స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి కళ్లన్నీ దానిమీదే. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ చేతిలోనే ఉంటుంది. ఎన్నిగంటలైనా రెప్ప ఆర్పకుండా ఫోన్ చూస్తుంటారు కొందరు. అయితే, ఇలా చూడడం వల్ల చూపు మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఈ టిప్స్ పాటించాలి.
ఫోన్ చూస్తున్నప్పుడు ఆ హై ఎనర్జీతో ఉన్న విజిబుల్ లైట్ కంటిలోపలికి దూసుకెళ్తుంది. అదేమీ పట్టించుకోకుండా అలానే వాడుతుంటే రెటీనా దెబ్బతింటుంది. కొంతకాలానికి కాటరాక్ట్ చేయించుకోవాల్సి రావచ్చు. అలాగే వయసు సంబంధిత మాక్యులర్ డీజనరేషన్ (ఎఎమ్డి) అంటే చూపు మసకబారడం అనే సమస్య తలెత్తొచ్చు. బ్రైట్ నెస్ తగ్గించాలి. స్క్రీన్ చూడగలిగినంత బ్రైట్ నెస్ మాత్రమే పెట్టుకోవాలి. దానికి బదులు డిమ్‌గా కనిపించేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు కూడా. అప్పుడు కళ్లకు ఇబ్బందిలేకుండా ఉంటుంది.
స్క్రీన్ ఎంత సేపు చూస్తున్నామనేది కూడా ముఖ్యం. ఎక్కువసేపు చూడడం వల్ల కళ్లు అలసిపోతాయి. పొడిబారతాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే 20–20–20 రూల్ పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకి ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా 20 సెకన్లు చూడాలి. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ వల్ల కళ్లకు బ్రేక్ దొరుకుతుంది. అప్పుడు రీ అడ్జస్ట్ అయ్యి రీ ఫోకస్ చేయగలవు. ఈ మధ్య చాలా ఫోన్స్‌లో హ్యాండీ నైట్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్ అనే ఫీచర్స్ వస్తున్నాయి. వాటిని ఎనేబుల్ చేసుకుంటే బ్లూ లైట్ నుంచి తప్పించుకోవచ్చు.
ఇది ముఖ్యంగా సాయంత్రాలు బాగా ఉపయోగపడుతుంది. కళ్లను రెగ్యులర్‌గా ఆర్పుతుండాలి. తక్కువసార్లు కళ్లు ఆర్పడం వల్ల కళ్లు పొడిబారి, దురద పెడతాయి. అందుకని కనురెప్ప వేయాలనే విషయాన్ని గుర్తు ఉంచుకుని మరీ కళ్లు ఆర్పుతుండాలి. ఐ డ్రాప్స్ వాడడం వల్ల కళ్లు తేమతో, ఇబ్బందిలేకుండా ఉంటాయి. గంటల తరబడి ఫోన్ స్క్రోల్ చేయడం మానేయాలి. కళ్లకు బ్రేక్ ఇవ్వాలి. ప్రతి గంటకు ఒకసారి ఫోన్‌కి బ్రేక్ ఇవ్వాలి.