Good Food : కూరగాయలతో గారెలు.. ఇలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు..!

కూర 'గారె'లు

వింటే భారతం వినాలి... తింటే గారెలే తినాలంటారు. అవును మరి.. గారెలకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది. అయితే రొటీన్ గా చేసుకునే శెనగ పప్పు, మినప్పప్పు గారెలు కాకుండా... గారెల పిండిలో కూరగాయలను కలిపితే కొత్త రుచి మీ సొంతం.

బీట్రూట్తో.. 

కావాల్సినవి: బీట్రూట్ తురుము - ఒక కప్పు, ఉల్లిగడ్డ తరుగు - అర కప్పు, శెనగపప్పు - అరకప్పు, నూనె- సరిపడా ఎండు మిర్చి  ఏడు, సోంపు - అర టీ స్పూన్, జీలకర్ర - అర టీ స్పూన్, ఉప్పు -తగినంత

తయారీ: శెనగపప్పును నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత నానబెట్టిన శెనగ పప్పు, ఎండుమిర్చి, సోంపు, జీలకర్ర, ఉప్పులను మిక్సీ జార్లో వేసి... మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని, అందులో ఉల్లిగడ్డ తరుగు, బీట్రూట్ తురుము వేసి కలపాలి. స్టవ్పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. పిండిని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుని గారెల్లా ఒత్తి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. లేదంటే పెనంపై కొద్దిగా నూనె వేసి రెండువైపులా కాల్చాలి. వీటిని సాయంత్రం పూట... పిల్లలకు స్నాక్స్ ఇస్తే ఇష్టంగా తింటారు.


బీరకాయతో..

కావాల్సినవి: బీరకాయ తరుగు (చెక్కు తీసి) -ఒక కప్పు, మినప్పప్పు - ఒక కప్పు, ఎండు మిర్చి- రెండు, ఉప్పు - తగినంత, కరివేపాకు - ఒక రెమ్మ, జీలకర్ర - అర టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు -ఒక్కోటి అరటీ స్పూన్ చొప్పున,నూనె - సరిపడా. 

తయారీ: మినప్పప్పును నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత నానబెట్టిన మినప్పప్పు, ఎండు మిర్చి, ఉప్పులను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని, అందులో కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, బీరకాయ తరుగు వేసి కలపాలి. నూనె వేడి చేయాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుని గారెల్లా ఒత్తి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. వీటిని కొబ్బరి చట్నీ లేదా టొమాటో సాస్తో నంజుకుంటే రుచి అదిరిపోతుంది.


సొరకాయతో..

కావాల్సినవి : సొరకాయ తురుము(చెక్కు తీసి) - ఒక కప్పు, బియ్యప్పిండి - ఒక కప్పు, ఉల్లిగడ్డ తరుగు - ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్, అల్లం తరుగు - ఒక టీ స్పూన్, జీలకర్ర - ముప్పావు టీ స్పూన్, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్పు - తగినంత, పసుపు-చిటికెడు,నూనె - సరిపడా

తయారీ

ఒక పెద్ద గిన్నెలో బియ్యప్పిండి, సొరకాయ తురుము, ఉల్లిగడ్డ తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, పసుపు వేయాలి. నీళ్లు పోయకుండా... సొరకాయ తడితోనే పిండి మెత్తగా కలపాలి. మరీ పొడిగా అనిపిస్తే, కొన్ని నీళ్ల చుక్కలను చల్లుకోవచ్చు. ఒక ప్లాస్టిక్ కవర్ మీద నూనె రాసి, పిండిని కొద్దికొద్దిగా తీసుకుని గారెల్లా ఒత్తాలి. కావాలంటే వాటికి మధ్యమధ్యలో రంధ్రాలు పెట్టి కాగే నూనెలో డీప్ ఫ్రై చేయాలి. వీటిని కొబ్బరి లేదా పుదీనా చట్నీలో నంజుకుని తింటే, ఆహా అనాల్సిందే.