మరికొద్ది రోజుల్లో అందరూ ఇష్టపడే రంగుల పండుగ హోలీ రాబోతోంది. ఈ రంగుల పండుగ రోజు చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా రంగులను చల్లుకుంటారు. ఈ సమయంలో వాటర్ బెలూన్లు, వాటర్ గన్స్ లో మార్కెట్లో దొరికే రంగులను వాడటం వల్ల చాలా మంది చర్మానికి హాని కలుగుతుంది. ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండాలంటే.. మీరు ఇంటి వద్దే దొరికే కొన్ని రకాల మూలికాలతో సహజమైన రంగులను తయారు చేసుకోవాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం
రెడ్ కలర్..
హోలీ పండుగ రోజున చాలా మంది ప్రజలు రెడ్ కలర్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని తయారు చేయడానికి 3 టీ స్పూన్ల కుంకుమ, 1 టీస్పూన్ గంధపు పొడి మరియు 5 టీ స్పూన్ల శనగపిండి తీసుకోండి. వీటన్నింటిని బాగా కలపండి. ఇది బాగా రెడ్ కలర్ వచ్చే వరకూ ఒక మిశ్రమంగా తయారు చేయండి. అనంతరం వచ్చిన సహజమైన రెడ్ కలర్ తో మీరు హోలీ వేడుకలో ఆనందంగా పాల్గొనవచ్చు. మీ కిష్టమైన వారిపై ఈ కలర్ చల్లుతూ ఆనందంగా హోలీ సెలబ్రేషన్స్ జరుపుకోవచ్చు.
ఎల్లో కలర్
ఈ రకమైన రంగును తయారు చేయడం చాలా సులభం. మీ వంటింట్లో దొరికే పసుపును 3 టీ స్పూన్లు తీసుకోండి. దానికి ఒక టీ స్పూన్ గంధపు పొడి మరియు రెండు టీ స్పూన్ల బియ్యపు పిండి తీసుకోండి. వీటన్నింటిని ఒక బౌల్ లో వేసి బాగా కలపండి. అంతే మీకు కావాల్సిన మరో సహజ సిద్ధమైన ఎల్లో కలర్ సిద్ధమవుతుంది. ఇ
గ్రీన్ కలర్..
హోలీ పండుగ సందర్భంగా గ్రీన్ కలర్ తయారు చేసేందుకు టాల్కాం పౌడర్ మరియు ఫుడ్ గ్రేడ్ గీన్ కలర్ తీసుకోండి. ఇది ఏదైనా ఆహారంలో ఉపయోగించే ఫుడ్ గ్రేడ్ గ్రీన్ కలర్ గా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం, ఒక టీ స్పూన్ ఫుడ్ గ్రేడ్ గ్రీన్ కలర్, ఎనిమిది టీ స్పూన్ల టాల్కం పౌడర్ తో కలపండి. ఆ తర్వాత దీన్ని పొడిగా ఉండనివ్వండి. అనంతరం ఒక గంట తర్వాత ఇది ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది.
ఆరెంజ్ కలర్..
ఈ రంగును తయారు చేయడానికి ఇళ్లలో లేదా మార్కెట్లో దొరికే సింధూరాన్ని ఒక టీ స్పూన్, 5 టీ స్పూన్ల గంధపు పొడిని తీసుకోండి. అలాగే మార్కెట్లో దొరికే ఎండిన కుంకుమ పువ్వు లేదా హనుమంతునికి సమర్పించే సింధూరాన్ని ఉపయోగించొచ్చు. వీటన్నింటినీ ఒక బౌల్ లో వేసి బాగా కలపాలి. హోలీ పండుగ సమయంలో దీని వల్ల చర్మానికి ఎలాంటి హాని ఉండదు.
పింక్ కలర్..
ఈ రకమైన రంగు హోలీ పండుగ సమయంలో ఎక్కువగా చల్లుకుంటారు. దీనిని తయారు చేయడానికి వంటింట్లో లేదా మార్కెట్లో దొరికే బీట్ రూట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని తయారీ కోసం ముందుగా బీట్ రూట్ ను ఎండబెట్టాలి. బీట్ రూట్ బాగా ఆరిపోయినప్పుడు, దానిలోకి రెండు టీ స్పూన్ల శనగపిండి కలపాలి. మీకు డార్క్ పింక్ కలర్ కావాలంటే.. మీరు ఫుడ్ గ్రేడ్ పింక్ కలర్ ను కూడా కలపొచ్చు. ఇలా సహజ సిద్ధమైన రంగులు, మూలికలతో హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి చర్మ సమస్యలు అనేవి రావు. హ్యాపీగా హోలీ ఆడుకోవాలి, పండగ సంతోషంగా సాగాలంటే జాగ్రత్తలు తప్పనిసరి అని మాత్రం గుర్తుంచుకోవాలి.