టీయూ వీసీ పోస్టుకు మస్తు పోటీ .. మొత్తం 133 మంది దరఖాస్తులు

  • రేసులో ఆరుగురులోకల్ ప్రొఫెసర్లు
  • సమర్థుడి వేటలో గవర్నమెంట్ ప్రత్యేక ఫోకస్
  • సెర్చ్​ కమిటీకి బాధ్యత.. వర్సిటీలో ఉత్కంఠ

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ ​జిల్లాలోని తెలంగాణ వర్సిటీ వీసీ పోస్టుకు భారీ డిమాండ్​ నెలకొంది. మొత్తం 133 మంది దరఖాస్తులు చేసుకోగా, అందులో ఆరుగురు వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఉన్నారు. వీరందరినీ జల్లెడ పట్టి ముగ్గురి పేర్లను గవర్నర్​కు రికమెండ్ చేసే బాధ్యత సెర్చ్ కమిటీకి సర్కారు అప్పగించింది. అయితే, వీసీ హోదాలో రవీందర్​ గుప్తా వివాదాస్పద తీరు, అవినీతి వలతో వర్సిటీ పరువును స్టేట్​ లెవల్​లో దిగజారింది. గతేడాది జూన్​17న ఆయన ఏసీబీకి చిక్కి జైలుకు వెళ్లినప్పటి నుంచి ఇన్​ఛార్జి వీసీలే కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో గత లోపాలన్నీ సరిచేసి పాలనను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది.

సెర్చ్​ కమిటీ కోర్టులో బంతి

ఈసీ పర్మిషన్​ రావడంతో వీసీ పోస్టుకు ముగ్గురి పేర్లను సిఫారసు చేసే బాధ్యతను ముగ్గురు సభ్యులతో కూడిన సర్చ్​ కమిటీకి గవర్నమెంట్​అప్పగించింది. ఇందులో టీయూ వర్సిటీ తరఫున ప్రొఫెసర్​సులేమాన్​ సిద్దిఖీ, యూజీసీ తరఫున రాజేశ్వర్​సింగ్​ ఛండేల్, గవర్నమెంట్​పక్షాన ఛీప్​ సెక్రటరి శాంతికుమారి ఉన్నారు. ఈ కమిటీ సిఫారసు చేసే ముగ్గురిలో ఒకరిని గవర్నర్​అపాయింట్​ చేస్తారు. ఇప్పుడు సెర్చ్ కమిటీ నిర్ణయంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ వర్సిటీ వీసీ పోస్టు కోసం మొత్తం 133 మంది అప్లికేషన్లు పెట్టారు. వీరందరి గుణగణాలు తెలుసుకోవడానికి గవర్నమెంట్​ విజిలెన్స్ ​శాఖతో ఇప్పటికే ఎంక్వైరీ చేయించి రిపోర్టు తెప్పించుకుంది. 

అవినీతిమచ్ఛలేని వీసీ కోసం.. 

గత బీఆర్ఎస్ హయాంలో వీసీ పోస్టును వేలం పాటతో దక్కించుకునేవారనే ప్రచారం ఉంది. టీయూ వీసీగా రవీందర్​గుప్తా  నియమితులయ్యాక ఆయన అవినీతి వ్యవహారాలు వర్సిటీ పరువు తీశాయి. ఒక కాలేజీ యజమాని నుంచి ఆయన లంచం తీసుకుంటూ గతేడాది జూన్​ 17న ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా​పట్టుబడ్డాడు. ఈ క్రమంలో అవినీతిమచ్ఛలేని వీసీని టీయూకు ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయించి ముందుకు వెళ్తోంది. ప్రొఫెసర్​గా పదేళ్ల అనుభవం, 70 ఏండ్లలోపు వయస్సు ఉన్న వారినే వీసీలుగా అపాయింట్ ​చేస్తారు. ప్రధానంగా టీయూ రిజిస్ట్రార్​ యాదగిరి, ఈ మధ్యే ప్రొఫెసర్​గా రిటైరైన మైనారిటీ మహిళ నసీం, ప్రొఫెసర్ ఖైసర్​ అహ్మద్​, ప్రొఫెసర్​అరుణ, ఎస్సీ సామాజికవర్గం నుంచి ఫ్రొఫెసర్​ కనకయ్య, ప్రొఫెసర్​ విద్యావర్ధిని వీసీ రేస్​లో 
ఉన్నారు. 

ఈసీ పర్మిషన్​తో ముందుకు

ఆర్జీయూ కేటీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీ మినహా స్టేట్​లోని 10 వర్సిటీల్లో వీసీల నియామకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. మే 21కి  చాలా చోట్ల వీసీల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో అంతకుముందే భర్తీలు ముగించాలని సర్కారు యోచించింది. ఇంతలో పార్లమెంట్​ఎన్నికల కోడ్​అమల్లోకి రావడంతో ప్రక్రియకు బ్రేక్​ పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలింగ్​ముగియడంతో వీసీలను అపాయింట్​చేసేందుకు పర్మిషన్​ ఇవ్వాలని గవర్నమెంట్​ఈసీని కోరగా, గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది.