పీయూ వీసీ పోస్టుకు మస్తు పోటీ

మహబూబ్​నగర్​, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ (పీయూ) వైస్​ చాన్స్​లర్​ పోస్టుకు మస్తు డిమాండ్​ ఏర్పడింది. వీసీగా బాధ్యతలు నిర్వర్తించేందుకు గతంలో ఇక్కడ పని చేసిన వీసీలు, రిజిస్ట్రార్లు పోటీ పడుతుండడం, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు, ఉస్మానియా వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఈ పోస్టుకు అప్లై చేసుకోవడంతో ఎవరిని ఈ పోస్టు వరిస్తుందా? అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

159 అప్లికేషన్లు..

పీయూ వీసీగా ప్రస్తుతం లక్ష్మీకాంత్​ రాథోడ్​ కొనసాగుతున్నారు. ఈయన పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే కొత్త వీసీలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి 28 నుంచి ఈ నెల 12 వరకు అప్లికేషన్లు తీసుకుంది. ఎలాంటి వయో పరిమితి లేకపోవడంతో ఈ పోస్టుకు 159 అప్లికేషన్లు వచ్చాయి. ఈ పోస్టులో మళ్లీ కొనసాగించాలని లక్ష్మీకాంత్​ రాథోడ్​ అప్లై చేసుకున్నారు. గతంలో పీయూ వీసీలుగా పని చేసిన భాగ్య నారాయణ, రాజారత్నం కూడా రేస్​లో ఉన్నారు. 

వీరితో పాటు గతంలో పీయూ రిజిస్ట్రార్లుగా పని చేసిన వెంకటాచలం, పాండు రంగారెడ్డి, శివరాజు కూడా వీసీ పోస్టుకు అప్లై చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్​ ప్రతాప్​ రెడ్డి, నల్గొండ యూనివర్సిటీలో రిజిస్ట్రార్​గా పని చేసిన కృష్ణారావు అప్లై చేసుకున్న వారిలో ఉన్నారు. అయితే, రాష్ట్ర సర్కారు మాత్రం వీసీల నియామకాన్ని సీరియస్​గా తీసుకుంది. 

గత ప్రభుత్వం వర్సిటీలకు వీసీలను నియమించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేయడం, కొందరు వీసీలపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. వీసీలుగా అప్లై చేసుకున్న వారి గురించి ఆరా తీసేందుకు ఇంటెలిజెన్స్​ రిపోర్ట్​ తెప్పించుకుంటోంది. అలాగే సెర్చ్​ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పాలక మండలి నుంచి ఒకరు, ప్రభుత్వ ప్రతినిధి ఒకరు, యూజీసీ ప్రతినిధి ఒకరు అప్లికేషన్లను వడపోసి ముగ్గురి పేర్లను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన వారి పేర్లను హయ్యర్​ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​​కు సిఫార్సు చేస్తారు. వారు ఈ ముగ్గురి పేర్లను గవర్నర్​కు పంపిస్తే, గవర్నర్​ ముగ్గురిలో ఒకరిని సెలెక్ట్​ చేసి వీసీగా ఎంపిక చేస్తారు. 

ఇప్పటి వరకు ఆరుగురు వీసీలు..

పాలమూరు వర్సిటీని 2008లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రారంభించింది. వర్సిటీని ఏర్పాటు చేసి 16 ఏండ్లు కావస్తుండగా, ఇప్పటి వరకు ఆరుగురు వీసీలుగా పని చేశారు. మొదటి వీసీగా 25 జూలై 2008న వి.గోపాల్​ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో 25 జూలై 2011లో కె.నర్సింహారెడ్డి వీసీగా నియామకం కాగా, తొమ్మిది నెలలు మాత్రమే పని చేశారు. ఆయన స్థానంలో 24 ఏప్రిల్​ 2021న వీసీగా భాగ్య నారాయణ నియమితులయ్యారు. 25 జూలై 2016లో వీసీగా బి.రాజారత్నం, 25 జూలై 2019లో రాహుల్​ బొజ్జా, 22 మే 2021 నుంచి వీసీగా లక్ష్మీకాంత్​ రాథోడ్​ 
కొనసాగుతున్నారు. 

సీఎం సొంత జిల్లా కావడంతో..

పీయూ సీఎం రేవంత్​ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్​నగర్​లో ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో పదేండ్ల పాటు పీయూ డెవలప్​మెంట్​కు నిధులు పూర్తి స్థాయిలో కేటాయించలేదు. కేవలం జీతాలకు తప్ప, బడ్జెట్​లో ప్రత్యేకంగా నిధులు వెచ్చించలేదు. గత ఏడేండ్లలో డెవలప్​మెంట్​ కోసం రెండు సార్లు మాత్రమే బడ్జెట్​ కేటాయించింది. 2017–18 రాష్ట్ర బడ్జెట్​లో జీతాల కోసం రూ.5.7 కోట్లు కేటాయించగా, డెవలపమెంట్​ కోసం రూ.10 కోట్లను రిలీజ్​ చేసింది. 2019–20లో జీతాలకు రూ.6.63 కోట్లు ఇవ్వగా, రూ.90 లక్షల మాత్రమే డెవలప్​మెంట్​ కోసం విడుదల చేసింది. 

ఆ తర్వాత పైసా ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్​ గవర్నమెంట్​ రూలింగ్​లోకి వచ్చినప్పటి నుంచే పీయూపై స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి పీయూకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని పట్టుబడట్టడంతో రూ.20 కోట్ల నిధులు వచ్చాయి. అలాగే కేంద్రం నుంచి పీయూకు ‘ఉషా’ స్కీం ద్వారా రూ.వంద కోట్లు మంజూరు చేయించేలా ఎమ్మెల్యే కృషి చేశారు. ప్రస్తుతం ఈ స్కీం కింద మొదటి​విడతలో రూ.25 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో త్వరలో డెవలప్​మెంట్​ వర్క్స్​  ప్రారంభించనున్నారు.