- మా పరిధి ఓఆర్ఆర్ వరకు ఉంది
- మెట్రో సిటీల్లో క్లౌడ్ బరస్ట్స్ బాగా పెరిగినయ్
- గట్టి వాన పడితే హైదరాబాద్మునుగుడు ఖాయం
- ముంపును తగ్గించేందుకు గొలుసు కట్టు చెరువులను మళ్లీ కనెక్ట్ చేయాలి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ అంటే ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులని, చెరువుల మధ్య కనెక్టివిటీ ఉండేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఇప్పుడు ఆ కనెక్టివిటీ లేకుండా పోయిందని, నాలాలు కూడా సరిగ్గా లేవని చెప్పారు. గట్టి వర్షం పడితే హైదరాబాద్ మునుగుతుందని, ముంపు సమస్యకు చెక్ పెట్టేందుకు గొలుసుకట్టు చెరువులను మళ్లీ కనెక్ట్ చేయాలన్నారు. శుక్రవారం సిటీలో ఐఎండీ(భారత వాతావరణ శాఖ) నిర్వహించిన సదస్సుకు రంగనాథ్ చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిటీలో చాలాచోట్ల చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికావడంతో.. వర్షం పడితే వరద పోవడానికి మార్గం లేకుండా పోయిందన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం పడితే భారీగా రోడ్లపై వరద నిలుస్తోందన్నారు. మొత్తం150 చోట్ల వరద నిలిచే ప్రాంతాలను గుర్తించినట్టు చెప్పారు. దేశంలోని మెట్రో సిటీల్లో వాతావరణ మార్పులు అధికంగా సంభవిస్తున్నాయని, ఉన్నట్టుండి అతిభారీ వర్షాలు(క్లౌడ్బరస్ట్స్) కురుస్తున్నాయని తెలిపారు. అర్బన్ డిజాస్టర్స్పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. 157 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లున్నాయని, ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
హైడ్రా స్పెషల్ వింగ్..
జీహెచ్ఎంసీలో హైడ్రా భాగం కాదని రంగనాథ్ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇంతకుముందు ఈవీడీఎం పేరుతో జీహెచ్ఎంసీలో భాగంగా ఉండేదని, ఇప్పుడు జీహెచ్ఎంసీ నుంచి విడిపోయి ప్రత్యేక శాఖగా హైడ్రా ఏర్పడిందని తెలిపారు. జీహెచ్ఎంసీతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న 27 మున్సిపాలిటీల పరిధిలో హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. చాలా చోట్ల చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని నివారించేందుకు హైడ్రా పనిచేస్తుందన్నారు. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు 10 వేల మందికిపైగా చనిపోయారని, ముందస్తు సమాచారం లేకపోవడంతోనే అంత మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పుడు ఐఎండీతో ముందస్తు అలర్ట్స్ ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు.
బెంగళూరులో ప్రతి పావుగంటకోసారి ఏడబ్ల్యూఎస్ల నుంచి డేటా సేకరిస్తారని, మనం కూడా దీనికి మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఏరియాల్లోనూ వెదర్ రాడార్స్ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ వర్షం పడుతుందో, ఎక్కడ పడదో చెప్పేలా వెదర్అలర్ట్స్ఉండాలన్నారు. వర్షాలు పడ్డప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడడం వల్ల కూడా ఆర్థిక నష్టం జరుగుతుందని, అర్బన్ డిజాస్టర్స్పై ఐఎండీతో కలిసి పనిచేసేందుకు హైడ్రా సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో క్లైమేట్ చేంజ్: కె.నాగరత్న
రాష్ట్రంలో క్లైమేట్ చేంజ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నదని ఐఎండీ, హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ కె. నాగరత్న తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. కాలంగాని కాలంలో భారీ వర్షాలు పడుతున్నాయని, టెంపరేచర్లు ఎక్కువవుతున్నాయని వివరించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఎండాకాలంలో భారీ వడగాడ్పులు, వర్షాకాలంలో అతిభారీ వరదలు మొదలుకుని ఇర్రెగ్యులర్ వెదర్ కండిషన్స్ ఉంటున్నాయని ఐఎండీ రీజినల్ డైరెక్టర్ బాలచంద్రన్ అన్నారు.
పెరుగుతున్న పారిశ్రామీకరణ, పట్టణీకరణ, మానవచర్యలు, అడవుల నరికివేతతో గ్లోబల్ వార్మింగ్ తీవ్రమవుతున్నదని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర అన్నారు. రాష్ట్రంలో తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటున్నదని, తుఫాను తీరం దాటాక ఉండే వాతావరణ పరిస్థితులతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. అలాంటి వాతావరణ పరిస్థితులతో హైదరాబాద్ నగరం ముంపునకు గురవుతున్నదని తెలిపారు.