాబాబులు చెరువులు ఆక్రమించి కట్టిన బిల్డింగులు పడగొట్టిన ఆ సంస్థ ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టు కింద ఇక్కడి రెండు నాలాలను సర్వే చేసేందుకు ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈ సర్వే ద్వారా ఈ నాలాలపై ఆక్రమణలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను అందజేసే అవకాశం ఉంది. తర్వాత సర్కారు ఆదేశాల మేరకు వాటిని ఏం చేయాలన్నది నిర్ణయిస్తారు. ఈ సర్వేకు వారం పట్టే అవకాశమున్నట్టు తెలుస్తుండగా, ఇప్పటికే హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం సమావేశమైనట్లు తెలిసింది.  

 వర్షాలు కురిసే టైంలో ఈజీ

ఇటీవల హైటెక్​సిటీ పరిధిలో కురిసిన వర్షాలకు కొన్ని కాలనీలు మునిగాయి. కొద్దిరోజుల్లో మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. దీంతో వానలు పడుతున్నప్పుడు హైటెక్​సిటీ పరిధిలో ఉన్న ఆ రెండు నాలాల సమీపంలో ఉన్న ఏయే కాలనీలు మునుగుతున్నాయి?  కారణాలేమిటి అనేది హైడ్రా తెలుసుకోనుంది. నీళ్లు నిండిన ప్రాంతాల్లో డ్రోన్లతో సర్వే చేసి ఆక్రమణలను గుర్తిస్తారు. తర్వాత కూల్చివేతలకు దిగబోతున్నారని తెలుస్తోంది. 
రాంనగర్ తరహాలోనే యాక్షన్ ఉంటుందా..?


వారం క్రితం రాంనగర్ లోని ఓ నాలాపై బార్​అండ్​రెస్టారెంట్​నిర్వహిస్తున్న రెండు ఫ్లోర్ల  భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. అయితే,  ప్రస్తుతం హైడ్రా హైటెక్​సిటీలోని రెండు నాలాలను పైలెట్​ప్రాజెక్టు కింద సర్వే చేస్తుండడంతో ఇతర ప్రాంతాల్లో కూడా నాలాలపై దృష్టి పెడుతుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే, రాంనగర్ లో కమర్షియల్​అవసరాల కోసం ఏర్పాటు చేసిన బార్​అండ్​రెస్టారెంట్​ను కూల్చివేశారని, పేదలు కట్టుకుని ఉంటున్న ఇండ్ల జోలికి రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఎక్కడైనా నాలాలు ఉప్పొంగడం వల్ల ఎవరికైనా ప్రాణనష్టం జరుగుతుందని భావిస్తే వారితో మాట్లాడి వారికి ఇష్టమైతే ప్రత్యామ్నాయం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. 


కనుమరుగైన నాలాలు 


గ్రేటర్ ప‌‌‌‌రిధిలో  వెయ్యి కిలో మీట‌‌‌‌ర్ల మేర వ‌‌‌‌ర్షపు నీటి కాల్వలుండగా..మేజ‌‌‌‌ర్ నాలాలు 398 కిలోమీట‌‌‌‌ర్లు,  పైపులైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలోమీట‌‌‌‌ర్ల వరకు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఉన్న నాలాలు చాలా ఏండ్ల కిందట నిర్మించినవి. రోజురోజుకు జనాభా పెరుగుతుండటంతో నాలాల్లోకి వస్తున్న వరద కూడా పెరిగిపోతోంది. మరో వైపు నాలాలు ఆక్రమిస్తుండడంతో వాటిని వెడల్పు చేసే అవకాశం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో వరద ప్రవాహం పెరిగి కాలనీలు నీటమునుగుతున్నాయి.  

  • తర్వాత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం చర్యలు