కూరగాయలను ఎలా శుభ్రం చేయాలి.. ఎలా ఉడికించాలో తెలుసా.. 

మార్కెట్​ కు వెళ్తే చాలు.. కుళ్లు కంపు.. భరించలేని దుర్గంధం.. అయినా సరే ఏం చేస్తాం.. కూరగాయలను తెచ్చుకుని వండుకొని తినాలి కదా.. ఓ పక్క ఈగలు, దోమలు, కల్తీ రసాయనాలు.. ఇలా అన్ని కలిసి కూరగాయలను కల్తీ చేస్తూ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.  దీంతో అనేక వ్యాధులు రావడం.. అస్వస్థతకు గురికావడం వంటివి చాలా చోట్ల జరుగుతుందని  WHO ఓ నివేదిక వెల్లడించింది. 

పండ్లు, కూరగాయలు, మాంసం.. ఇవి కేవలం మనిషి మాత్రమే తినేవి కాదు. ఏ జీవి మనుగడకైనా అవే ఆధారం. వాటిని జంతువులూ తింటాయి. వాటి మీద ఉండే సూక్ష్మ జీవులూ ఎంగిలి పడతాయి. వాటి మీద బ్యాక్టీరియా, వైరస్, రసాయనాలున్నా కూడా తెలియకుండానే మనుషులు తింటున్నారు. అందుకే కోట్లాదిమంది ఫుడ్​ పాయిజనింగ్ (ఫుడ్​ బోర్న్) వ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది

ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితం కూడా సంతోషంగా సాగిపోతుంది. పోషకాలు ఉన్న ఆహారం అందినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. పోషకాహారలోపంతో ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఏటా 55 కోట్ల మంది కలుషిత ఆహారం తిని ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. వాళ్లలో 2.3లక్షల మంది చనిపోతున్నారని(WHO ) డబ్ల్యూహెచ్ వో ఓ నివేదిక విడుదల చేసింది. శుభ్రం చెయ్యకుండా తినే దానిలో హాని కలిగించే బ్యాక్టీరియా, వైరస్, రసాయనాలు ఉంటాయి. వీటి వల్ల డయేరియా (విరేచనాలు) నుంచి క్యాన్సర్ వరకు రెండువందలకు పైగా వ్యాధులు వస్తున్నాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో నలభైశాతం మంది ఈ 'ఫుడ్ బోర్న్' వ్యాధుల బారిన పడుతున్నారు. వీళ్లలో ఏటా దాదాపు లక్షా 25 వేల మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ వో చెప్పింది.

బ్యాక్టీరియా..

ఆహారంలో ఉండే విషపూరితమైన బ్యాక్టీరియా వల్ల సాల్మొనెల్లా, కాప్యూలోబ్యాక్టర్,  ఏంట్రోమొరాజిక్, లిస్టేరియా ఇన్ ఫెక్షన్  వంటి వ్యాధులు వస్తున్నాయి. జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, పొత్తికడుపులో నొప్పి, డయేరియా సాల్మొనెల్లా లక్షణాలు. గుడ్లు, చేపలు, పౌల్ట్రీ సంబంధిత ఆహారాన్ని సరిగ్గా ఉడికించకుండా తిన్నప్పుడు సాల్మొనెల్లా  వస్తుంది. 

పచ్చిపాలు, కలుషితమైన నీళ్లు తాగినప్పుడు, సరిగ్గా ఉడికించని మాంసం తిన్నప్పుడు కాప్యూలోబ్యాక్టర్  వస్తుంది. 
పాశ్చరైజేషన్ చెయ్యని పాల ఉత్పత్తులు, సరిగ్గా ఉడికించని, కడగని మాంసం, కూరగాయలు, పండ్లు తిన్నప్పుడు ఏంట్రోమొరాజిక్ వస్తుంది.
 గర్భిణులు పాశ్చరైజేషన్ చెయ్యని పాలఉత్పత్తులు, ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని తిన్నప్పుడు లిస్టీరియా ఇన్ ఫెక్షన్ వస్తుంది. ఇది సడెన్ అబార్షనికి దారి తీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్తో తల్లీబిడ్డలు చనిపోయే అవకాశం కూడా ఉంది. 
బ్యాక్టీరియా కలిసిన నీళ్లు తాగినప్పుడు, కలుషితమైన బియ్యం, తృణధాన్యాలు తిన్నప్పుడు కలరా వస్తుంది. పొత్తికడుపులో నొప్పి, వాంతులు, డయేరియా, తీవ్రమైన డీ హైడ్రేషన్ కలరా లక్షణాలు.

వైరస్, రసాయనాలు

తినేదానిలో కేవలం బ్యాక్టీరియానే కాదు.. వైరస్ కూడా ఉంటాయి. నీళ్లు, ఆహారంలో వైరస్ ఉన్నప్పుడు వాంతులు అవుతాయి. డయేరియా, పొత్తికడుపులో నొప్పి ఉంటుంది. అందులో హెపటైటిస్ ఏ వైరస్ ఉంటే అది కాలేయ వ్యాధులకు దారి తీసి ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని WHO నివేదికలో తెలిపింది. సరిగ్గా ఉడికించని మాంసాహారం, కడగని వచ్చి కూరగాయలు, పండ్లు తిన్నప్పుడు ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ధాన్యాలు, పండ్లు కూరగాయలపై ఫ్యాక్టరీలు, వాహనాల నుంచి నుంచి వెలువడే రసాయనాలు... పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే డై ఆక్సిన్స్, పాలీక్లోరినేటేడ్ బిపినల్స్  చాలా ప్రమాదకరం. విషపూరితమైన డైఆక్సిన్స్ శరీర ఎదుగుదలను అడ్డుకుంటాయి. రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఆహారంలో చేరే కాడ్మియం, మెర్కురీ లోహలునరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఈ లోహలు ప్రధానంగా గాలి, నీరు, భూమి కాలుష్యాల వల్ల ఆహారంలో కలుస్తున్నాయి

ఇక్కడే అసలు సమస్య

గ్లోబల్ ఫుడ్ డిమాండ్ పెరుగుతోంది. ఒక దేశం నుంచి మరో దేశానికి ఫుడ్ ప్రొడక్టులు రవాణా కావడం సాధారణమైంది. ఉత్పత్తి దగ్గర నుంచి తినేవాళ్లకు చేరేవరకు ఎక్కడైనా కాలుష్యం కావొచ్చు. కాబట్టి ఉత్పత్తిదారుల నుంచి దాన్ని ప్యాక్ చేసి.. తరలించేవాళ్లు అంతా ఫుడ్ సేఫ్టీకి కట్టుబడి పని చేస్తేనే మార్కెట్ వరకు అది శుభ్రంగా చేరుతుంది. అయితే,  చైనా ఫుడ్ మార్కెట్ వరకు చేరే వరకు అవుతున్న కాలుష్యం ఒకెత్తు. మార్కెట్ నుంచి ఇంటికి, అక్కడి నుంచి శరీరానికి చేరేక్రమంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అవుతున్న కాలుష్యం మరొక ఎత్తని డబ్యూహెచ్ వో అంటోంది. మాంసం, కూరగాయలు, పండ్లు సరిగ్గా కడగకపోవడం, ఉడికించకపోవడం, కనీసం చేతులు కూడా కడుక్కోకుండా తినడం(ముఖ్యంగా చిన్న పిల్లలు), దేన్ని ఎలా వండాలో తెలియకుండానే వండటం, రెస్టారెంట్ దగ్గర, లోకల్ మార్కెట్ దగ్గర జాగ్రత్తగా వ్యవహరించకపోవడం, నిల్వ చేసిన, పాడైన ఆహారాన్ని తినడం వల్ల వ్యాధులు వస్తున్నాయి.

ఇలా చెయ్యాలి..

శుభ్రంగా కడగటం, సరిగ్గా ఉడికించడం వల్ల తినేదాంట్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్, రసాయనాలన్ని తొలగిపోతాయి. కొనేటప్పుడు, అమ్మేటప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పని చెయ్యాలి. ప్రభుత్వాలు బార్డర్ పాలసీలు తీసుకురావాలి. ఫుడ్ ప్రొడక్టులు సేఫ్ గా ఉంచడానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా ఆహారాన్ని శుభ్రంగా కడిగి, ఉడికించి తినాలి అని డబ్ల్యూహెచ్ వో సూచించింది..