బతుకమ్మ కుంట చుట్టూ.. ఏ ఒక్క ఇంటినీ కూల్చం : హైడ్రా చీఫ్​ రంగనాథ్

  • చెరువు ఉన్న పరిధిలోనే పున‌రుద్ధర‌ణ ప‌నులు చేస్తం
  • కుంటకు పూర్వ వైభవం తెస్తాం 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ బుధవారం సందర్శించారు. పున‌రుద్ధర‌ణ ప‌నులను పరిశీలించారు. త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. హైడ్రా కమిషనర్ రావడంతో భయాందోళనకు గురైన అక్కడి వీకర్ సెక్షన్ కాలనీ వాసులు తమ ఇండ్లను కూల్చవద్దని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండ్లను కూల్చబోమని ఆయన వారికి హామీ ఇచ్చారు. వరద ముప్పును తప్పించి, ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకువస్తామన్నారు. ఖాళీగా ఉన్న 5.15 ఎక‌రాల్లోనే కుంటను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. .

14 ఎకరాలకు మిగిలింది ఐదే..  

స‌ర్వే నంబ‌రు 563లో 1962–-63 లెక్కల ప్రకారం 14.06 ఎక‌రాల విస్తీర్ణంలో బ‌తుక‌మ్మ కుంట‌ ఉండేదని, బ‌ఫ‌ర్ జోన్‌తో క‌లిపి మొత్తం 16.13 ఎక‌రాల్లో కుంట విస్తరించి ఉండేదని స‌ర్వే తెలిపారు. తాజా స‌ర్వే ప్రకారం అక్కడ 5.15 ఎక‌రాల విస్తీర్ణంలో మాత్రమే కుంట ఉందని తేల్చారు.  ఆ మొత్తంలోనే బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్ధరించేందుకు హైడ్రా సుంద‌రీక‌ర‌ణ ప‌నులను చేపట్టింది.  

ఎర్రకుంట చెరువు సంద‌ర్శన 

తార్నాక‌లోని ఎర్రకుంట‌ను కూడా రంగ‌నాథ్‌ సందర్శించారు. వివాదాలు లేని ఎర్రకుంట‌ను పున‌రుద్ధరించాలంటూ నాగార్జున కాల‌నీ సంక్షేమ సంఘం హైడ్రాను కోరింది. 5.9 ఎక‌రాల్లో విస్తరించిన చెరువును పున‌రుద్ధరించి, సుంద‌రీక‌రిస్తే ఇక్కడ దుర్వాస‌న‌, దోమ‌ల బెడద త‌ప్పుతుంద‌ని క‌మిష‌న‌ర్‌ను కోరారు. స్థానికుల విజ్ఞప్తి మేర‌కు ఎర్రకుంట‌ను ప‌రిశీలించి, పున‌రుద్ధర‌ణ‌కు చ‌ర్యలు తీసుకోవాలంటూ అధికారుల‌ను క‌మిష‌న‌ర్‌  ఆదేశించారు.