Health Alert : ఆఫీసులో శుభ్రంగా ఎలా ఉండాలి.. ఎలాంటి జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు..!

ఇంట్లో శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు చాలామంది. అది తుడిచావా? ఇది కడిగావా? అని హైరానా చేస్తుంటారు. కానీ ఆఫీసులో మాత్రం ఇలాంటివేవీ పట్టించుకోరు. శుభ్రం సంగతే మర్చిపోతారు. నిజానికి ఉద్యోగాలు చేసేవాళ్లు ఇంట్లో కంటే ఆఫీసులోనే ఎక్కువ టైమ్ ఉంటారు. అక్కడున్న క్రిములే వాళ్లకు వచ్చే ఎన్నో వ్యాధులకు కారణమవుతాయి. అసలు అవి ఎక్కడెక్కడ ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. 

కీబోర్డు, మౌస్ 

ఇప్పుడు ప్రతిచోటా కంప్యూటర్లే. ఏ పని చేయా లన్నా దానిమీదే. అవునా? అయితే రోజులో కంప్యూటర్ కీబోర్డ్, మౌస్ లను ఎన్నిసార్లు పట్టుకుంటారో చెప్పండి చూద్దాం? అలా చెప్పడం కష్టం కదా, ఎందుకంటే ఆఫీసులో ఉన్నంతసేపు దానిమీదే ఉంటాయి చేతులు. అప్పుడు దాని మీద ఉన్న క్రిములు చేతుల ద్వారా ముక్కు, చెవులు, నోట్లోకి వెళ్తాయి. తరచూ ఆరోగ్య సమస్యలు రావడానికి ఇది కూడా కారణమే. అందుకే పని మధ్యలో చేతులను హ్యాండ్ శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. సీట్ దగ్గర ఏదైనా తినేటప్పుడు కచ్చితంగా చేతులు కడుక్కోవాలి. అలాగే ఎప్పటికప్పుడు కీబోర్డ్, మౌజ్లను శుభ్రం చేయించుకోవాలి. అలా చేయలేనప్పుడు, కనీసం ఎవరికి వాళ్లు తమ కంప్యూటర్ కీబోర్డు, మౌజ్ లను 'డిస్ఇన్ఫెక్టివ్ వైప్స్ 'తో తుడుచుకోవడం మేలు.

ఎలివేటర్ బటన్స్ – ఎస్కలేటర్ (స్టెయిర్స్ రెయిలింగ్)

ఏ ఆఫీసులో అయినా ఉద్యోగుల సంఖ్య వంద, వేలల్లోనే ఉంటుంది. మరి అందరూ రోజూ లిఫ్ట్, మెట్లను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఆ సమయంలో లిఫ్ట్ బటన్లను, మెట్లు ఎక్కేట ప్పుడు రెయిలింగ్ పట్టుకుంటారు. దానివల్ల బ్యాక్టీరియా, క్రిములు వాటిమీద చేరతాయి. కాబట్టి వాటిని ఉపయోగించిన వెంటనే చేతులను హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. 

ఆఫీస్ వాష్ రూమ్ డోర్లు 

ఆఫీసులోని క్యాబిన్, వాష్ రూముల తలుపులకు ఉండే హ్యాండిళ్ల దగ్గర బ్యాక్టీరి యా, క్రిములు ఎక్కువగా ఉంటాయి. వాటిని చాలామంది చాలాసార్లు ఉపయోగిస్తారు. కానీ రోజూ శుభ్రం మాత్రం చేయరు. అలాగని వాటిని తగలకుండా ఆఫీసులో పని చేయడం కుదరదు. అందుకే వాటిని ఉపయోగించిన ప్రతిసారీ చేతులను శుభ్రం చేసుకోవాలి.

వాటర్ ట్యాప్ లు - హ్యాండ్ వాషర్లు

చేతులు శుభ్రం చేసుకోవడానికి నల్లాలు (ట్యాప్), హ్యాండ్ వాషర్లు ఉపయోగిస్తారు. కానీ అవి కూడా రోగాలను తెచ్చిపెడతాయని తెలుసా? అదెలాగంటారా? శుభ్రం చేయడానికి పనికొచ్చే వాటిని ట్యాప్ లు, హ్యాండ్ వాషర్లను శుభ్రం చేసేదెవరు? అందుకే ముందుగా నల్లాలు, హ్యాండ్ వాషర్లను కడిగాక చేతులు కడుక్కోవడం మంచిది.

ఆఫీసులో గాలి

అదేంటి? గాలి కూడా పీల్చుకోవద్దా? అని కంగారు పడకండి. నాలుగు గోడల మధ్య పీల్చు కునే గాలిలో బ్యాక్టీరియా, ఎన్నోరకాల క్రిములు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేని ఉద్యోగులు తుమ్మినా, దగ్గినా... వైరస్ కి సంబంధించిన తుంపర్లు గాల్లో కలుస్తాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు ముక్కు, నోటికి అడ్డుగా కర్చీఫ్ పెట్టుకోవాలి. అలాగే సహోద్యోగులు కూడా అలాంటి వాళ్లు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకునేలా చేయాలి. అంటే వాళ్ల పని భారాన్ని పంచుకోవాలి.

ALSO READ :- WPL 2024: RCB జట్టుపై విజయ్ మాల్యా ప్రశంసలు.. ట్రోల్స్ ఇలా వస్తున్నాయేంటి