మిస్టరీ : ఈ ట్రైన్ ఏనాటిది?

బర్ముడా ట్రయాంగిల్ ప్రపంచంలోనే ఎంతో రహస్యమైన ప్రదేశంగా చెప్తుంటారు. ఆ ప్రాంతం నుంచి వెళ్లిన ఓడలు కొన్ని హఠాత్తుగా మాయమయ్యాయని కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాగే ఇటలీలో ఒక సొరంగంలోకి వెళ్లిన జెనెట్టి రైలు అందులో నుంచి బయటికి రాలేదు.అందులో ఉన్న 104 మంది ప్రయాణికుల్లో 102 మంది అదృశ్యమయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు... జెనెట్టి రైలు అదృశ్యం గురించి చెప్పారు. ఇలాంటి ఒక ‘అదృశ్య’ సంఘటన మన దేశంలో కూడా జరిగింది. కాకపోతే అలా మాయమైపోయిన ట్రైన్‌ 43 ఏండ్ల తర్వాత దొరికింది! ఇండియన్‌ రైల్వేస్‌కి చెందిన ఈ ట్రైన్ ఎలా మాయమైందంటే.. 

కొన్నేండ్ల క్రితం మాయమైన ఇండియన్ రైల్వేస్ ట్రైన్‌ దొరికినప్పుడు కూడా చాలా పెద్ద కలకలం రేగింది. అది 2019 డిసెంబర్5. అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ శాటిలైట్స్‌ సాయంతో అటవీ విస్తీర్ణ మ్యాప్‌ రెడీ చేస్తోంది. శాటిలైట్స్ ఆసియా–ఆఫ్రికా ప్రాంతంలో మ్యాపింగ్‌ చేయడం మొదలుపెట్టాయి. అప్పుడు అస్సాంలోని టిన్సుకియా దగ్గర్లోని అటవీప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక ట్రాలీ లాంటి ఆకారం కనిపించింది. అది చాలావరకు పచ్చని చెట్లు, తీగలతో కప్పినట్టు ఉంది. శాటిలైట్‌ తీసిన ఇమేజ్‌లో చూస్తే.. దాన్ని ఎవరో కావాలనే దాచిపెట్టినట్టు అనిపించింది. అది గమనించిన నాసా కూడా కాస్త ఉలిక్కిపడింది. 

ఖండాంతర క్షిపణి!

ఆ ట్రాలీ లాంటి ఆకారాన్ని చూసి అది ఒక ఖండాతర క్షిపణి అనుకుంది నాసా. అందుకే దానిపై పూర్తి సమాచారం సేకరించాల్సిందిగా అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ  అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో అమెరికా శాటిలైట్స్‌ ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాయి. దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఫొటోలు తీశాయి. మన భూభాగంపై అనూహ్యంగా ఉప‌గ్రహ క‌ద‌లిక‌ల‌ను క‌నిపెట్టిన భార‌త ఇస్రో, ఎన్‌టీఆర్ఓ(భార‌త సాంకేతిక ప‌రిశోధ‌నా సంస్థ), నిఘా విభాగానికి స‌మాచారం ఇచ్చింది. మన దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ మొదలైంది. నాసా ఉపగ్రహాలు తీసిన ఫొటోలు బయటికి రావడంతో ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంస్థలు ఉలిక్కిపడ్డాయి. అందరూ ఇండియా అడవుల్లో ఇంటర్–కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీబీఎం) ఉందని అనుకున్నాయి. 

అడవిలో దాచిందా?

ఐసీబీఎం అంటే ఒక గైడెడ్ బాలిస్టిక్ క్షిపణి. ఇది 5,500 కిలోమీటర్ల వరకు ఉన్న లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. ఆధునిక ఐసీబీఎంలు అనేక రకాల వార్‌హెడ్స్​ను మోసుకెళ్లగలవు. ఇలాంటి క్షిపణులతో అనేక లక్ష్యాలను ఛేదించవచ్చు. ప్రస్తుతం భారత్‌తో పాటు అమెరికా, ఉత్తర కొరియా, చైనా, రష్యా, ఇరాన్‌ల దగ్గర ఐసీబీఎంలు ఉన్నాయి. అమెరికా శాటిలైట్‌ ఫొటోలు తీసిన తర్వాత రష్యా, చైనా రంగంలోకి దిగాయి. ఆ దేశ నిఘా సంస్థలు కూడా ఐసీబీఎం కోసం వెతకడం మొదలుపెట్టాయి. 

రేక్ అని తెలిసి...!

టిన్సుకియాపై అమెరికాతో పాటు రష్యా, చైనా ఫోకస్ పెరగడం చూసి ఇండియా ఏజెన్సీలు ఆశ్చర్యపోయాయి. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రక్షణ మంత్రిత్వ శాఖ నాసా ఫొటోలు తీసిన ప్లేస్‌లో ఏముందో తెలుసుకోవాలని వెతకడం మొదలుపెట్టాయి. చివరకు అక్కడ ఒక పాత ‘రైలు రేక్’ ఉందని ఇండియన్ ఏజెన్సీల పరిశోధనలో తేలింది. 

దాంతో రైల్వేశాఖ ఇన్వెస్టిగేషన్​ చేస్తే... ఆ రేక్‌ (ఇంజిన్‌ లేని ట్రైన్ భాగం)ని1976లో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ నుంచి అస్సాంలోని టిన్సుకియా రైల్వేస్టేషన్‌కు తెచ్చినట్లు తేలింది. ఆ రేక్‌ని తీసుకొచ్చినప్పుడు రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం ఖాళీగా లేదు. ఆ స్టేషన్‌కు ఆనుకుని రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న వాడకంలో లేని ట్రాక్‌ ఒకటి ఉంది. దాని చివర ఈ ట్రైన్‌ పార్క్‌ చేశారు. ఆ తర్వాత దాన్నుంచి ఇంజిన్‌ని వేరు చేసి, మరో రేక్‌ తీసుకొచ్చేందుకు పంపారు.
 
ఎలా అదృశ్యమైంది?

ఈ రైలు అహ్మద్‌నగర్ నుండి టిన్సుకియా చేరుకున్న రోజు అక్కడ భారీగా వర్షం కురిసింది. ఎక్కడికక్కడ వరద నీరు చేరింది. టిన్సుకియా రైల్వే స్టేషన్ కూడా జలమయమైంది. రైల్వే రికార్డుల ప్రకారం..  ఆ రైలు 1976  జూన్ 16న ఉదయం 11:08 గంటలకు అక్కడికి చేరుకుంది. అదే రోజు రాత్రి 11:31 గంటలకు భారీ వర్షం, వరదలు వచ్చాయి. తర్వాత రైల్వే ఉద్యోగులు ట్రాఫిక్ క్లియర్‌‌ చేయడం, ట్రాక్‌ల మరమ్మతుల పనుల్లో బిజీ అయిపోయారు. దాంతో ఆ రైలు రేక్‌ను తిరిగి తీసుకురావడం మర్చిపోయారు. ఆ తర్వాతస్టేషన్‌మాస్టర్‌తోపాటు మరికొందరు ఉద్యోగులు అక్కడి నుంచి ట్రాన్స్​ఫ​ర్ అయ్యారు. దాంతో ఆ రేక్‌ అక్కడే ఉండిపోయింది. 

ఆ రైలు గురించి తెలియకపోవడానికి మరో కారణం.. దాన్ని పార్క్‌ చేసిన ట్రాక్​ కూడా రెండు కిలోమీటర్ల వరకు వరదల్లో కొట్టుకుపోయింది. అది వాడకంలో లేదు కాబట్టి ఎవరూ రిపేర్ చేయించలేదు. అందుకే అటువైపు రైళ్లు, రైల్వే ఉద్యోగులు వెళ్లలేదు. కొన్నాళ్లకు చెట్లు బాగా పెరగడంతో అక్కడసలు రైల్వే ట్రాక్ ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. ఆ రేక్ చుట్టూ పెద్ద చెట్లు పెరిగాయి. ఆ ప్రాంతం పాములు, తేళ్లు, పక్షులు, వన్యప్రాణుల నివాసంగా మారింది. జనాలు కూడా అటువైపు వెళ్లడం మానేశారు. ఆ రైలు పైలట్ డేనియల్ స్మిత్ 1976,  సెప్టెంబర్‌‌లో ఉద్యోగం వదిలేసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అలా ఆ రైలు జాడ తెలియకుండా పోయింది. 

అసలేం జరిగింది? 

తప్పిపోయిన ఈ రేక్‌ కథ వాస్తవమా? కాదా? అనే కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఎందుకంటే ఈ వార్త బయటికి వచ్చాక 2020లో ఉత్తర రైల్వే ఆ రేక్‌ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదంది. దాన్ని వెతికేందుకు రైల్వేలు జరిపిన దర్యాప్తు గురించి తమకు సమాచారం లేదని నార్తర్న్ ఫ్రంటియర్ రైల్వే సోషల్ మీడియాలో పేర్కొంది. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు.