ఫిర్యాదు వస్తే 111 జీవో పరిధిలోకీ ఎంటరైతం : రంగనాథ్​

  • ఎఫ్​టీఎల్ ​పరిధిలో ఉంటే మంత్రుల ఇండ్లయినా కూల్చేస్తం 
  • పల్లా, మల్లారెడ్డి, ఒవైసీల కాలేజీలపై ఎంక్వైరీ చేస్తున్నం
  • ఆక్రమణలని తేలితే అకడమిక్​ ఇయర్ పూర్తయ్యాక కూలుస్తం
  • అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ల పై త్వరలోనే కేసులు
  • హైడ్రాకు ప్రభుత్వం ఫుల్​ సపోర్ట్​.. సీఎం ఫ్రీడమ్ ఇచ్చారు
  • ఇకపై జంగిల్ రాజ్యం నడ్వది..చెరువులను కాపాడడమే లక్ష్యం
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ ​రంగనాథ్

ప్రతిపక్షాలే మా టార్గెట్ అనేది ఉత్తమాటలు. మాకు ఎవరూ టార్గెట్ కాదు. చెరువులను కాపాడడమే మా లక్ష్యం. ఇప్పటికే రెండు నెలల రిపోర్టు రిలీజ్ చేశాం. ఆ రిపోర్టులో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారు. కాంగ్రెస్​, బీజేపీ, ఎంఐఎం వాళ్లు ఎక్కువ ఉంటే బీఆర్ఎస్​నుంచి ఒక్కరే ఉన్నారు.  

హైడ్రాకు  ‘ఎక్స్’ (ట్విటర్​), మెయిల్, వాట్సాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మొన్నటి వరకు డెయిలీ 50 నుంచి 60 వరకు వచ్చేవి. కానీ ఇప్పుడు లెక్కలేదు. వేలల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నింటిపై విచారణ జరిపి, అక్రమమని తేలితేనే చర్యలు తీసుకుంటాం.

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రస్తుతానికి తమ పరిధి ఔటర్​రింగ్​రోడ్డు వరకే అని, కానీ ఫిర్యాదులు వస్తే111 జీవో పరిధిలోకీ ఎంటరవుతామని హైడ్రా కమిషనర్​ రంగనాథ్ ​పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు కోరితే వారికి సపోర్ట్​గా రంగంలోకి దిగుతామని తెలిపారు. ప్రతిపక్షాలనే తాము టార్గెట్ చేస్తున్నామనేది  ఉత్తమాటేనని, తమకు ఎవరూ టార్గెట్ కాదని,  చెరువులను కాపాడడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. 

Also Read:-హైడ్రాపై హైకోర్టుకు బడాబాబులు

ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉంటే మంత్రుల ఇండ్లయినా కూల్చేస్తామని స్పష్టం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ఒవైసీ ల కాలేజీలపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై  ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. అవి ఎఫ్​టీఎల్​లో ఉన్నట్టు తేలితే  అకడమిక్​ ఇయర్​ ముగిశాక కూల్చేయడం ఖాయమని తెలిపారుహైడ్రాకు ప్రభుత్వం ఫుల్​ సపోర్ట్​ ఉందని, సీఎం రేవంత్​ చాలా ఫ్రీడమ్ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మేరకు కమిషనర్​రంగనాథ్​‘వెలుగు’కు స్పెషల్​ఇంటర్వ్యూ ఇచ్చారు. 

వెలుగు:  హైడ్రా పరిధి ఓఆర్ఆర్​ వరకే కదా.. మరి111 జీవో పరిధిలో మీ పాత్ర ఏంటి?

కమిషనర్​: నిజానికి111 జీవోలోని ఏరియా మా పరిధిలోకి రాదు. కానీ స్థానిక పంచాయతీలుగానీ, మున్సిపాలిటీలుగానీ, కార్పొరేషన్లుగానీ ఆక్రమణల తొలగింపునకు మమ్మల్ని ఆశ్రయిస్తే వారికి సపోర్టుగా కూల్చివేతలు చేపడ్తాం. అందుకు సంబంధించిన ఖర్చును స్థానిక సంస్థలు భరించాల్సి ఉంటుంది.
కబ్జాదారుల్లో ఎవరున్నా వదిలిపెట్టరా?

అవును.. ఎఫ్​టీఎల్ అనేది చెరువులకు ప్రాణం. ఒకానొక సమయంలో బఫర్ జోన్ లను వదిలేసినా ఎఫ్​టీఎల్​లో ఉన్న  ఆక్రమణలను మాత్రం వదిలిపెట్టం.  హైడ్రాలో మెంబర్స్ గా ఉన్న మంత్రులు అయినా సరే.. వాళ్లవి అక్రమ నిర్మాణాలు అని తేలితే వెంటనే కూల్చేస్తాం. అవి మంత్రులవా? ఇంకెవరివా? అన్నది మాకు అవసరం లేదు. మా పని మేం చేస్తం.

పల్లా, మల్లారెడ్డి, ఒవైసీ కాలేజీల పరిస్థితి ఏంటి?

ఎమ్మెల్యేలు పల్లారాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ఒవైసీ ల కాలేజీ లపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారణ జరుపుతున్నాం. ఎఫ్​టీఎల్​లో ఉన్నట్లు తేలితే కచ్చితంగా కూల్చేస్తాం. కానీ అవి ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్స్. అందుకే ఇప్పటికిప్పుడు వాటిని కూలిస్తే స్టూడెంట్స్ పై ప్రభావం పడ్తుంది. అందుకే వాళ్లకు కొంత సమయం ఇస్తాం. ఈ అకడమిక్ ఇయర్  పూర్తయ్యాక తప్పకుండా కూల్చివేస్తాం.

హైడ్రా కూల్చివేతలతో సామాన్యులు భయపడుతున్నారు. దీనిపై మీరేమంటారు?

హైడ్రాను చూసి సామాన్యులు భయపడాల్సిన అవసరంలేదు. హైడ్రా సామాన్యుల వద్దకు రాదు. వారు హాయిగా జీవించవచ్చు.  రెండు, మూడేండ్ల క్రితం నిర్మించిన చిన్నచిన్న ఇండ్ల వద్దకు మేం వెళ్లడంలేదు. కానీ హైడ్రా ఏర్పడ్డ తర్వాత ఒక్క ఇల్లు నిర్మించినా చూస్తూ ఊరుకోం. కచ్చితంగా కూల్చివేస్తాం. ఇదివరకే నిర్మించి కమర్షియల్​గా వాడుకున్నా  చర్యలు తప్పవు.  తమ్మిడి చెరువులో ఎన్ కన్వెన్షన్ తో పాటు  పేదలు  కూడా చిన్న చిన్న ఇండ్లు నిర్మించుకున్నారు. ఎన్​కన్వెన్షన్​కూల్చివేసినా పేదల ఇండ్లను మాత్రం ముట్టుకోలేదు. ఎందుకంటే వారు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. బస్తీల జోలికి పోవడంలేదు. హైడ్రా పని చెరువులు, నాలాలు, పార్కులు, తదితర ప్రభుత్వ స్థలాలను కాపాడడం తప్ప.. పేదలను రోడ్డునపడేయడం కాదు.

ఎన్ కన్వెన్షన్ ని  చట్టవిరుద్దంగా కూల్చారని నాగార్జున అంటున్నారు కదా?  

ఎన్ కన్వెన్షన్ కు ఎలాంటి అనుమతులు లేవు. వారు బిల్డింగ్ రెగ్యులరేషన్(బీఆర్ఎస్) కోసం కూడా అప్లయ్ చేశారు. కానీ బీఆర్ఎస్​ కాలేదు. శిఖంలోని పట్టా భూములను కేవలం వ్యవసాయం కోసమే వాడాలి. అందులో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దు. అందుకే కూల్చివేశాం. శిఖం భూములు అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా అవుతాయి. కానీ అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దు. ఎన్​కన్వెన్షన్ పూర్తిగా కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారు. అందుకే నేలమట్టం చేశాం.

నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటారా?

ఇప్పటివరకు కూల్చిన భవనాలకు సంబంధించి అప్పట్లో అనుమతులు ఇచ్చిన అధికారుల చిట్టా తయారు చేశాం.  కొందరు సర్వే నెంబర్లు మార్చినట్లు, చెరువుల్లో నిర్మాణాలు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు గుర్తించాం. వారిపై స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తాం. తప్పు చేసిన వాళ్లు జైలుకు వెళ్లక తప్పదు. 

నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చేయవచ్చా?

సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణలు ఉంటే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయవచ్చు. ఆ అధికారం హైడ్రాకు ఉంది. జీహెచ్ఎంసీ 405 యాక్ట్ ప్రకారం కూడా  నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయచ్చు. అయినా హైడ్రా నోటీసులు ఇవ్వదు. నోటీసులు ఇచ్చే అధికారంలేదు. నోటీసులు ఇవ్వాల్సి వస్తే గ్రేటర్ లిమిట్స్ అయితే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థలు అయితే అక్కడి మున్సిపాలిటీలు ఇస్తాయి.  

హైడ్రాకు సిబ్బంది కొరత ఉందా?  ఏయే విభాగాలు ఉంటాయి?

ప్రస్తుతం హైడ్రాకు సిబ్బంది కొరత ఉంది. రాబోయే15 నుంచి నెలరోజుల్లో హైడ్రాకు ప్రభుత్వం స్టాఫ్​ను కేటాయిస్తుంది. ఇప్పుడైతే ఈవీడీఎం కి చెందిన 2వేల మంది వరకు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. కొత్తగా వచ్చేవారిలో ఇప్పటికే కొంతమంది రెవెన్యూ అధికారులు రిపోర్టు చేశారు. త్వరలో హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తాం. హైడ్రాలో కూడా విభాగాలు ఉంటాయి. లీగల్​ టీం, డేటా బేసిక్, ఆర్ అండ్ బీ టీమ్స్, రెవెన్యూ, అసెట్ ప్రొటెక్షన్ టీమ్స్, లేక్స్, పార్కుల కోసం ఇలా కొన్నింటి కోసం ప్రత్యేకంగా వింగ్స్ ఉంటాయి. 

ఇతర సిటీల్లోనూ హైడ్రా లాంటి వాటి కోసం డిమాండ్లు వస్తున్నాయి? దీనిపై మీ అభిప్రాయం?

వారి డిమాండ్లు సరైనమే. అన్నిచోట్ల హైడ్రా లాంటి సంస్థల అవసరముంది. నేను గతంలో వరంగల్ పోలీసు కమిషనర్ గా పనిచేసిన. అక్కడ ఫ్లడ్స్ వచ్చి చాలా కాలనీలు మునిగాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కబ్జాలను అరికట్టాలె. వరంగల్, కరీంనగర్, ఖమ్మం  తదితర సిటీల్లో హైడ్రా లాంటి సంస్థలు రావాల్సిన అవసరం ఉంది.  

సామాన్యులు మోసపోకుండా హైడ్రా తరుఫున ఎలాంటి సహకారం అందిస్తారు? 

సామాన్యులు ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్ లో నిర్మించిన ఇండ్లు, ఫ్లాట్లను ఎట్టిపరిస్థితుల్లో  కొని మోసపోవద్దు. కొనేముందు అన్నీ చూసుకోవాలి. త్వరలో హైడ్రా తరఫున ఒక పోర్టల్, యాప్ తీసుకొస్తం. అందులో ఎఫ్​టీఎల్, బఫర్ జోన్ తెలుసుకోవచ్చు. మనం నిలబడిన జాగా ఏ లిమిట్ లో ఉందని  తెలసుకునేలా దీనిని రూపొందిస్తున్నాం. ఇంకా ఏమైనా అనుమానాలుంటే హైడ్రాని సంప్రదించవచ్చు.

కూల్చివేతల తర్వాత డెబ్రిస్​ను ఏం చేస్తున్నారు?

కూల్చివేతల తర్వాత డెబ్రిస్​ ద్వారా కొంతమేర డబ్బులు వస్తాయి. అవి కూల్చివేతల కోసం చేసే ఖర్చుకి వినియోగిస్తున్నాం. ప్రస్తుతం కూల్చివేతల ఖర్చును హైడ్రానే పెట్టుకుంటున్నది.  కూల్చివేతల తర్వాత ఎవరైనా స్టెటస్​ కో తెచ్చుకుంటే వారి  డెబ్రిస్​ జోలికి మేం వెళ్లం. అక్కడే వదిలేస్తాం.

హైడ్రా ఏర్పాటు, అందులో మీ బాధ్యతల గురించి, మీపై వస్తున్న ఒత్తిళ్ల గురించి చెప్పండి? 

హైడ్రా అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద  ఇచ్చిన జీవో 99 ద్వారా ఏర్పడింది. దీనికి ప్రభుత్వం చాలా అధికారాలు కల్పించింది. హైదరాబాద్​లో 40-–50 ఏండ్ల నుంచి చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే 70 నుంచి 80 శాతం చెరువులు కబ్జా అయ్యాయి. ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేయడం, దాని బాధ్యతలు నాకు  అప్పగించడం సంతోషంగా ఉంది. హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలయ్యాక నాపై ఒత్తిళ్లు పెరిగినయ్​. ప్రతిరోజూ చాలా మంది కలుస్తున్నరు. 

హైడ్రాకు ప్రభుత్వం నుంచి సపోర్ట్​ ఎలా ఉంది?

హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్​ సపోర్ట్​ ఉంది. సీఎం చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఇకపై జంగిల్ రాజ్యం నడ్వది. సర్కారు భూములు కబ్జా చేయాలంటే భయపడాలె. సీఎం కూడా ఎప్పుడూ అదే చెబుతున్నారు.  

లీడర్ల సవాళ్లపై మీ రియాక్షన్ ఏంటి?

లీడర్ల సవాళ్లకు మేం రియాక్ట్ కాలేం. సమయం వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అందరివి నేలమట్టం చేస్తాం. వారికి వారు సవాళ్లు విసురుకుంటే మేమేమి చేయలేం. అంతా సిస్టం ప్రకారం ముందుకెళ్తాం.

ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వ భవనాలు ఉంటే కూల్చేస్తారా?

ఎప్పుడో ఏండ్ల క్రితం నిర్మించినవి ఉన్నాయి.  ప్రభుత్వ భవనాలు ప్రజలకు ఉపయోగపడ్తాయి. ప్రైవేట్ వ్యక్తులైతే కమర్షియల్ పర్పస్  కు వాడుతారు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను మనం గమనించాలి. దానిని బట్టే కూల్చివేతలు ఉంటాయి

జంట జలాశయాల విషయంలో మీ పాత్ర ఏమిటి?

 జంటజలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్  సాగర్(గండిపేట) హైదరాబాద్​ తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నాం. నిజాం కాలంలో హైదరాబాద్​కు వరద ముప్పు తప్పించేందుకు వీటిని నిర్మించగా, దీంతోపాటు తాగునీటి అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు.  ముందుగా డ్రింకింగ్ వాటర్ రీసోర్సెస్​పైనే  మేం స్పెషల్ ఫోకస్ పెట్టినం. ఎందుకంటే అవి అంతరిస్తే ఫ్యూచర్ లో తాగేందుకు  నీళ్లు కూడా దొరకవు. వాటి ఎఫ్​టీఎల్​లో ఒక్కటి కూడా  ఆక్రమణలు ఉండనివ్వం. గండిపేట లో అందుకే కూల్చివేతలు చేపట్టినం.