పిల్లల ముందే స్కూల్ ప్రిన్సిపల్‌పై భర్త దాడి.. రోజంతా నిలిచిన క్లాసులు

జగిత్యాల జిల్లా: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లోని జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మమతపై ఆమె భర్త దాడికి పాల్పడ్డాడు. స్కూల్‌కు వచ్చి మరీ పిల్లల ముందే ఆమెపై భర్త, అతని బంధువు‌ ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం(నవంబర్ 13) జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రిన్సిపల్ మమత బుధవారం స్కూలుకు లీవ్ పెట్టానని ఇంట్లో చెప్పి  విధులకు హాజరైనట్లు తెలుస్తోంది. ఆమె పిల్లలకు పాఠాలు బోధిస్తున్న సమయంలో ఆకస్మికంగా భర్త, బంధువు దాడి చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తమ ముందే దాడి జరగడంతో విద్యార్థులు భయపడిపోయారు. ఈ దాడి ఘటనతో రోజంతా క్లాసులు నిలిచిపోయాయి.

విచారణ చేపట్టిన బీసీ గురుకుల కన్వీనర్

విషయం బయటకు పొక్కడంతో బీసీ గురుకుల కన్వీనర్ సుస్మిత స్కూల్ కు చేరుకొని విచారణ చేపట్టారు. పిల్లలతో మాట్లాడిన అనంతరం దాడి జరిగింది వాస్తవమైతే ప్రిన్సిపల్‌పై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.