కల్తీలపై నిఘా పెరగాలి

ఆహార పదార్థాల కల్తీ నివారణ చట్టం 1954 సెక్షన్ 2 ( ఎ) ప్రకారం.. కల్తీ అనగా  ఆహార  పదార్థాలు సహజ సిద్ధమైన నాణ్యత లేకుండా తయారు చేయడం, లేదా  దాని నాణ్యతకు హాని కలిగించే బయటి పదార్థాలను కలపడం,  తక్కువ నాణ్యత గల వస్తువులను అధిక నాణ్యత గల వస్తువులుగా ప్రదర్శించడం, ఆ  వస్తువులలో వినియోగదారులకు హాని కలిగించే హానికారక రసాయనాలను మిళితం చేయడం. కాగా,వినియోగదారుడే  రారాజు అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారానికి భిన్నంగా వినియోగదారుడు తనకు అవసరమైన వస్తువులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేకుండా చేసే మార్కెటింగ్ మాయలో పడేసి కల్తీ పదార్థాల విషకౌగిలిలో చిక్కి విలవిల్లాడే పరిస్థితులను సృష్టిస్తుండడం బాధాకరం. 

ఫుడ్​సేఫ్టీ ఆఫీసర్స్​ కొరత

వినియోగదారుల హక్కుల పరి రక్షణ కోసం కోప్రా లాంటి ప్రత్యేక చట్టాలతో పాటు వారి రక్షణ కవసరమైన జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగాన్ని రూపొందించినా ఆశించిన స్థాయిలో కల్తీ కోరల్లో నుంచి వినియోగదారులను కాపాడలేక పోవడం దురదృష్టకరమే. నిజానికి అఖిల భారత స్థాయిలో  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( FSSAI) 2006 లో  స్థాపించబడింది. దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలలో కల్తీని కనుక్కొని అరికట్టడం కోసం మృదువైన పేరుతో 263 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్  ఏర్పాటు చేయడంతో పాటు డిటెక్ట్ అడల్టరేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్ పేరుతో వినియోగదారులే నేరుగా ఆహార పదార్థాలలో కల్తీని కనుక్కోవడానికి అవసరమైన సూచనలతో కూడిన ప్రక్రియను కరదీపికగా తన వెబ్​సైట్​లో చేర్చడం అభినందనీయమే. దీనితో పాటు ఫుడ్ రెగ్యులేటరీ పోర్టల్ ద్వారా 24/7 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్, వెబ్ పోర్టల్, వాట్స్ ఆప్, మొబైల్ ఆప్, ట్విట్టర్, ఫేస్ బుక్, యస్.యమ్.యస్, ఇ.మెయిల్ లాంటి ఫిర్యాదును చేసే విస్తృత అవకాశాలను కల్పించడం గమనార్హం. ఇన్ని సంఘటిత చర్యలను తీసుకున్నప్పటికీ ఆహార భద్రత అధికారుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 

కల్తీల్లో దేశంలోనే  హైదరాబాద్​ అగ్రస్థానం!

హైదరాబాద్‌‌‌‌లో ఓ ప్రముఖ చాక్లెట్ కంపెనీ ఉత్పత్తిలో  పురుగులు తేలడం, రూ.5 లక్షల విలువ చేసే కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టు పట్టుకోవడం కల్తీ స్థాయిని చూపిస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, హైదరాబాద్‌‌‌‌లో 246 కేసులతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. కల్తీ భయం ప్రజలను కుంగదీస్తోంది. జనసాంద్రత ఎక్కువ, అధికారుల సంఖ్య తక్కువ. ప్రజలు అనారోగ్యంవల్ల బాధపడుతున్నా, పాలకులు, అధికారులు స్పందించకపోవడం గమనార్హం.  

విద్యార్థులకు అవగాహన కల్పించాలి

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో ఆహార పదార్థాలలో కల్తీకి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పాఠ్యప్రణాళికలో చేర్చడం ద్వారా వారిని చైతన్య పరచాలి.  స్వచ్ఛంద సంస్థల సహకారంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థలను ఏర్పరచి వాటి ద్వారా ఆహార పదార్థాలలో  కల్తీ పట్ల ప్రజలను ఏమరుపాటుగా ఉంచడానికి అవసరమైన సదస్సులు, చర్చాగోష్టులు నిర్వహించడం ద్వారా ఆహార పదార్థాలలో ఉన్న కల్తీని సులభమైన పరీక్షలతో తెలుసుకునే 
అవగాహనను ప్రజలకు కలిగిస్తూ వారిని కల్తీపై రాజీలేని పోరాటాలకు సిద్ధం చేయాలి.

- మన్నారం నాగరాజు,
అధ్యక్షుడు, తెలంగాణ లోక్​సత్తా పార్టీ