హైదరాబాద్​లో ఇండ్ల ధరల పెరుగుదల తక్కువే

  • సగటు పెరుగుదల 7 శాతమే
  • ఢిల్లీ-ఎన్సీఆర్​లో 57 శాతం
  • వెల్లడించిన ప్రాప్​టైగర్​

న్యూఢిల్లీ: మిగతా నగరాల కంటే హైదరాబాద్​లో ఇండ్ల ధరలు తక్కువగానే పెరిగాయి. ఈ ఏడాది జులై-–సెప్టెంబర్ కాలంలో ఇక్కడ ఇండ్ల పెరుగుదల ఏడు శాతం మించలేదు. మనదేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో సగటు ఇళ్ల ధరలు 7 శాతం నుంచి 57 శాతం వరకు పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్​లో ధరలు ఏకంగా 57 శాతం పెరిగాయని రియల్​ ఎస్టేట్​ కన్సల్టెన్సీ  ప్రాప్​టైగర్​ తెలిపింది. దీని డేటా ప్రకారం ఢిల్లీ–ఎన్సీఆర్​లో సగటు ఇళ్ల ధరలు జులై–-సెప్టెంబర్ మధ్య కాలంలో చదరపు అడుగుకు రూ. 5,105 నుంచి 57 శాతం పెరిగి రూ.8,017కి చేరుకున్నాయి.

  హైదరాబాద్‌‌‌‌లో సగటు ఇళ్ల ధరలు చదరపు అడుగులకు రూ.6,580 నుంచి రూ.7,050కి.. అంటే ఏడు శాతం మేర పెరిగాయి.  ముఖ్యంగా హై-ఎండ్ ప్రాపర్టీల కోసం పెరుగుతున్న డిమాండ్ కారణంగా మిగతా నగరాల్లో ధరలు ఎక్కువ అయ్యాయి. "గత10 పాలసీ సమావేశాల్లో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటుపై యథాతథ స్థితిని 6.5 శాతం వద్ద కొనసాగించడంతో ధరలు పెరుగుతున్నాయి. రేటు తగ్గింపు లేకపోవడంతో, డెవలపర్లు, కొనుగోలుదారులపై భారం తగ్గడం లేదు" అని నివేదిక పేర్కొంది. 

నగరాలవారీగా ధరలు

అహ్మదాబాద్‌‌‌‌లో జులై-–సెప్టెంబర్‌‌‌‌లో చదరపు అడుగుకు ధర రూ. 3,900 నుంచి 21 శాతం పెరిగి రూ.4,736కి చేరుకుంది.   బెంగళూరులో చదరపు అడుగుల ధర రూ.6,550 నుంచి 15 శాతం పెరిగి రూ.7,512కి చేరుకుంది.   చెన్నైలో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ. 5,885 నుంచి రూ. 7,179కి 22 శాతం పెరగగా, కోల్‌‌‌‌కతాలో చదరపు అడుగుకు రూ. 4,797 నుంచి రూ. 22 శాతం పెరిగి రూ. 5,844కి చేరుకుంది.   ముంబైలో చదరపు అడుగుల ధర రూ.10,406 నుంచి రూ.12,590కి చేరుకుంది. 

పూణేలో ఈ ఏడాది జులై–-సెప్టెంబర్‌‌‌‌లో సగటు ధరలు 18 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.6,953కి చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో చదరపు అడుగుకు రూ.5,892గా ఉంది.  ధరల తీరుపై బీపీటీపీ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరీందర్ ధిల్లాన్ మాట్లాడుతూ ఢిల్లీ-–ఎన్‌‌‌‌సిఆర్‌‌‌‌లోని గురుగ్రామ్,  ఫరీదాబాద్ వంటి కీలక మార్కెట్‌‌‌‌లలో రేట్లు పెరిగాయని, ఇక్కడ నాణ్యమైన రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగిందని ఆయన అన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ వల్ల ధరలు ఎక్కువ అయ్యాయని వివరించారు.