ప్రకృతి ప్రకోపం సరే..మానవ తప్పిదాల మాటేంటి

21వ శతాబ్దంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవుడి జీవిత కాలం పెరిగింది. అదే సమయంలో అనేక విపత్తుల వల్ల ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. అభివృద్ధి, జనాభా, నగరీకరణ తరచూ వరదలు రావడానికి కారణమవుతున్నాయి. జనాభా పెరుగుతున్నకొద్దీ  సహజ వనరులపై ఒత్తిడి అధికమవుతోంది. ఇది మానవ జీవితాలను అత్యంత అపాయంలోకి నెడుతోంది. కొన్ని చోట్ల సరైన అభివృద్ధి ప్రణాళిక లేకపోవడం వల్ల వరదలు ఏర్పడుతుండగా మరికొన్ని చోట్ల అతి మౌలిక సౌకర్యాల లేమివల్ల వరదలు సంభవిస్తున్నాయి. ఈ విధంగా మానవుడి అభివృద్ధి కూడా కొత్త సవాళ్లను విసురుతోంది.

మహా నగర అభివృద్ధి ప్రణాళికలు ఎక్కడ ? 

 1956లో హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నగరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఈ వలసల వల్ల  జనసాంద్రత పెరగడంతోపాటు వాటికి అనుగుణంగా పట్టణ మౌలిక సదుపాయాల ప్రణాళికలను సరైన రీతిలో పాటించకపోవడం, అక్రమ కట్టడాలు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల అమానవీయ అవినీతి, పురాతన మౌలిక సదుపాయాలు, అంతంతమాత్రంగా ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థలు.. పర్యావరణ నిబంధనల ప్రకారం ప్రతి చెరువు, నదీ పరీవాహక ప్రాంతాల్లో కొంత భూభాగాన్ని బఫర్‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌గా నిర్ణయించి అక్కడ చెట్లు, పచ్చిక బయళ్ళు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

ఈ బఫర్‌‌‌‌ జోన్లలో తాత్కాలిక ఆవాసాలు ఏర్పరచుకోవడంతో మొదలుపెట్టి, బహుళ అంతస్తుల ఆకాశ భవంతులు వెలుస్తున్నాయి. వాటికి అత్యంత సమీపంలోనే పుట్టగొడుగుల్లా వెంచర్లు అభివృద్ధి చెందడం లాంటివి ఈ దుస్థితికి ప్రధాన కారణాలవుతున్నాయి. 

భవన నిర్మాణ నియమాల ప్రకారం నగరాల్లో వాన నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడం పరిస్థితిని దుర్భరం చేస్తోంది. హైదరాబాద్ నగరానికి 5,000 కిలోమీటర్ల  నాలాలు, కాలువలు అవసరమైతే,  ప్రస్తుతం కేవలం 1500 కిలోమీటర్ల మేర మాత్రమే నాలాలు  ఉన్నాయి.  4,00,000 డ్రైనేజీ గుంతలు ఉండాల్సిన చోట కేవలం 2,00,000 డ్రైనేజీ గుంతలు మాత్రమే ఉన్నాయి.

దీనికితోడు 80 అడుగుల కాల్వలు 8 అడుగులకు చేరిపోతే వ్యర్థాలు బయటకు ఎలా వెళతాయో ప్రభుత్వాలు ఆలోచించాలి.  ఓల్డ్ సిటీలో చాలా ప్రాంతాలలో ఇప్పటికీ పురాతనమైన డ్రైనేజీ విధానమే కొనసాగుతోంది. 40 వేల జనాభా కోసం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరగకపోవడం చాలా విచారకరం.

చెరువుల్లో 80 శాతం కబ్జా 

గొలుసు చెరువులకు పేరుపొందిన హైదరాబాద్ వంటి నగరాల్లో వందలాది, వేలాది కుంటలు, చెరువులు ఇవాళ నివాస కాలనీలైపోయాయి.  ఒకప్పుడు   హైదరాబాదు  పరిధిలో   చెరువులు  2000 పైగా ఉన్నట్లు పాత రికార్డులు చెబుతాయి.  దానికి తోడు చెరువులు,   గత నాలుగు దశాబ్దాలలో నగరంలో దాదాపు అన్ని చెరువుల్లో 80 శాతం భూమి కబ్జాకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది.  కొన్ని చెరువులు, కుంటలైతే పూర్తిగా ఆక్రమణలకు గురై కాలనీలుగా మారాయి.

2010 నాటికి, 500 సరస్సులు HUDA అధికార పరిధిలో ఉన్నాయి. మే 2018 నాటికి, HUDA 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న 169 సరస్సుల రికార్డును నిర్వహిస్తోంది. ఇందులో 62 సరస్సులు ప్రభుత్వ అధీనంలో ఉండగా, 25 ప్రైవేట్ సంస్థల అధీనంలో ఉన్నాయి. 82 సరస్సులు ఉమ్మడి ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి.  కాగా  14 సంవత్సరాలలో  మొత్తం సరస్సుల సంఖ్య కేవలం 169 కు తగ్గించబడింది. హైదరాబాద్‌‌‌‌లో 1575 AD లో నిర్మించబడిన అతిపెద్ద సరస్సు అయిన హుస్సేన్ సాగర్ వైశాల్యం కేవలం 30 సంవత్సరాలలో 40% కంటే ఎక్కువ అంటే 550 హెక్టార్ల నుండి 349 హెక్టార్లకు తగ్గిపోయింది. 

మన పాత్ర ఏమిటి ? 

 ఎకరాల్లో కొని గజాల్లో అమ్ముతూ, కోట్లకు పడగెత్తుతూ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం తన భూదాహంతో చెరువులనూ, కుంటలనూ ఆక్రమిస్తున్నది. ఆ అక్రమ ఆక్రమణలను అవినీతి వల్లనో, ఆశ్రిత పక్షపాతం వల్లనో ప్రభుత్వం చూసీ చూడనట్టు వదిలేస్తున్నది. చివరికి సగటు మనిషి ఇల్లు మునిగిపోతున్నది. ప్రభుత్వమంటే మనమే కదా.  ప్రతి పనికీ ప్రభుత్వం వచ్చి చూస్తుందని ఎదురు చూడకుండా మన పరిధిలో భూగర్భ జలాల సంరక్షణకు ఏమి చేయాలో ఆలోచించడం ఇప్పటికైనా మొదలు పెట్టకపోతే ఇప్పుడు అందుబాటులో ఉన్న చెరువులు కుంటలు కూడా 2050 నాటికి అంతమైపోతాయి.

అభివృద్ధి చెందిన దేశాల్లో బహిరంగంగా చెత్త వేస్తే నేరంగా పరిగణిస్తారు. కానీ,  మన దేశంలో పట్టించునే నాథుడే కరువయ్యాడు, ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు, కార్యక్రమాలు చేపట్టినా పౌరుల్లో బాధ్యత పెరిగి, అవగాహన ఏర్పడి, మార్పు వస్తేనే ప్రకృతి వనరుల పరిరక్షణ సాధ్యమవుతుంది. అప్పుడే మానవ ప్రేరిత విపత్తులను  చాలావరకు నివారించడం తేలికవుతుంది. అలాగే, ప్రస్తుతం హైడ్రాతో రేవంత్​రెడ్డి ప్రభుత్వం ఆ కార్యం జరుపుతున్నం
దుకు అభినందిద్దాం.

-  డాక్టర్. బి. కేశవులు నేత