మారుతున్న హైడ్రా ప్రాధాన్యతలు .. న్యాయస్థానాల మద్దతు అవసరం

హైడ్రా ఏర్పాటు చేసేముందు సీఎం రేవంత్​రెడ్డి చాలా స్పష్టంగా ప్రభుత్వ ఆస్తులను  కబ్జాదారుల నుంచి కాపాడడానికి ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.  ప్రత్యేక సంస్థ ఎందుకు అనే ప్రశ్న ఆనాడే వచ్చింది. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి  హైడ్రా ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేస్తున్నట్టు మొదట ప్రకటన వచ్చింది.  ఒక మంచి స్పష్టమైన లక్ష్యంతో  హైడ్రా ఏర్పాటు అయ్యింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీనిని స్వాగతించారు. అయితే, ఈ లక్ష్యం రానురాను మరుగున పడిపోతున్నది.  హైదరాబాద్ నగరంలో చెరువుల కబ్జా మీద తొలుత దూకుడుగా అడుగులు వేసిన హైడ్రా ఆ తరువాత నెమ్మదించింది. అనేకచోట్ల ఆక్రమణలు తిరిగి మొదలయ్యాయి.  నార్సింగి దగ్గర  ఓఆర్ఆర్  పక్కన  మూసీ ఒడ్డున పెద్ద నిర్మాణం గురించి ప్రత్యక్ష సమాచారం ఇచ్చినా హైడ్రా పట్టించుకోవడం లేదు.  హైడ్రా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. 

హైదరాబాద్ నగరంలో  ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి హైడ్రా ఏర్పడిన విషయంలో చట్టబద్ధత ప్రశ్న నిరంతరంగా ఎదురు అవుతున్నది.  ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. ఆయా చట్టాల అమలు అదే అధికార యంత్రాంగం ద్వారా  సాధ్యంకాకనే ఒక ప్రత్యేక  విభాగంగా  హైడ్రా ప్రతిపాదన వచ్చింది.  ఇది పాలనా సంస్కరణగా కాకుండా ప్రజలకు తక్షణ మార్పులను అందించే ఉద్దేశ్యంతో ఉన్న ఒక కొత్త ఆలోచన.  పాలనలో ఒక ఆయుధం.  అయితే, హైడ్రా పట్ల పాలకవర్గాలలో  అంతర్లీనంగా మొదటి నుంచి  వ్యతిరేకత ఉన్నది.  ప్రభుత్వ భూములు, ప్రజల ఉమ్మడి ఆస్తులను కొల్లగొట్టడంలో ఈ వర్గాలే ముందున్నాయి.  ఇందులో నాలుగు వర్గాలు.. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, బిల్డర్ల పాత్ర స్పష్టం. మొదట్లో న్యాయస్థానాలు  మంచిదే అన్నా .. అనంతరం వస్తున్న ఆదేశాలు హైడ్రాను నిలువరిస్తున్నాయి. దుర్గం చెరువు కాలుష్యం గురించి, కబ్జా గురించి స్వయంగా చీఫ్ జస్టిస్ పూనుకున్నా  క్షేత్రస్థాయిలో ఏమీ మార్పు రాలేదు. న్యాయస్థానాలలో  చెరువుల  పరిరక్షణకు అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఏండ్ల నుంచి పెండింగ్​లో  ఉన్నాయి.  చెరువుల  పరిరక్షణకు  
న్యాయస్థానాలు ఏం  చేయలేని  పరిస్థితి ఉంది. ప్రభుత్వం హైడ్రా ప్రతిపాదన తెచ్చినప్పుడు న్యాయస్థానం దానికి తగిన మద్దతు ఇచ్చి ఉంటే సరిపోయేది. 

ప్రభుత్వ ఆస్తులు అంటే ఏమిటి?

ప్రభుత్వ ఆస్తులు అంటే ఏమిటి అనే ప్రశ్న అప్పుడు, ఇప్పుడు నిర్వచించలేదు.  రోడ్డు మీద ఫుట్ పాత్  ప్రభుత్వ ఆస్తి అవుతుందా?  సామాజిక ఆస్తి అవుతుందా?  చెరువులు  సామాజిక ఆస్తులు.  అవి ప్రభుత్వ ఆస్తి కాదు.  ప్రైవేటుకానిది  ప్రభుత్వ ఆస్తి అనడానికి  వీలులేదు.  హైడ్రా  అధికారులకు,  ప్రశ్నిస్తున్న  ప్రతిపక్ష రాజకీయవేత్తలకు, కబ్జాదారులకు, న్యాయస్థానాలకు ఇది అర్థం అయితే కార్యాచరణ కొంత సులువు అవుతుంది. మొదటిది, కబ్జాను నిర్ధారించడం. శిఖం అంటే ఏమిటి?  బఫర్ అంటే ఏమిటి? అని ప్రశ్నలు వస్తున్నాయి.  చెరువులు, ఇతర  సామాజిక,  ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించినవారే ఇప్పుడు చట్టం, చట్టంలో ఉన్న వివిధ సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ఆస్తుల కబ్జా నిర్ధారణ ఎందుకు జటిలం చేస్తున్నారు?  చెరువు  ఆక్రమణలు రకరకాలుగా చేశారు.  చేస్తున్నారు.  ప్రభుత్వమే  చెరువుల పట్ల  ప్రజలలో ఉండే సామాజిక నిబద్ధతకు తూట్లు పొడిచింది.  నీటి వనరుల ఆక్రమణలలో  ప్రభుత్వ శాఖలు, విభాగాలే ముందున్నాయి. నీటి వనరులను పరిరక్షించే చట్టాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నింటిని తుంగలో తొక్కి ఆక్రమించిన నేపథ్యంలో ఇప్పుడు చెరువు అంటే ఏమిటి అనే ప్రశ్నదాకా వెళ్తున్నారు. చెరువు ఆక్రమణకు గురైందని  నిరూపించాల్సి రావడం ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ, వాస్తవం.

బఫర్ జోన్  ఏ ప్రాతిపదికన నిర్ణయించారు?

 కనుల ముందు కనిపిస్తున్న ఆక్రమణ  ధ్రువీకరించడానికి  ఇప్పుడు  హైడ్రా  ధ్రువపత్రాల వేటలో పడింది. చెరువు ప్రభుత్వ ఆస్తికానే కాదు. దానికి ధ్రువపత్రాలు ఏం ఉంటాయి?  చెరువులను  భూములుగా పరిగణించే  రెవెన్యూ శాఖను, చెరువులకు నిర్వహణను నిర్లక్ష్యం చేసిన  మైనర్ ఇరిగేషన్ శాఖను అడగాల్సి వస్తున్నది. గత  ప్రభుత్వం ఈ శాఖను తీసేసింది. చట్టంలో  శిఖం భూమి నిర్వచనం లేదు. ఏక్ సాల్  పట్టా  ఎప్పుడు చట్టబద్ధం అయ్యింది? రికార్డులు లేవు. బఫర్ జోను  కూడా చట్టంలో నిర్వచనం లేదు.  బఫర్ జోనుకు సాంకేతిక, పాలనాపర  ప్రమాణాలు ఏమున్నాయి?  బహుశా రెవెన్యూ, నీటి పారుదల అధికారులు చెరువుల ఆక్రమణను సులువు చేయటానికి బఫర్ జోను  తెచ్చారు. బఫర్ జోను పాలనాపర ప్రామాణికం. నీటికి గిరిగీస్తే అన్నిసార్లు సరిపోకపోవచ్చు. బఫర్ జోన్  ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? వరద బట్టి ఉండాలి.  న్యాయస్థానం ఈ విషయాల మీద దృష్టిపెట్టడం లేదు. అన్ని చెరువులకు  ఇవి రెండే  సమస్యలు కావు. అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. కొందరు మట్టి, రాళ్ళు, రప్పలు పోశారు. తూములు, అలుగు పగులగొట్టారు. చెరువు విస్తీర్ణం తగ్గించుకుంటూ వచ్చారు. పాతమ్యాపులలో స్పష్టంగా విస్తీర్ణం కనపడుతుంటే,  అనంతరం అది కుంచించుకుపోతుంటే చర్యలు చేపట్టడానికి  హైడ్రా ఎందుకు వెనుకాడుతున్నది? ఇప్పుడు హైడ్రా ఎందుకు
 మీనమేషాలు లెక్కపెడుతున్నది. 

ఇచ్చిన పని చేయలేకపోతున్నది

హైడ్రా తనకు ఇచ్చిన పని చేయలేకపోతున్నది. లక్ష్యం చేరుకోలేకపోతున్నది.  సమస్య హైడ్రాతోనే కాదు. హైడ్రా ఏర్పడిన  బాహ్య  వాతావరణం కూడా ఒక కారణం. హైడ్రా పనితీరు విశ్వాసం కల్పించేవిధంగా లేదు.  ప్రజల మద్దతు అందుకున్న హైడ్రా ఆ మద్దతుకు అనుగుణంగా పనిచేయలేదు. విమర్శల నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించడానికి చట్టం తీసుకువచ్చిన ప్రభుత్వం ప్రజల నుంచి,  నిపుణుల నుంచి వచ్చిన ఇతర ఆలోచనలను, సూచనలను పట్టించుకోలేదు. ఒత్తిళ్లు లేదా ఇంకేదైనా కారణం కావచ్చు. ఇటీవల హైడ్రా కమిషనర్ పదే పదే  మేం అన్ని ఆక్రమణలు తొలగించం, పాతవి అసలే ముట్టం.  ఇప్పటి నుంచి ఆక్రమణలు జరగకుండా చూస్తాం అని అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నారు.  ఆక్రమణల నివారణకు హైడ్రా అవసరం ఏమున్నది?  వివిధ చట్టాలు సరిగ్గా అమలుచేస్తే సరిపోతుంది. ఆక్రమణల వల్ల అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులలో పడ్డారు. కాబట్టి, ఆయా ఆస్తులను పునరుద్ధరించి ప్రజలకు కష్టాలు తొలగించడానికి హైడ్రా ఏర్పాటు అయ్యింది. 

అక్రమ నిర్మాణాలను ఆపాలి

ఆక్రమణలకు గురి అయిన ఫుట్​పాత్​లు, రోడ్లు, వాగులు, నాలాలు, చెరువులు, చిట్టడవులు, ప్రభుత్వ భూములను కాపాడడానికే  హైడ్రా ఏర్పాటు అయ్యింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు అయిన సంస్థ అధిపతి  జులై, 2024కు ముందు ఆక్రమణలు పట్టించుకోం అంటుంటే, ఇదివరకు ఆక్రమణలకు అనుమతులు ఇచ్చిన అధికారులకు హైడ్రా అధికారులకు మధ్య తేడా ఏమున్నది?  ఆ విధమైన వెసులుబాటు కల్పించడం ఇంకా ఆక్రమణలను ప్రోత్సహించడమే అవుతుంది. హైడ్రా కూల్చివేతల సందర్భంలో దాని చట్టబద్ధత  ప్రశ్నించినవారు ‘కూల్చివేతలకు’ ఒక సమయకాలం నిర్ధారణ చట్టబద్ధతను ప్రశ్నించకపోవడం గమనార్హం. ప్రజల మద్దతు ఉన్న హైడ్రాకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, న్యాయస్థానాల నుంచి మద్దతు, అధికారుల నుంచి సహకారం అందాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ప్రకృతిని నాశనం చేస్తున్న  అక్రమ నిర్మాణాలు, కార్యకలాపాలను ఆపగలుగుతాం.

వైరుధ్యం సమాజానికి మంచిదికాదు

అవినీతి మూలంగా అనుమతులున్నా.. రద్దు చేయాల్సిందే అని న్యాయస్థానాలు,  ప్రభుత్వం, సమాజం దృఢచిత్తంతో ఉండాల్సిన అవసరం ఉన్నది. వర్షాలు పడినప్పుడు నిండు కుండలా ఉండే చెరువు ప్రాంతాన్ని నిర్దారించడంలో,  పరిరక్షించడంలో ప్రభుత్వం, న్యాయస్థానాల మధ్య వైరుధ్యం ఉండడం సమాజానికి, ప్రకృతికి మంచిది కాదు. అయితే, చెరువుల ఆక్రమణల తొలగింపులో పారదర్శక పద్ధతులు ఉండాలి. ముందస్తు సమాచారం ఇవ్వడం, నోటీసులు ఇవ్వడం, తగిన సమయం ఇవ్వడం కూడా మంచిదే. అవసరమే. చట్టరీత్యా ఆక్రమణల తొలగింపు ఉండాలి.  అనుమతులు తీసుకున్నా అవి చట్టం నిర్దేశించిన ప్రమాణాలు, నియమాల ప్రకారం లేనప్పుడు తొలగించే అధికారం గురించి అటు ప్రభుత్వంకానీ, ఇటు న్యాయస్థానాలుకానీ స్పష్టత ఇవ్వడం లేదు. 

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​