సంక్రాంతి పిండి వంటలు : అరిసెలు, సకినాలు ఎలా తయారు చేస్తారు

ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే సంక్రాంతి పండుగ అంటే అందరికీ ఇష్టమే. ఊళ్లలో అయితే వారం రోజుల ముందు నుంచే పిండి వంటలతో పండుగ మొదలవుతుంది. ఒకప్పుడు పది రకాల వంటలు చేసుకుంటే.. ఇప్పుడు మూడు, నాలుగు వంటలతో సరిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే గంటలు, రోజుల తరబడి పొయ్యి ముందు కూర్చునే తీరిక, ఓపిక ఎవ్వరికీ ఉండట్లేదు. అందుకే పిండి వంటల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. కానీ ప్రతి ఇంట్లో కచ్చితంగా చేసుకునే వంటలు కొన్ని ఉంటాయి. అవే ఇవి. 

నువ్వుల లడ్డు..

కావాల్సినవి: 

  • బెల్లం తురుము - ఒక కప్పు, 
  • నువ్వులు - ఒక కప్పు 

తయారీ: నువ్వులను ఇసుక లేకుండా శుభ్రంగా జల్లెడ పట్టి, స్టవ్ పై దోరగా వేగించాలి. ఒక పెద్ద గిన్నెలో బెల్లం తురుము, సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. తీగ పాకం వచ్చాక నువ్వులను అందులో వేసి కలపాలి. తర్వాత చేతులను తడుపుకుంటూ... మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని ఉండలు కట్టాలి. ఈ నువ్వుల లడ్డూలను రెండు గంటల పాటు ఆరబెట్టాలి. ఆపైన గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే, చాలారోజులు తాజాగా ఉంటాయి. 

సకినాలు..

కావాల్సినవి: 

  • బియ్యం- రెండు కప్పులు, 
  • నువ్వులు - పావుకప్పు, 
  • వాము- రెండు టీ స్పూన్లు, 
  • నూనె - సరిపడా, 
  • ఉప్పు - తగినంత 

తయారీ: 
బియ్యాన్ని బాగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత ఆ బియ్యాన్ని మిక్సీ లేదా గ్రైండర్ రుబ్బాలి. ఆ టైమ్ లో కొన్ని నీళ్లు చిలకరించాలి. అయితే పిండి మరీ గట్టిగా, మరీ పలుచగా లేకుండా చూడాలి. తర్వాత ఒక మెత్తటి క్లాత్ను పరిచి, పిండితో గుండ్రంగా మెలితిప్పుతూ మూడు, నాలుగు చుట్లు చుట్టాలి. వాటి తడి పూర్తిగా ఆరాక నూనెలో వేగించాలి. తెలంగాణలోనే ప్రత్యేకంగా చేసుకునే పిండివంట ఈ సకినాలు. 

అరిసెలు..

కావాల్సినవి: 

  • బియ్యం- నాలుగు కప్పులు, 
  • నువ్వులు- ఒక టేబుల్ స్పూన్, 
  • బెల్లం తురుము - మూడు కప్పులు, 
  • నూనె లేదా నెయ్యి - సరిపడా 

తయారీ: బియ్యాన్ని ఒకరోజు ముందే నానబెట్టాలి. తర్వాత వాటిని కొద్దిసేపు ఆరబెట్టి పిండి పట్టించి, జల్లెడ పట్టాలి. స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నెలో బెల్లం, సరిపడా నీళ్లు పోసి తీగ పాకం పట్టాలి. అందులో బియ్యప్పిండి వేసి బాగా కలిపి దింపేయలి. మరో గిన్నెలో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. పిండిలో నువ్వులు వేసి చిన్నచిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండను కొంచెం వెడల్పుగా వత్తి నూనె లేదా నెయ్యిలో ఎరుపు రంగు వచ్చేదాక వేగించాలి. అంతే, అందరూ ఇష్టపడే అరిసెలు రెడీ.