దొడ్డు బియ్యం.. దొంగల పాలు

  • పోలీసుల దాడుల్లో బయటపడుతున్న వందల క్వింటాళ్లు
  • ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రకు రవాణా
  • కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు

ఆదిలాబాద్, వెలుగు : దొడ్డు బియ్యం దొడ్డిదారిన దొంగల పాలవుతోంది. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొంతమంది దళారులు పేదల దగ్గర తక్కువ ధరకు కొని మహారాష్ట్రకు రవాణా చేస్తూ అక్కడ ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఇటీవల పోలీసులు విస్త్రతంగా దాడులు చేస్తుండడంతో వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడుతోంది. ఆదిలాబాద్ ​జిల్లా వ్యాప్తంగా 1.91 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటి పరిధిలో 6.38 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా 4 వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

పేదల ఆరోగ్యం దృష్ట్యా కొంతకాలంగా ఫోర్టిఫైడ్ రైస్ కలిపిన రేషన్​ను అందిస్తున్నారు. ఇది బలవర్ధకమైన ఆహారం. రక్తహీనతను నిర్మూలించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ విషయం తెలియని ప్రజలు దొడ్డు బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. చాలా మంది రేషన్ షాపుల్లో వేలి ముద్ర వేసి డీలర్ల వద్ద కొంత డబ్బు తీసుకొని ఆ బియ్యాన్ని షాపుల్లోనే ఇచ్చేస్తుండగా, కొంత మంది ఇంటికి తెచ్చుకొని అమ్ముకుంటున్నారు. కొందరు  దళారులు ఆటోలు, జీపుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ కిలో రూ.10 నుంచి రూ.15 చొప్పున కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఆ బియ్యాన్ని అక్కడ రూ.30కు విక్రయిస్తున్నారు. 

చక్రం తిప్పుతున్న బడా వ్యాపారులు

మన బియ్యానికి మహారాష్ట్రలో డిమాండ్ ఎక్కువగా ఉండడాన్ని క్యాష్ ​చేసుకుంటున్న వ్యాపారులు పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోళు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ప్రతి నెలా సేకరించిన బియ్యాన్ని జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని గోదాములను అద్దెకు తీసుకొని పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. కొన్ని చోట్ల చిన్న దుకాణాల్లో ఉంచుతున్నారు. ఆ తర్వాత గట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యమే ఎక్కువగా పట్టుబడుతోందంటే దందా ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో రేషన్ దందాలో ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఇచ్చోడ, ఉట్నూర్, ఇంద్రవెల్లికి చెందిన పలువురు ప్రధాన వ్యాపారులుగా చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. వందల క్వింటాళ్ల బియ్యాన్ని జిల్లా నుంచి తరలించి అమ్ముకొని రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.

సంబంధిత శాఖ జిల్లా అధికారులు, ఎన్‍ఫోర్స్​మెంట్ అధికారుల నిఘా కొరవడడంతో వ్యాపారులు రేషన్ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వ్యాపారులే కాకుండా కొంత మంది రేషన్ డీలర్లు కూడా చేతి వాటం చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఈనెల 10న ఆదిలాబాద్ పట్టణ శివారులోని గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ముజాహిద్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు లోడింగ్ చేస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి పట్టుకొని 120 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఈనెల 10న ఆదిలాబాద్ రూరల్ మండలం బెల్లూరి శివారంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన 15 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. 

చర్యలు తీసుకుంటాం

రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే బియ్యం నిల్వలపై తనిఖీలు చేస్తున్నాం. ఇటీవల పలు చోట్ల దాడులు చేసి తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నాం. ప్రభుత్వం అందించే పోషకాలున్న బియ్యాన్ని ప్రజలు అమ్ముకోవద్దు. 

కిరణ్ కుమార్, డీఎస్వో, ఆదిలాబాద్