Finance Tips : అప్పులు చేయకుండా.. ఖర్చులను ఎలా బ్యాలెన్స్ చేయాలంటే..!

రాబడికి, ఖర్చుకు మధ్య సరైన ప్లాన్ లేకపోతే ఎవరైనా ఎలా అప్పుచేయాల్సిందే. సరైన ప్రణాళిక లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఎలా ఆలోచించాలి? రాకుండా ఎలా జాగ్రత్తపడాలి? అందుకోసం ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి?

కొందరు అనవసరమైన ఖర్చులు పెడతారు. మరికొందరు పిసినారులుగా ఉంటారు. అవసరాలు పెరుగుతున్నా అదనపు సంపాదన గురించి ఆలోచించరు ఇంకొందరు. అప్పులతో జల్సా చేసే వాళ్లూ ఉంటారు. ఎలాంటి వాళ్లనైనా ఆర్థిక సమస్యలు కుంగదీస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటారు. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే... 

అవసరం.. ఆలోచన

ఒక్కోసారి డబ్బు అవసరం పీకల మీదకు వస్తుంది. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడం, అప్పు కట్టాల్సి రావడం, అనుకున్న సమయానికి డబ్బు అందకపోవడం... లాంటి అత్యవసర సమయాల్లో ఏం చేయాలో తోచదు. చికాకు, కోపం, బీపీ లాంటివి వస్తాయి. ఇంట్లో బంగారం ఉంటే కొందరు కుదువ పెడతారు. లేకపోతే అప్పటికప్పుడు అప్పు ఇచ్చే వాళ్లు ఎవరా అని ఆలోచిస్తారు. స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేస్తారు. కానీ, అప్పటికే కొందరి దగ్గర అప్పు చేసి ఉండొచ్చు. మరికొందరు ఇవ్వని వాళ్లు ఉండొచ్చు. అలాంటప్పుడు మనసుకు కొంత ప్రశాంతత ఇవ్వాలి. రిలాక్స్ అయ్యాక కలం, కాగితం తీసుకుని పరిచయం ఉన్న వాళ్లలో ఎవరెవరు ఆదుకుంటారో లిస్ట్ తయారు చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఫోన్ చేసి తమకు డబ్బు ఎంత అవసరమో చెప్పి.. సహాయం చేయమని అడగాలి. ఒకవేళ పెద్ద మొత్తంలో అయితే ఒక్కరే ఇవ్వలేక పోవచ్చు. అలాంటప్పుడు ముగ్గురు లేదా నలుగురి దగ్గర కొద్దికొద్దిగా తీసుకోవాలి. అప్పుడు తేలిగ్గా కావాల్సిన డబ్బు మొత్తం చేతికందే అవకాశం ఉంటుంది.

రాబడి

ఎంత సంపాదిస్తున్నారు అనేదానికంటే.. ఆ డబ్బును ఎందుకు ఖర్చుపెడుతున్నారు. ఎలా ఖర్చు పెడుతున్నారో గమనించాలి. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టే అలవాటుంటే ఆర్థిక సమస్యలు తప్పవు. ఒకవేళ సంపాదనకు మించి ఖర్చు అవుతుంటే, సంపాదన పెంచుకోవడానికి వేరే మార్గాలు ఆలోచించాలి. చేస్తున్న ఉద్యోగంలో జీతం తక్కువగా ఉంటే మరో ఉద్యోగానికి మారడం. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో వ్యాపారం చేయడం. టాలెంట్ ఏదైనా ఉంటే దాని ద్వారా డబ్బు సంపాదించడం.. లాంటివి చేయొచ్చు.

అలాగే, డబ్బు ఖర్చు పెట్టడంలో లేదా సంపాదించడంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలి. తెలిసిన వాళ్లకు అప్పులిచ్చి లేదా వాళ్ల అవసరాలకు ఆదుకుని ఆర్థికంగా నష్టపోయి ఉంటే వాటి నుంచి కూడా వీలైనంత వరకు బయటపడాలి. చదువుకుంటున్నప్పుడు, పెళ్లైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత... ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్త్రీ, పురుషుల జీవితాల్లో డబ్బు అవసరం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు రాబడిని పెంచుకునే మార్గాలను వెతుకుతూ, సంపాదనను పెంచుకోవాలి.

కార్డులు.. ఖర్చు

ఈ రోజుల్లో ఎక్కువమంది దగ్గర క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉంటున్నాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారు. కానీ వీటి ద్వారా లావాదేవీలు జరిపేటప్పుడు ముందు వెనుక ఆలోచించాలి. క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్లు ఉంటాయి. పాయింట్లు వస్తాయి. అలాగే, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా వాడితే అప్పుల పాలు కాక తప్పదు. ఆయా బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించడానికి ఆఫర్లు పెడుతుంటాయి. ఆఫర్లు ఉన్నాయి కదా, అని వినియోగించుకోవడం కంటే, అవి మనకు ఉపయోగపడతాయా, లేదా? అని ఆలోచించాలి.

అలాగే క్రెడిట్ కార్డు వాడుకున్న తర్వాత టైంకు చెల్లించక పోతే వడ్డీ ఎక్కువ కట్టాల్సి రావచ్చు. అందుకే నిర్దేశించిన సమయానికి క్రెడిట్ కార్డులో వాడుకున్న డబ్బులు కట్టగలమా లేదా? అని ఆలోచించి ఖర్చు చేయాలి. అలాగే, ప్రతి రెండు వారాలకోసారి కార్డుల ద్వారా ఎంత ఖర్చు పెట్టారో, ఎంత మిగిలి ఉందో..? చెక్ చేసుకుంటూ ఉండాలి. క్రెడిట్, డెబిట్ కార్డులు వాడేవాళ్లు షాపింగ్ కోసం మామూలు కంటే 15 శాతం ఎక్కువ ఖర్చు పెడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి.

అప్పు.. ముప్పు

కొందరికి అప్పులు చేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఎంత జీతం వచ్చినా నెల చివర వచ్చేసరికి అప్పు చేయకుండా ఉండలేరు. ఇలాంటి వాళ్లు నెల మొదటి రెండు వారాల్లోనే జీతం మొత్తం ఖర్చు పెట్టేస్తారు. షాపింగ్లు, పార్టీలు, సినిమాలు.. లాంటి వాటికి వాడేస్తారు. తీరా నెల చివరి వారంలో చేతిలో చిల్లిగవ్వ ఉండదు. దాంతో, అప్పు కోసం స్నేహితులను అడుగుతుంటారు. అత్యవసర సమయాల్లో అప్పు చేయడం ఎవరికైనా తప్పదు. కానీ, ఒక్కోసారి అనుకున్న టైంకు అప్పు తిరిగి ఇవ్వలేకపోవచ్చు, వడ్డీ పెరగొచ్చు.

అందుకే, వీలైనంత వరకు అవసరాలు, ఖర్చులు గమనించి ఖర్చు పెట్టాలి. అప్పు చేయకుండా నెల మొత్తం నెట్టుకు రావాలి. వ్యాపారస్తులు కూడా తమ ఆదాయం ఎంత, ఎప్పుడు ఎంత వస్తుంది. డబ్బు ఏ సమయానికి చేతికి అందుతుంది? లాంటి వాటిని గమనించి ఖర్చు చేసుకుంటే అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడదు. అప్పు కొద్దిగా అయినా, ఎక్కువైనా ముప్పే. కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోయి మానసికంగా బాధపడుతుంటారు. చివరకు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అందుకే అప్పు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ప్రవర్తనను మార్చుకోవాలి.

ప్రణాళిక

ఏ నెలకు ఆ నెల ఎంత ఖర్చు పెట్టారో చూసుకుని, తర్వాతి నెలలో ఖర్చు తగ్గించుకునేలా ప్లాన్ చేసుకోవాలి. కరెంట్, ఫోన్ బిల్లులు, నెలవారీ సరుకులు లాంటి వాటికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకుని వీలైతే తగ్గించుకోవాలి. చాలామంది నెల నెలకు ఇంటి బడ్జెట్ పెంచుకుంటూ పోతుంటారు. కానీ దానికి తగ్గట్టు ఆదాయం పెరగదు. దాంతో అప్పులు చేస్తుంటారు. అలాగే ఒక్కోసారి అనుకోని ఖర్చులు ఎదురుకావచ్చు. బంధువులు, స్నేహితులు రావచ్చు. లేదా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాంటప్పుడు వేసుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ వేసుకున్న ప్లానింగ్కు అనుకూలంగా ఖర్చులు ఉండవు. అందుకే అత్యవసర సమయాల్లో వాడుకోవడానికి కొంత డబ్బును పక్కన పెట్టుకోవాలి.