నిద్రలో వచ్చిన కలలు గుర్తుండాలంటే.. ఇలా చెయ్యండి

రోజూ కలలు కంటాం. ఆ కలలు రాత్రంతా ఏదో లోకంలో విహరించేలా చేస్తాయి. ఆ కలలో భయపడతాం.. చచ్చిపోతాం.. ఇలా ఎన్నో ఎన్నో జరుగుతాయి కలలో.  కళ్లు తెరిచేంత వరకు ఆ కల గుర్తు ఉంటే.. ఆ రాత్రి ఒక జీవితాన్ని మొత్తం చూసొచ్చినట్టు, ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే, చాలా కలలు మనకు గుర్తుండవు. ఎందుకు? అవి గుర్తుండాలంటే ఏం చెయ్యాలి?

మనం నిద్రలోకి జారుకోగానే కొంత  సమయానికి రెమ్ (ర్యాపిడ్ బ మూవ్మెంట్) సర్కిల్ లోకి వెళతాం. ఈ సర్కిల్లో ఉన్నప్పుడు కళ్లు వేగంగా కదులుతాయి. శ్వాస తీసుకోవటం, రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి. శరీరం అనే అచేతనా స్థితిలోకి వెళుతుంది. ఈ దశలోనే మనం కలలు కంటాం. ఈ రెమ్ సర్కిల్లో మెదడులోని ముఖ్యమైన భాగాలకు రక్త ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మెదడులోని 'కోర్టెక్స్', 'లింబిక్ సిస్టమ్' తీవ్రమైన విద్యుత్ తరంగాలతో చెలరేగుతాయి.

 అయితే, అదే సమయంలో భావోద్వేగాలను నియంత్రించే మెదడు ముందు భాగం స్థిరంగా ఉంటుంది. అంటే, అర్థం లేకుండా మెదడులో జరిగే విషయాలను మెదడు ముందుభాగం నియంత్రించలేదన్నమాట. అందుకే కలల్లో వచ్చే దృశ్యాలు అంతా గందరగోళంగా ఉంటాయి. వాటికి ఒక స్పష్టమైన డిజైన్ ఉండదు కాబట్టి వాటిని గుర్తుంచుకోలేకపోతున్నాం.

'కలల' పరికరం

అయితే, అటువంటి కలల దృశ్యాలు గుర్తుండిపోయేలా చేసేందుకు 'ఆడమ్ హార్ హోరోవిట్జ్ ' అనే శాస్త్రవేత్త 'దారియో' అనే పరికరాన్ని కనిపెట్టాడు. దీన్ని చేతితో పట్టుకుని నిద్రిస్తే చాలు... మనకొచ్చే కలల్ని రికార్డ్ చేస్తుంది. ఇది నిద్రలో ఉన్నప్పుడు మెదడులో కలిగే మార్పులను గుర్తించే బయోసిగ్నల్స్ ను సేకరిస్తుంది. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు, కండరాల బిగువు తగ్గటం, చర్మ వాహకతలో మార్పులు వంటి సంకేతాలన్నమాట. నిద్రలో 'హిప్నాగోగియా' అనే దశను అధ్యయనం చేస్తుంది. 

ఈ దార్మియో పరికరాన్ని స్మార్ట్ ఫోన్ లేదా రోబోకు కనెక్ట్ చేస్తారు. ఈ పరికరాన్ని పట్టుకుని నిద్రిస్తున్న వ్యక్తి గాఢ నిద్రలోకి వెళ్లినపుడు ఆ స్మార్ట్ ఫోన్ లేదా రోబో మాటలు చెప్తూ ఉంటుంది. మాట్లాడినదంతా రికార్డు చేస్తారు. కలల్లో వచ్చే ఉపయోగకరమైన ఆలోచనలను వాళ్లు మరచిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పరికరాన్ని తయారు చేశారు. దీనిని ఇప్పటి వరకూ కొంతమంది మాత్రమే పరీక్షించారు. అయితే ఈ ప్రయోగాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలని, కమర్షియల్ గా కూడా మార్కెట్ లోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు.

ఈ పరికరంతో భవిష్యత్తులో నిద్రను ఉపయోగవంతంగా మార్చుకోవచ్చనీ... కలల్లో వచ్చిన ఐడియాలను అర్థం చేసుకుని రియల్ లైఫ్లో కూడా ఉపయోగించుకోవచ్చని ఆడం హోర్ హోరోవిట్జ్ చెబుతున్నాడు.. అంతేకాకుండా, దీని ద్వారా మెదడు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుందో తెలుసుకుని, యాంగ్జెటీ, డిప్రెషన్ వంటి మానసిక వ్యాధుల నుంచి బయటపడొచ్చని అంటున్నారు.