competitive special : హైదరాబాద్ స్టేట్‌లో బూర్గుల రామకృష్ణరావు సంస్కరణలు 

భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమలులోకి వచ్చింది. అదే రోజున నిజాం మీర్ ఉస్మాన్​ అలీఖాన్​ హైదరాబాద్​ రాజ్​ప్రముఖ్​గా,  అప్పటివరకు హైదరాబాద్​ రాజ్య ప్రధాన మంత్రిగా ఉన్న సివిల్​ సర్వీస్​ అధికారి వెల్లోడి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.  ఆ తర్వాత రెండేండ్లకు 1952, ఫిబ్రవరిలో హైదరాబాద్​ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బూర్గుల రామకృష్ణరావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1952, మార్చి 6 నుంచి 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం ఏర్పడే వరకు బూర్గుల హైదరాబాద్​ రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ఈ మధ్యకాలంలో అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టారు.

భూ సంస్కరణలు

  • హైదరాబాద్​ రాష్ట్రంలో 1949–1954 మధ్యకాలంలో భూ సంస్కరణలకు సంంధించి మూడు చట్టాలను ప్రవేశపెట్టారు. అవి..
  • జాగీర్దార్ల చట్టం – 1949
  • హైదరాబాద్​ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం–1950
  • హైదరాబాద్​ కౌలుదారీ వ్యవసాయ భూముల సవరణ చట్టం 1954

జాగీర్దార్ల రద్దు చట్టం

హైదరాబాద్​ రాష్ట్రంలోని నిజాం కాలంనాటి జాగీర్దార్లను రద్దు చేస్తూ జేఎన్​ చౌదరి నేతృత్వంలోని మిలటరీ ప్రభుత్వం 1949, ఆగస్టు 15న జాగీర్దార్ల రద్దు చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా వ్యవసాయదారులకు, మధ్య దళారీలుగా ఉన్న జాగీర్దార్లను రద్దు చేశారు. జాగీర్దార్ల చట్టం వల్ల రాష్ట్ర ప్రజలు భూస్వాములకు చెల్లించాల్సిన బలవంతపు చెల్లింపులు నిలిచిపోయాయి. అంతేకాకుండా అనేక మంది జాగీర్దార్లు జాగీర్​ ప్రాంతాల నుంచి దివాన్ ప్రాంతాలకు వలస వెళ్లారు.

ఈ జాగీర్దార్ల చట్టం ద్వారా జాగీర్దార్లకు మొదటి ఆరు నెలల కాలానికి మధ్యంతర భృతిని మిలటరీ, పౌర ప్రభుత్వాలు అందించాయి. అయితే జాగీర్దార్ల వార్షిక ఆదాయంలో 75 శాతం వరకు విస్తీర్ణాన్ని అనుసరించి కొంతకాలంపాటు భృతిని అందజేశారు. కానీ జాగీర్దార్లు శాశ్వత భృతిని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేయడంతో నాటి కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శి వి.పి.మీనన్​ జాగీర్దార్లతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాడు. ఈ చట్టాల్లో బూర్గుల రామకృష్ణారావు పాల్గొని జాగీర్దార్ల సమస్యలను పరిష్కరించారు. 

హైదరాబాద్​ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం–1950 

రాష్ట్రంలోని కౌలుదార్లకు రక్షణ కల్పిస్తూ 1950, జూన్​ 10న ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం వరుసగా 6 సంవత్సరాలపాటు కౌలుదారుడు భూమిని సాగు చేసినట్లయితే వారిని రక్షిత కౌలుదారుడిగా పేర్కొంటారు. ఈ చట్టం ద్వారా రక్షిత కౌలుదారునికి భూమిపై 60 శాతం హక్కులు కలిగి ఉంటాడు. అయితే, ఈ చట్టం కౌలుదారుడిని భూమి నుంచి తొలగించకుండా రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా భూస్వామి తన భూమిని విక్రయించినప్పుడు మార్కెట్​ ధర కంటే తక్కువకు పొందే అవకాశం రక్షిత కౌలుదార్లకు ఈ చట్టం ద్వారా లభిస్తుంది. ఈ చట్టం కౌలుదారుడు తాము సాగు చేసుకుంటున్న భూములను 10 సంవత్సరాల వరకు సాగు చేసుకునేలా రక్షణ కల్పిస్తుంది. 
హైదరాబాద్​ కౌలుదారీ 

వ్యవసాయ భూముల సవరణ చట్టం – 1954 

హైదరాబాద్​ రాష్ట్రంలో అప్పటికీ రక్షిత కౌలుదార్ల చట్టం 1950, జనవరి నుంచి అమలులో ఉంది. ఈ చట్టంలో కౌలుదార్లకు రక్షణ ఉన్నా పెద్ద భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకొని రైతులకు ఇచ్చే ఏర్పాటు యోచన లేదు. ఈ అవకాశాన్ని హైదరాబాద్​ కౌలుదారీ వ్యవసాయ భూముల సవరణ చట్టం ద్వారా చేశారు. దీనివల్ల భూములను ఆక్రమించి సేద్యం చేయకుండా ఉన్న మధ్యవర్తుల నుంచి స్వాధీనం చేసుకొని సాగుకు వీలు కల్పించారు.

కౌలుదార్ల నుంచి భూస్వాములు అధిక మొత్తంలో కౌలు వసూలు చేయకుండా ఈ చట్టం నిరోధించింది. చివరికి ఆనాటి ప్రభుత్వం పెద్ద భూస్వాములు సాగు చేయకుండా ఉన్న భూములను ఆక్రమించి రైతులకు పంచుతామని తీవ్రంగా హెచ్చరించింది. మన దేశంలో భూకమతాలపై గరిష్ట పరిమితిని విధించిన ప్రథమ శాసకుడిగా బూర్గుల రామకృష్ణారావు పేరు పొందారు.

1954, ఫిబ్రవరిలో హైదరాబాద్​ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టానికి సవరణలు ప్రవేశపెట్టి, ఇకపైన భూస్వాములు తమ భూములను సాగుచేసే కౌలుదార్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించకుండా 1952లో ఒక ఆర్డినెన్స్​ జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్​ ప్రకారం భూ సంస్కరణలు అమలు చేయడానికి కుటుంబ కమతం ప్రాతిపదికగా తీసుకుంటారు. భూమిశిస్తు ప్రాతిపదికగా కౌలు నిర్ణయిస్తారు. ఈ చట్టం ద్వారా రాబోయే కాలంలో భూమిని సంపాదించే విషయంలో ఒక కుటుంబానికి ఎంత కమతం ఉండాలని చర్చించి కమతం సైజును నిర్ణయించారు. అంతేకాకుండా సులభ వాయిదాలపై కౌలుదారునికి భూమిని విక్రయిచే పద్ధతిని ఏర్పాటు చేశారు. 

ఆర్థిక సంస్కరణలు 

కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు హైదరాబాద్​ రాష్ట్ర ఆర్థిక ప్రగతిని మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 1950లో మాజీ ఐసీఎస్​ అధికారి ఏడీ గోర్వాల నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ తన నివేదికను 1950, అక్టోబర్​లో నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో రాష్ట్రంలో పరిపాలనను ఆధునీకరించడానికి కావాల్సిన పాలనా, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని సూచించింది. దీంతో గోర్వాల కమిటీ సూచనలను వెల్లోడి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు చిత్తశుద్ధితో అమలు చేయగా, హైదరాబాద్​ రాష్ట్ర ఆర్థిక సమతౌల్యతను సాధించింది. 

పరిపాలనా సంస్కరణలు 

1953, అక్టోబర్ 1న వరంగల్​ జిల్లా నుంచి కొన్ని భాగాలను వేరు చేసి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో నల్లగొండ జిల్లాలోని జనగాం తాలుకాను వరంగల్​ జిల్లాలో కలిపారు. 1955, జులై 1న అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేయడంతో రాష్ట్రాభివృద్ధి ముందుకు సాగింది. 1955, డిసెంబర్​ 10న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు స్వయంగా నాగార్జున సాగర్​ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

విద్యా సంస్కరణలు

విద్యా సంస్కరణల్లో భాగంగా ప్రతి 500 జనాభా గల గ్రామానికి పాఠశాలను ఏర్పాటు చేశారు. మొదటి తరగతి నుంచి మాతృభాషలో బోధన ప్రవేశపెట్టారు. మూడో తరగతి నుంచి హిందీ, ఐదో తరగతి నుంచి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. మాతృభాషలో విద్యా బోధన ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం హైదరాబాద్​ కాగా, మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు చరిత్రలో శాశ్వతంగా నిలిచారు. పాఠశాల విద్యలో త్రిభాషా సూత్రం ప్రవేశ పెట్టిన రాష్ట్రం కూడా హైదరాబాదే.

ఈయన కాలంలోనే హైదరాబాద్​ నగరంలోని అఫ్జల్​గంజ్​లో ఉన్న అసఫియా స్టేట్​ లైబ్రరీ పేరును హైదరాబాద్​ స్టేట్​ సెంట్రల్​ లైబ్రరీగా మార్చారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలో ఒక ఉపాధ్యాయ ట్రైనింగ్​ కాలేజీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్​ రాష్ట్రంలో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సును రాధాకృష్ణ కమిషన్​ ప్రవేశపెట్టాలని సూచించింది. హైదరాబాద్​ రాష్ట్రంలో మల్టీ పర్పస్​ హైస్కూల్స్​ను స్థాపించాలని మొదలియార్​ కమిషన్​ సూచించింది.