అడవులతోనే మానవాళి.. మనుగడ

2020 నాటికి ప్రపంచంలోని 150 మిలియన్ హెక్టార్ల అటవీ భూమి నిర్మూలనకు గురైంది. ఈనేపథ్యంలో 2030 నాటికి 350 మిలియన్ హెక్టార్లను పునరుద్ధరించడానికి మొదలుపెట్టిన ప్రపంచ ప్రయత్నం పేరు బాన్ ఛాలెంజ్ (Bonn Challenge).  2015లో పారిస్‌‌‌‌‌‌‌‌లో జరిగిన UNFCC కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP 21)లో  భారతదేశం కూడా స్వచ్ఛందంగా చేరింది.  

బాన్ ఛాలెంజ్ లో భాగంగా 2020 నాటికి 13 మిలియన్ హెక్టార్ల భూమిని అటవీ భూమిగా పునరుద్ధరిస్తామని, 2030 నాటికి అదనంగా 8 మిలియన్ హెక్టార్లను పునరుద్ధరిస్తామని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. అయితే, అక్కడ ప్రతిజ్ఞ చేసిన తరువాత ఇక్కడ అనుగుణమైన ప్రయత్నాలు, కార్యక్రమాలు మాత్రం చేపట్టలేదు. ఈ లక్ష్యాలు అన్ని గాలి మాటలే అని 2024లో అర్థం అవుతున్నది. 

వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే అటవీ సంపద పెరగాలని శాస్త్రవేత్తలతోపాటు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలలో చేసిన వాగ్దానాలలో అటవీ సంపద పెంపు గురించి స్పష్టమైన లక్ష్యాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. దేశంలో నీతి ఆయోగ్ లాంటి సంస్థలు క్లైమేట్ చేంజ్ మీద కొన్ని నివేదికలు ఇచ్చినా అటవీ సంపద పెంపు గురించి ప్రస్ఫుటంగా ఎన్నడూ మాట్లాడలేదు. 

ప్రజల మీద పన్నులు విధించటానికి నిత్యం సంప్రదింపులు, సమావేశాలు పెట్టే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ సంపద పెంపుదల లక్ష్యంగా ఇప్పటివరకు జాతీయస్థాయి సమావేశం నిర్వహించలేదు. కాకపోతే, ప్రాజెక్టులకు కావాల్సిన అటవీ అనుమతులు త్వరగా ఇవ్వాలని మాత్రం సర్వత్రా ఒత్తిడి మాత్రం చేస్తారు. ఇటీవల అటవీ అనుమతులను సరళీకృతం చేయడం ఇంకా దారుణం.  

అటవీ సంరక్షణ చట్టం సవరణ కూడా సరైన సంప్రదింపులు లేకుండా, చాలావేగంగా పార్లమెంట్ఆమోదించింది . ఈ సవరించిన చట్టం వల్ల ఉన్న అరకొర అటవీ భూమి తీవ్ర  ప్రమాదంలో పడింది. దీనిని బట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరోగమన దిశలో పయనిస్తూ, వన మహోత్సవాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నాయి.

సకల జీవాల సమాహారం అడవి

దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు చెట్ల పెంపకానికి, వన మహోత్సవాలకు ఇచ్చినన్ని నిధులు అడవుల పునరుద్ధరణకు మాత్రం కేటాయించవు. దేశవ్యాప్తంగా చెట్ల నరికివేత, అటవీ భూముల బదలాయింపు వగైరా వనాల వ్యతిరేక పనులు జరుగుతున్న నేపథ్యంలో అడవుల పెంపకం పేరిట నిధుల విడుదలకు కొదవలేదు. అన్ని రాష్ట్రాలలో అట్టహాసంగా ప్రతి వానాకాలంలో,  ముఖ్యులకు తీరిక సమయాలలో వన మహోత్సవాలు చేస్తారు.

 పేరుకే అటవీ సంపద పెంపుదల పథకాలు. కానీ, ఇవి ఎక్కువగా చెట్ల పెంపకంగానే కనిపిస్తుంది. కోల్పోయిన వనాలు, అటవీ సంపద పెంచడం అంత సులువు కాదు. అసలు ‘అడవుల పెంపకం’ అని పాలన పుస్తకాలలో రొటీన్​గా వాడే పదానికి అర్థం కార్యక్రమాల ప్రణాళికలలో కనిపించదు. అడవి అంటే కేవలం వృక్షాలు కాదు. సకల జీవాల సమాహారం అడవి. జీవ వైవిధ్యానికి మూలం అడవులు. నాలుగు ఒకే రకం చెట్లు పెట్టి అటవీ సంపద పెంచాం అని పుస్తకాలలో, మీడియాలో ప్రచురించడం, ఆర్భాటంలో ఈ తేడాను మనం గమనించాలి. భూమి ఉష్ణోగ్రతలు పెరగడానికి ఒక ప్రధాన కారణం కర్బన ఉద్గారాలను పీల్చుకునే అడవులు కోల్పోవడం.

అణు ధార్మికతను అధిగమించేది ప్రకృతి

అడవులకు అదనపు అటవీ విస్తీర్ణం, చెట్ల పెంపకం ద్వారా 2.5-3 బిలియన్ టన్నుల CO2కి సమానమైన అదనపు కార్బన్ సింక్‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించడానికి భారతదేశం కట్టుబడి ఉంది. అంటే అటవీ విస్తీర్ణం ప్రస్తుత 25% నుంచి 33%కి పెంచడం, 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని అడవులుగా పునరుద్ధరించడం అన్నమాట. అయితే, ఇటువంటి లక్ష్యాలకు కొదవలేకున్నా కార్యచరణ ప్రణాళికలు మాత్రం కొరవడుతున్నాయి. 

 అడవులను ప్రోత్సహించే విధానాలు, అడవులను నరికివేతను నిలువరించే విధానాలు, చెట్లను రక్షించే వ్యూహాలు లేవు.  నాటిన మొక్కల మనుగడ రేటు చాలా తక్కువగా ఉంది.  నాటిన తరువాత మొక్కల పెరుగుదలకు, సంరక్షణకు తగిన పర్యవేక్షణ లేదు. ఎక్కడైతే నిరంతర నిఘా ఉంటుందో అక్కడ మొక్కలు వృక్షాలుగా మారాయి. ఈ అనుభవం దృష్ట్యా కూడా ప్రభుత్వం పర్యవేక్షణ మీద నిధులు, శ్రద్ధ పెట్టడం లేదు.  

ప్రపంచవ్యాప్తంగా అడవులను వాటి మానాన వదిలేస్తే వాటంతట అవే పునర్​వైభవం అందుకుంటాయని మానవులు నేర్చుకున్న పాఠం.  చెర్నోబిల్ అణు కర్మాగారం చుట్టూ 1986 ప్రమాదం తరువాత దడి కడితే ఇన్నేండ్లలో అక్కడ చక్కటి  సకల జీవాలతో కూడిన అడవి ఉద్భవించింది.  అణు ధార్మికత ఉంటుంది అనే భయంతో అక్కడికి ఎవరిని అనుమతించలేదు. కానీ, ప్రకృతి అణు ధార్మికతను అధిగమించి పెరిగింది. అంటే, మనం అడవుల పెంపకం మీద,  విస్తృతి మీద చిత్తశుద్ధి ఉంటే అడవులలో మానవుల ప్రమేయం తగ్గిస్తే మంచిది అనే సూత్రం అమలు చెయ్యాలి.

ప్రకృతి వైపరీత్యాలకు విరుగుడు అడవులు

ప్రకృతి అనుకూల జీవన విధానం ఆదివాసులది. వారి జీవనాన్ని మార్చి, ఏమార్చిన ఘనత ఆధునిక సమాజానిది. అడవులలో ప్రకృతి అనుకూల ఆదివాసి జీవనం కూడా అనుమతించడం ఈ సూత్రంలో భాగమే. భూమి ఉష్ణోగ్రతను పెంచే కార్బన్‌‌‌‌‌‌‌‌ను తగ్గించడంలో భాగంగా జీవవైవిధ్యం పెంపొందించడం, పర్యావరణ వ్యవస్థలను తిరిగి నిలవటానికి తగిన జీవనోపాధులను ప్రోత్సహించడం ఈ వ్యూహంలో ఒక భాగం. 

కానీ వాతావరణ మార్పులను పరిమితం చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా చెట్లను పెంచే ప్రయత్నాలు వేగంగా పెరిగే చెట్లకు, ఏక పంట మాదిరి ఒకే రకం చెట్ల వనాల వైపు మళ్ళాయి. దీనికి కారణాలు.. సహజ అటవీ పునరుద్ధరణ కంటే చాలా వేగంగా పెరిగే చెట్లను నాటితే  ఈ చెట్ల నుంచి కలపను సేకరించడం ద్వారా అటు వ్యాపారం వృద్ధి చెందుతుంది, ఇటు కర్బన ఉద్గారాలు తగ్గిస్తున్నామని గొప్పలు చెప్పుకుని తగిన నిధులు సేకరించవచ్చు. 

ఈ రకమైన ఆలోచనలు వన మహోత్సవాల లక్ష్యాలలో ఉండడం శ్రేయస్కరం కాదు. కలప అవసరం అనుకుంటే పొలాల గట్ల వెంబడి, బంజరు భూములలో చెట్లను పెంచవచ్చు. వాటి వలన సహజ అడవులపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. చెట్లు వేగంగా పెరగాలని కొనకార్పాస్ వంటి ‘విదేశీ’ చెట్లను తెచ్చి సమస్యలను జటిలం చేస్తున్నారు. ఈ అనాలోచిత కార్యక్రమాల వల్ల అసలుకే  మోసం వస్తున్నది.  

ప్రస్తుత వాతావరణ వైపరీత్యాలకు, వాతావరణ మార్పులకు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు విరుగుడు అటవీ సంపద పెంపుదలలో ఉన్నది. అటవీ సంపద అంటే కేవలం అటవీ భూమి విస్తీర్ణం కాదు. కొన్ని చెట్ల పెంపకం అసలే కాదు. సమస్త జీవవైవిధ్యం మనగలిగే ఒక సుస్థిర ప్రదేశం. ఇది సాధ్యపడాలంటే ప్రభుత్వ మెరుగైన విధానాలు కావాలి, ప్రజల భాగస్వామ్యం పెరగాలి. అటవీ సంరక్షణ చట్టాలు రావాలి. 

‘కంపా’ నిధులతో వృక్ష సంపద పెంచాలి 

అటవీ సంపద పెంచటంలో అనేక సవాళ్లు ఉన్నాయి. అడవుల పెంపకం కోసం నిర్దేశించిన కంపా (CAMPA) నిధులు ఉపయోగం పూర్తి స్థాయిలో, అవసరమైన వాటి మీద ఖర్చు చేయడం లేదు. సమర్థంగా అమలు జరగడం లేదు.  ఈ కంపా నిధులను అడవి, వృక్షసంపద మానవ కార్యకలాపాలకు అత్యంత అవసరం అని భావించిన తరుణం కోల్పోతున్న  ప్రతిచెట్టుకు 5 రెట్లు చెట్లు నాటే కార్యక్రమానికి ఉపయోగించాలి.

  కొన్ని చెట్లను లెక్క తీసి, ఇంకో పడావు పడ్డ భూమిలో చెట్లు నాటుతామని, అది చాలా గొప్ప కార్యక్రమంగా ప్రభుత్వ అధికారులు భావిస్తుంటారు. ఒక ఊరు మొత్తం నిర్వాసితులను చేసి ఇంకెక్కడో ఇండ్లు ఇచ్చి పునరావాసం పేరిట కుటుంబాలను గోస పెట్టే అభివృద్ధి ప్రాజెక్టులు అటవీప్రాంతాన్ని, అడవిలోని జీవ వైవిధ్యాన్ని ఘోరంగా నాశనం చేసి, నాలుగు పైసలు విదిల్చి తమ పని అయిపోయినట్టుగా భావిస్తుంటారు. 

ఆశ్చర్యం ఏమిటంటే న్యాయ వ్యవస్థ కూడా లోతుల్లోకి వెళ్లి పరిశీలించకుండా ఈ అభివృద్ధి రచిత అధికారులను నమ్మి అడవులను కాపాడమని వచ్చే వ్యాజ్యాలను కొట్టివేస్తుంటుంది. ఇదే వ్యవస్థ ఇంకెక్కడో నదికి, ప్రకృతికి కూడా సహజ హక్కులు ఉన్నాయి అని తీర్పు ఇవ్వడం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. 

 డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​