నేతల చెరలో చెరువులు..హైదరాబాద్లో వందల చెరువులు కబ్జా

వేయి సరస్సుల నగరాన్ని కబ్జాదారులు చెరబట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు, ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో మరికొందరు సిటీకి ఉపయోగపడే చెరువులను ఖతం చేశారు. ఎఫ్​టీఎల్, బఫర్​జోన్లని లెక్క చేయకుండా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడంతో గ్రేటర్ హైదరాబాద్​లోని వందల చెరువులు కుచించుకుపోయాయి. మరికొన్నయితే పూర్తిగా కనుమరుగయ్యాయి. గత సర్కారు హయాంలో సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు బాజాప్తాగా చెరువులను మింగి లగ్జరీ విల్లాలు, ఫాంహౌస్​లు, కాలేజీలు నిర్మించుకుని కబ్జాకోరులకు మార్గదర్శకులయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ​సర్కారు అధికారంలోకి వచ్చాక చారిత్రక నగరానికి పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ‘హైడ్రా’ను ఏర్పాటు చేసి ఆక్రమణదారుల భరతం పడుతోంది. చెరువులను ఆక్రమించుకున్నది ఎంతటివారైనా వదలకుండా కూల్చివేతల వాతలు పెడుతోంది.  దీంతో చెరువున్న ప్రతి చోటు నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చెరువుల్లో బడాబాబుల ఆక్రమణలను నేలమట్టం చేయాలని  వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఫిర్యాదులు వచ్చిన కొన్ని చెరువులను వెలుగు టీమ్​ పరిశీలించగా అన్ని చోట్లా   కబ్జాలే దర్శనమిచ్చాయి.    

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా బోయిన్​పల్లిలోని రామన్నకుంట చెరువు మొత్తం 29 ఎకరాల్లో విస్తరించి ఉండేది. గత బీఆర్ఎస్​ లీడర్లతో పాటు కంటోన్మెంట్​ బోర్డుకు చెందిన కొందరు మాజీ మెంబర్లు ఈ చెరువును ఆక్రమించుకుని కొన్ని బిల్డింగులు కట్టుకున్నారు. మిగతాది అమ్మేసుకున్నారు. కొన్నవారిలో చాలామంది భవనాలు, ఇండ్లు నిర్మించుకున్నారు. కట్టుకున్నారు.  ఆక్రమణలతో కుచించుకుపోయి ఈ చెరువు ఇప్పుడు ఏడెకరాలు మాత్రమే మిగిలింది. 

కబ్జాలపై అప్పుడే హెచ్చరించిన రేవంత్​ 

ఎల్బీనగర్ బైరామల్ గూడ రెవెన్యూ పరిధిలో ఉన్న మధ్యలకుంట చెరువు సర్వే నంబర్ 16లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 6.25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ ​వేయడంతో చెరువులో భూమిని తన భూమి అని చెప్పి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు, బీఆర్ఎస్​ లీడర్​ పరిహారం కూడా తీసుకున్నాడు. అలాగే చెరువు స్థలాన్ని కబ్జా చేసి బయటి వెహికల్స్ ​పార్కింగ్ కోసం ఇచ్చాడు. 

సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న టైంలో చెరువును పరిశీలించి పార్కింగ్ స్థలాన్ని తొలగించాలని, లేదంటే చూస్తూ ఊరుకోమని  సదరు ప్రజాప్రతినిధిని హెచ్చరించారు. అలాగే హస్తీనాపురం డివిజన్​లో కర్మన్ ఘాట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 58లో 11 ఎకరాల్లో ఉన్న చాపల చెరువును కూడా బీఆర్ఎస్​లీడర్లు పూర్తిగా కనుమరుగు చేశారు.  

హైరైజ్ ​బిల్డింగులు

కూకట్​పల్లి మండలం మూసాపేట పరిధిలోని అతి పెద్దదైన మైసమ్మ చెరువు శిఖంతో కలుపుకుని 280 ఎకరాలుండగా ఇప్పుడు వంద ఎకరాల కంటే తక్కువకే పరిమితమైంది. ఇక్కడ బడా బిల్డర్లు ఎఫ్​టీఎల్​పరిధిలో హైరైజ్​బిల్డింగులు కడుతున్నారు. మైసమ్మ చెరువు శిఖం, ఎఫ్​టీఎల్, బఫర్​ జోన్​ కలుపుకుని 279.37 ఎకరాలు ఉండేది. ఇందులో138.29 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ శిఖం కాగా, మిగిలిన 141.08 ఎకరాల భూమి పట్టా భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది.

 పట్టా భూమిగా రికార్డుల్లో ఉన్న భూమి మొత్తం కూడా ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉంటుంది. ఇప్పటికే ఎఫ్​టీఎల్​ పరిధిలోని భూమి మొత్తం హరించుకు పోగా శిఖం పరిధిలోని దాదాపు సగం భూమి కబ్జాకు గురైందని స్థానికులంటున్నారు. చెరువు కట్టను వదిలేసి చూట్టూ మూడు వైపుల నుంచి మట్టి, పెద్ద పెద్ద బండరాళ్లతో మూసుకుంటూ వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు.  

అప్పటి కీలక మంత్రి సూచనలతో....

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని సరూర్ నగర్ మండలం మన్సూరాబాద్ రెవెన్యూ పరిధిలోని చిన్న చెరువు ఎఫ్టీఎల్​ కబ్జాకు గురైంది. మన్సూరాబాద్ 72,75,76,78,79,80 సర్వే నంబర్లలో  6.37 ఎకరాల్లో చిన్న చెరువు ఉండేది. ఈ చెరువు ఎఫ్టీఎల్​లో బీఆర్​ఎస్​కు చెందిన ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడు ఐదంతస్తుల బిల్డింగ్​ కట్టాడు. 2022లో నిర్మాణానికి అనుమతుల కోసం అప్లై చేసుకోగా అప్పటి జీహెచ్​ఎంసీ కమిషనర్ ​రిజెక్ట్ చేశాడు. 

2016 వరకు ఈ చెరువు ఎఫ్టీఎల్​పరిధిలోనే ఉందని చూపించగా..హఠాత్తుగా 2018లో ప్రభుత్వంలోని కీలక మంత్రి సూచనలతో ఎఫ్టీఎల్​మార్పు చేసినట్టు సమాచారం. ఈ చెరువుకు సంబంధించిన నాలాను మూసేసి పై నుంచి  ఓ కార్పొరేట్ స్కూల్ కూడా నిర్మించారు.  

ఎర్రకుంట చెరువు మాయం 

పై ఫొటో చెట్లు, గోడ కనిపిస్తున్న ప్లేస్​ తార్నాకలోని ఎర్రకుంట చెరువు ప్రాంతం.  దాదాపు 30 ఎకరాల ఈ చెరువు కబ్జాలతో ఐదున్నర ఎకరాలకు చేరింది. చెరువు 
ఎఫ్​టీఎల్​ను కబ్జా చేసిన ఓ బీఆర్ఎస్​ లీడర్​దాదాపు ఎకరం స్థలంలో పెద్ద షెడ్డు కట్టాడు. అందులో ఒక హోటల్ ​నడుపుతూ టెంట్​హౌస్ ​కూడా నిర్వహిస్తున్నాడు. ఈయనతో పాటు చెరువు కట్టను ఆనుకుని ఉన్న స్థలాన్ని చాలా మంది చదును చేసి కార్లు, ఇతర వాహనాల పార్కింగ్​కు ఉపయోగిస్తున్నారు. రెండున్నరెకరాల్లో  ఓ దోభీఘాట్ ​కూడా ఉంది. చెరువుకు పడమర వైపు నిర్మాణాలు, ఇండిపెండెంట్​భవనాలు  వెలిశాయి. దీంతో ఈ చెరువు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది. 

డబ్బులు తీసుకుని ఇండ్లు కట్టించిన్రు ...

రంగారెడ్డి జిల్లా కొందూరులో దళిత, వాల్మీకి కాలనీలను ఆనుకొని సర్వేనెంబర్ 412, 413లో 4 ఎకరాల 28 గుంటలు మాల కుంట చెరువు ఉంది. సర్వే నెంబర్ 413 లోని ఎకరం భూమిని కొందరు కబ్జా చేశారు. బీఆర్ఎస్ హయాంలో కొంతమంది పొలిటికల్ లీడర్లు అమాయకుల నుంచి డబ్బులు తీసుకుని ఇండ్లు కట్టుకోవడానికి సాయపడ్డారు. గతంలో దీనిపై ఫిర్యాదులు రాగా ఇరిగేషన్ అధికారులు వచ్చి పరిశీలించారు. కానీ, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చర్యలు తీసుకోలేదు. 

సగం చెరువు ఖతం 

ఇది మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా సూరారం లింగ ( కట్ట మైసమ్మ )చెరువు. ఇప్పటికే సగం కబ్జాకు గురైంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్​లో అనేక భవనాలు నిర్మించారు. ఇది సరిపోదన్నట్టు కొందరు లీడర్లు చెరువు తూములు మూసి దిగువ భాగంలో భారీ నిర్మాణాలు చేశారు. చెరువు నుంచి బయటకు వెళ్లే తూము కాల్వను దారి మళ్లించారు. చెరువు 20 ఎకరాలుండగా 30 మీటర్ల బఫర్ జోన్ చూపించాల్సి వస్తుందని ఇరిగేషన్ అధికారులు కావాలని 16 ఎకరాలుగా చెరువును చూపించారని  స్థానికలు ఆరోపిస్తున్నారు.

చెరువొడ్డున కమర్షియల్ ​బిల్డింగ్స్​ కట్టిన్రు

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా నాచారం హెచ్ఎంటీ నగర్​లోని ఉప్పల్​ పెద్ద చెరువు 43 ఎకరాలు ఉండేది. ఇందులో 10నుంచి 15 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. ఈ చెరువు కట్టపైనే ఓ బీఆర్ఎస్ ​లీడర్​మూడంతస్తులు బిల్డింగ్​ కట్టి కమర్షియల్​గా ఉపయోగించుకుంటున్నాడు. చెరువు కట్టను ఆనుకుని బిల్డింగ్​ కట్టి తర్వాత ఓ ప్రహరీ గోడ నిర్మించాడు. ఐదేండ్ల కింద ఇక్కడి నుంచి ఉప్పల్ ​వెళ్లడానికి జీహెచ్ఎంసీ అధికారులు ఓ రోడ్డు కూడా వేసేశారు.  

విద్యాసంస్థల కోసం ఆక్రమణ   

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా గుల్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మైసమ్మగూడ సర్వేనెంబర్ 647లో కోమటికుంట చెరువు ఉంది. ఇది పది ఎకరాల్లో ఉండేది. గత ప్రభుత్వ హయాంలో బీఆర్​ఎస్​కు చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి కూడా అయిన ఓ లీడర్​ మూడు ఎకరాలను ఆక్రమించుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. చెరువు భూములను ఆయనకు సంబంధించిన ఎడ్యుకేషన్ ​ఇన్​స్టిట్యూషన్స్​లో కలిపేసుకున్నాడని, పక్కాగా ఫెన్సింగ్ కూడా వేసుకున్నాడన్న విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి వానాకాలం వస్తే చుట్టుపక్కల కాలనీలు మునుగుతున్నాయి. ఈ చెరువు ఎఫ్టీఎల్ ​పరిధిలో వేరేవాళ్లు కూడా ఎకరం వరకు కబ్జా చేసి హాస్టల్స్ నిర్మించుకున్నారు.   

ముందు కట్టుకోవాలె..వెనక కలుపుకోవాలె

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అతిపెద్ద చెరువుగా పేరున్న శామీర్ పేట పెద్ద చెరువు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అలియాబాద్ గ్రామ పరిధిలోని ఉన్న ఈ చెరువు ముందున్న జాగాలో బీఆర్​ఎస్​కు చెందిన ప్రజాప్రతినిధి, అప్పటి మినిస్టర్​ ఫుడ్ ​సెంటర్, కన్వెన్షన్​ హాల్​ నిర్మించాడు. వెనకాల ఉన్న చెరువుకు సంబంధించిన రెండెకరాలను కూడా కలిపేసుకున్నాడు. అయినా అప్పటి అధికారులు పట్టించుకోలేదు. ఈ చెరువుకు సంబంధించిన మరో 10  ఎకరాలను మరికొంతమంది కబ్జా చేశారు.  

మాజీ మంత్రి అండదండలతో...

గత ప్రభుత్వ హయాంలో తూముకుంట మున్సిపల్​ పరిధిలోని పెద్ద చెరువును అప్పటి బీఆర్ఎస్​ లీడర్​ కబ్జాచేసి అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. ఇది గతంలో 15 ఎకరాలు ఉండేది 10 ఎకరాలే మిగిలింది. ఇప్పుడు దాని కోసం రోడ్డు కూడా వేసుకున్నాడు. స్థానికులు కలెక్టర్​కు ఫిర్యాదు చేయడం, ఇరిగేషన్ అధికారులు కూడా పీఎస్​లో కంప్లయింట్​ చేయడంతో తూతూ మంత్రంగా కూల్చేశారు. అప్పటి అధికార పార్టీ మంత్రి ఇన్​వాల్వ్​ కావడంతో తర్వాత అధికారులెవరూ ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు కూడా చెరువు శిఖం భూములు కబ్జాకు గురవుతున్నాయి.