సంక్రాంతికి చేసుకునే పిండి వంటలు ప్రాంతాల్ని బట్టి మారతాయి. అయినాగానీ సకినాలు, మురుకులు, అరిసెలు, నువ్వుల ఉండలు వంటివి కామన్. ఈ సీజన్లో ఇవి తింటే హెల్దీ కూడా. ఈ సంక్రాంతి స్పెషల్ రెసిపీలు మీకోసం.
సకినాలు..
కావాల్సినవి:
- నా పాత బియ్యం - ఒక కేజీ,
- నువ్వులు - 60 గ్రాములు
- వాము - ఒకటిన్నర టేబుల్ స్పూన్,
- ఉప్పు - తగినంత
- జీలకర్ర - ఒక టీ స్పూన్
తయారీ : బియ్యాన్ని ముందురోజు రాత్రి కడిగి నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం వడకట్టి పదినిమిషాలు ఆరబెట్టాలి. ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో మెత్తగా పట్టాలి. తర్వాత జల్లించాలి. ఈ మెత్తని పొడిలో నువ్వులు, వాము, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. అందులో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ సకినాలు చేసుకునేలా ముద్ద చేయాలి. ఈ ముద్దను పదినిమిషాలు నాననివ్వాలి. తర్వాత కొంచెం పిండి తీసుకుని నీళ్లు తడుపుకుంటూ సకినాలు చేయాలి. మరీ లావుగా కాకుండా సన్నగా చేయాలి. బాగా కాగిన నూనెలో వీటిని వేగించాలి. రంగు మారక ముందే నూనెలోంచి తీస్తే సకినాలు క్రిస్పీగా ఉంటాయి.
సున్నుండలు..
కావాల్సినవి:
- మినప్పప్పు - పావు కేజీ
- బెల్లం తురుము - పావుకేజీ
- నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్స్
- ఇలాచి పొడి – అర టీ స్పూన్
తయారీ : ఒక పాన్ లో మినప్పప్పు వేసి ఐదు నిమిషాలు దోరగా వేగించాలి. ఇవి వేగాక వేరే గిన్నెలోకి తీసుకుని అదే పాన్ 4 లో నెయ్యివేసి మరిగించాలి. తర్వాత మినుములను మెత్తగా పిండిచేయాలి. బెల్లం తురుమును కూడా ఒకసారి మిక్సీజార్లో వేసి తిప్పాలి. మినప్పిండి, బెల్లం, ఇలాచి పొడి అన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ చిన్న చిన్న ఉండలు చేసుకుంటే ఘుమఘుమలాడే సున్నుండలు రెడీ. కావాలనుకుంటే బియ్యాన్ని వేగించి, పొడి చేసి కూడా ఈ పిండిలో కలిపినా సున్నుండలు టేస్టీగా ఉంటాయి.
నువ్వుల ఉండలు..
కావాల్సినవి:
- నువ్వులు - ఒక కప్పు
- బెల్లం తురుము - ఒక కప్పు
- నెయ్యి - రెండు టీ స్పూన్లు
- ఇలాచి పొడి - ఒక టీ స్పూన్
తయారీ:
స్టవ్ పై పాన్ పెట్టి నువ్వులు వేగించాలి. నువ్వులు వేగాక వాటిని వేరే గిన్నెలోకి తీయాలి. అదే గిన్నెలో నెయ్యి, తరిగిన బెల్లం వేసి తక్కువ మంటపై కరిగించాలి. మరో వైపు ఒక గిన్నెకు నెయ్యి రాసి పక్కనపెట్టాలి. కరుగుతున్న బెల్లంలో ఇలాచి పొడి వేసి కలపాలి. బెల్లం కరిగాక వేగించిన నువ్వులు కూడా వేసి బాగా కలపాలి. నువ్వులు, బెల్లం కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన గిన్నెలో వేయాలి. తర్వాత కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకుని ఉండలు చేస్తే యమ్మీ యమ్మీ నువ్వుల ఉండలు రెడీ.