ఆరునెలల్లో ఎంత తేడా.. అసెంబ్లీలో ఒక తీర్పు.. . పార్లమెంట్​లో మరో తీర్పు

  • జిల్లాలో  పొలిటికల్​ పార్టీల బలాబాలాల్లో మార్పు 
  • లీడర్లకు అంతుపట్టని ఓటర్ల నాడీ 

నిజామాబాద్​, వెలుగు:  ఆరు నెలల కిందట అసెంబ్లీ ఫలితాలకు ప్రస్తుత  పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ కు ఇందూరు ఎంపీ స్థానంలో ఎంతో తేడా కనిపించింది.  ఓటర్లు అప్పుడో రకంగా ఇప్పుడు మరో రకంగా జడ్జిమెంట్​ ఇచ్చారు.  ఓటర్ల నాడీ అంతుచిక్కకుండా ఉండటంతో పొలిటికల్ లీడర్లు చివరి వరకు ఉత్కంఠకు గురయ్యారు.    అసెంబ్లీ ఎన్నికలకంటే  బీజేపీ కి ఓట్లు పెరిగి అర్వింద్​ను ఎంపీగా గెలిపించారు.  

అదే రీతిలో పుంజుకొని ఓట్ల సంఖ్య పెరిగినా అభ్యర్థి టి. జీవన్​రెడ్డి ఓటమి చెందారు.  బీఆర్​ఎస్​ విషయానికి వస్తే పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలు ఇప్పుడు  ఏకంగా డిపాజిట్​ గల్లంతు చేశారు.  ఒక్కసారిగా మారిన ఈ పరిణామాలు జిల్లా రాజకీయాలను మార్చేశాయి. గెలిచిన బీజేపీ సహా ఓడిన ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు తాము పొందిన ఓట్లపై ప్లస్​ మైనస్​ లెక్కలు వేసుకుంటున్నారు. 

అసెంబ్లీలో ఓడాక మరింత ఫోకస్​

ఎంపీగా కొనసాగుతూ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్​కు ముందు అర్వింద్​ రాష్ట్ర రాజకీయాల వైపు ఇంట్రెస్ట్​ చూపారు. ఆర్మూర్​లో నివాసం ఏర్పర్చుకొని సెగ్మెంట్​పై ఫోకస్​ చేశారు. తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని పలుమార్లు మీడియా వెల్లడించారు. అయితే బీజేపీ హైకమాండ్​ ఆదేశాలతో కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్​ నుంచి పోటీ చేసి 61,810 ఓట్లు సాధించి సెకెండ్​ ప్లేస్​లో నిలిచారు. 

72,115 ఓట్లు పొందిన సంజయ్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో ఓటమి తరువాత ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం పక్కా అని నిర్ణయించుకున్న అర్వింద్​ మొత్తం పార్లమెంట్​ సెగ్మెంట్​పై దృష్టి పెట్టారు.  కోరుట్ల, నిజామాబాద్​ రూరల్​, బాల్కొండ, ఆర్మూర్​లో సాధించిన మెజారిటీ ఆయన్ని  మరోసారి ఎంపీగా గెలిపించగా మిగితా మూడు అసెంబ్లీ స్థానాలలో కూడా మెరుగైన రిజల్టు లభించింది.  అసెంబ్లీ ఎలక్షన్​ కంటే  పార్లమెంట్​ ఎన్నికలలో బీజేపీకి 1,11,734 ఓట్లు ఎక్కువ వచ్చాయి.

ఓట్లు పెరిగినా ఓడిన కాంగ్రెస్​ 

అసెంబ్లీ ఎన్నికలలో బోధన్​, నిజామాబాద్​ రూరల్​ సెగ్మెంట్​లలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అప్పుడు మొత్తం పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలో 4,08,135 ఓట్లు నమోదయ్యాయి.  తాజా పార్లమెంట్​ ఎన్నికల్లో  అభ్యర్థిగా పోటీ చేసిన తాటిపర్తి జీవన్​రెడ్డికి  4,83,077 వచ్చినా ఓటమి చెందారు. అసెంబ్లీ ఎన్నికలకంటే సుమారు పది శాతం ఓట్లు పెరిగినా గెలుపు అందుకోలేకపోయారు. అర్బన్​, బోధన్​, జగిత్యాల  సెగ్మెంట్​ ఓటర్లు అక్కున చేర్చుకొని లీడ్​ ఇచ్చినా ఆదుకోలేకపోయింది.  

అసెంబ్లీ ఓట్ల ధీమాతో దిగి చతికిల

2023లో కోరుట్ల, జగిత్యాల, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్​లలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు గెలిచారు. పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలో అప్పుడు మొత్తం 4,17,315 ఓట్లు లభించాయి.  దీనిని తమ ఓటు బ్యాంక్​గా భావించిన అధిష్టానవర్గం బాజిరెడ్డి గోవర్ధన్​ను పోటీలో దింపింది.   ఏడు నియోజకవర్గాల్లో కలిపి కేవలం 1.2 లక్షల ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయింది. బీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించిన ఇక్కడి ప్రజలు, పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం జాతీయ పార్టీల వైపే మొగ్గు చూపారు.  

కేసీఆర్ వచ్చి జగిత్యాల పట్టణం, నిజామాబాద్ నగరంలో ప్రచారం చేసినా ఏ మాత్రం ఫలితం కనిపించలేదు. దీంతో బీఆర్ఎస్ కు  కంచుకోట లాంటి నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో  కేవలం లక్ష ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బీసీ నేతను బరిలోకి దింపడం లాభం చేకూరుస్తుందని అంచనా వేయగా ప్రజలు ఘోరంగా ఓడించారు. 

 బీజేపీకి కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్ 

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏడు నియోజకవర్గాల్లో కలిపి 3.67 లక్షల ఓట్లు మాత్రమే రాగా.. పార్లమెంటు ఎన్నికల్లో అర్వింద్ కు 5,92 318 ఓట్లు వచ్చాయి.  దీంతో బీజేపీకి దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఓట్లకు పైగా రాగా..   కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై అర్వింద్ దాదాపు 1.21 లక్షల ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు. బీఆర్ఎస్ కు కేవలం లక్ష ఓట్లు రావడం..  అవన్నీ బీజేపీకే క్రాస్ అయినట్లు స్పష్టంగా  కనిపిస్తోంది.