హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ

  • ఆరు లేన్లుగా హైవే-65 
  •  ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ 
  • 181.50 కిలో మీటర్ల మేర పనులు  
  • రెండేండ్లలో  పూర్తి చేసేందుకు కసరత్తు

నల్గొండ, వెలుగు : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి(హైవే–65) ని ఆరు లేన్లుగా విస్తరించేందుకు  ఎట్ట కేలకు మోక్షం కలిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ తీసుకుని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని ఒప్పించి నిధులు కేటాయించేలా చేశారు. వచ్చే డిసెంబర్ లో విస్తరణ పనులను ప్రారంభిస్తారు.  రెండేళ్లలో పనులను పూర్తి చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. కాగా.. అప్పట్లోనే ఆరు లేన్ల రోడ్డు కోసం భూసేకరణ చేశారు. ఇప్పుడు ఎలాంటి భూ సేకరణ అవసరం లేదు. ఇది పూర్తయితే తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఆటంకాలు లేకుండా వాహనాలు ప్రయాణించే అవకాశం ఉంటుంది. 

దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ హై వే

హైవే –65 తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కీలకమైనది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు181.50 కిలోమీటర్లు ఉంది. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైవే కావడంతో నిత్యం ప్రమాదాలతో రక్తసిక్తమవుతోంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రమాదాలను నివారించేందుకు హైవేను 2010లో నాలుగు లేన్లుగా విస్తరించారు.  జీఎంఆర్ సంస్థ రూ. 1,740 కోట్లతో మొదట్లో నాలుగు లైన్లుగానే విస్తరించింది. అయినా యాక్సిడెంట్లు ఆగడంలేదు. దీంతో ఆరు లేన్లుగా విస్తరించాలని ఎంపీలుగా ఉన్న సమయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో సమస్యను పలుమార్లు లేవనెత్తారు. ఇలా హైవేను విస్తరించాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. 

17 బ్లాక్ స్పాట్లలో పనులు 

హైవేను నాలుగు లేన్లకు విస్తరించినా రోజురోజుకూ వాహనాల ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుండడంతో ప్రమాదాలు ఆగడంలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఫ్లై ఓవర్లు లేకపోవడంతో నిత్యం యాక్సిడెంట్లు అవుతుండగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయి. చౌటుప్పల్‌, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూరు, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈనాడు జంక్షన్‌, జనగాం క్రాస్ రోడ్డు, పిల్లలమర్రి క్రాస్ రోడ్డు, దురాజ్‌పల్లి, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ, కట్టకొమ్ముగూడెం, మేళ్లచెర్వు క్రాస్ రోడ్డు, మునగాల ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నట్టు..17 బ్లాక్‌స్పాట్స్‌ ను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు గుర్తించారు. రూ.325 కోట్లతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా అండర్‌పాస్‌లు, బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు నిర్మించేందుకు పనులను చేపట్టారు. బ్లాక్‌ స్పాట్‌ల వద్ద అవసరమైన ఫ్లై ఓవర్‌లు, ఇతర అభివృద్ధి పనుల కు ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేయగా పనులు నడుస్తున్నాయి. హై వేను ఆరు లైన్లకు విస్తరిస్తే భవిష్యత్ లో ప్రమాదాలకు చెక్ పడుతుందని జిల్లావాసులు భావిస్తున్నారు.