కిచెన్ తెలంగాణ : రుచికరమైన కొర్ర ఊతప్పం ఇలా చేసుకోండి

మార్నింగ్​ బ్రేక్​ ఫాస్ట్​ ఇంట్రెస్టింగ్​గా లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్​ ఉంటుంది చాలామందికి. ఎప్పుడూ అదే బోరింగ్ ఫుడ్​ అని నసుగుతూనే తింటుంటారు కొందరు. ఇంకొందరేమో టేస్ట్​ ఒక్కటే చూసుకుంటే ఎలా? తినే ఫుడ్​ హెల్దీగా కూడా ఉండాలి అంటారు. ఇలా పొద్దున తినే ఫుడ్​ గురించి రకరకాల అభిరుచులు ఉంటాయి. అందరికీ నచ్చేలా.. ఆరోగ్యాన్నిచ్చేలా బ్రేక్​ ఫాస్ట్ తయారుచేయాలంటే ఈ రెసిపీలు ఫాలో అయిపోండి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ నచ్చేస్తాయి. ఆరోగ్యాన్నీ ఇస్తాయి. 

కొర్ర ఊతప్పం

కావాల్సినవి :

కొర్రలు (ఫాక్స్ టెయిల్ మిల్లెట్) – రెండున్నర కప్పులు
మినప్పప్పు – ఒక కప్పు
ఉప్పు, నూనె – సరిపడా
టొమాటో, ఉల్లిగడ్డ, క్యారెట్ – ఒక్కోటి చొప్పున 
కొత్తిమీర తరుగు – కొంచెం
పచ్చిమిర్చి – రెండు

తయారీ : కొర్రల్ని శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. అలాగే మినప్పప్పును కూడా మరో గిన్నెలో వేసి, నీళ్లు పోసి నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమంపై మూతపెట్టి ఆరుగంటలపాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత అందులో ఉప్పు వేసి కలపాలి. ఆపై పాన్​ వేడి చేసి దోశలా పోయాలి. లేదా దోశ పోశాక దానిపై టొమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్​, కొత్తిమీర తరుగు చల్లాలి. లేదంటే దోశ పోయడానికి రెడీ చేసుకున్న మిశ్రమంలో కలిపి, తర్వాత దోశ వేసుకోవచ్చు. మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. చుట్టూ నూనె వేసి, మెల్లిగా ఊతప్పంను తిరగేసి, రెండో వైపు కూడా కాల్చాలి. కలర్​ఫుల్​గా కనిపించే ఈ ఊతప్పం.. హెల్దీ బ్రేక్ ఫాస్ట్​.