స్మోకింగ్ మానేసినా.. గుండె రిపేర్​కి చాలా టైం పడుతుంది!

స్మోకింగ్​ వల్ల కలిగే నష్టాల గురించి సిగరెట్​ పెట్టెల మీదే రాసి ఉంటుంది. అది ఎంత హానికరమో తెలిసినా లెక్కచేయకుండా తాగేస్తుంటారు. ఒకవేళ మానేసినా చాలా రోజుల వరకు హెల్త్​ మీద దాని ఎఫెక్ట్‌‌‌‌ ఉంటుంది. అయితే.. అందరూ అది ఊపిరితిత్తుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనుకుంటారు. కానీ.. గుండె మీద కూడా ఎఫెక్ట్​ ఎక్కువగానే ఉంటుంది. అందుకే గుండె కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? సంవత్సరాల తరబడి స్మోకింగ్​ చేసిన డ్యామేజీ నుంచి బయటపడడం సాధ్యమేనా? అని తెలుసుకోవడానికి కార్డియాలజిస్టులు ఈ మధ్యే ఒక రీసెర్చ్​ చేశారు.

దక్షిణ కొరియాలో చేసిన ఈ రీసెర్చ్​లో లైట్‌‌‌‌ స్మోకర్స్​ అంటే తక్కువగా స్మోకింగ్ చేసేవాళ్లు.. మానేస్తే గుండె మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఐదు నుంచి పదేండ్లు పడుతుంది అని తేలింది. హెవీ స్మోకర్స్​ మానేసిన తర్వాత గుండె పూర్తిగా కోలుకోవడానికి 25 సంవత్సరాల వరకు పడుతుంది. దక్షిణ కొరియాలో 5.8 మిలియన్ల మంది స్మోకర్లను ట్రాక్ చేసి ఈ స్టడీ చేశారు. ఇందులో 8 ప్యాక్​ ఇయర్స్​ కంటే తక్కువగా పొగ తాగినవాళ్లను లైట్​ స్మోకర్లుగా అంతకంటే ఎక్కువ ప్యాక్​ ఇయర్స్​ తాగిన వాళ్లను హెవీ స్మోకర్స్​గా వేరు చేశారు. ప్యాక్​ ఇయర్​ అంటే.. ఒక వ్యక్తి రోజులో తాగే సిగరెట్ల ప్యాక్‌‌‌‌ల సంఖ్యను మొత్తం పొగతాగిన సంవత్సరాలతో గుణించి లెక్క కడతారు. 

గుండెపోటుకు.. 

ఢిల్లీలోని ఏఐఐఎంఎస్​లోని కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అంబుజ్ రాయ్ ప్రకారం.. “స్మోకింగ్​ మానేసిన తర్వాత శరీరంలో దాని ఎఫెక్ట్స్​ చాలా కాలం పాటు ఉంటాయి. అవి గుండెపోటుకు దారి తీస్తాయి” కాబట్టి ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. స్మోకింగ్​ బాడీ ఇన్​ఫ్లమేషన్​కు దారితీస్తుంది. ఇది ధమనుల్లో ప్లాక్​(ఫలకం) ఏర్పడటానికి కారణం అవుతుంది.

రక్తనాళాల గోడలు దెబ్బతింటాయి. హార్ట్‌‌‌‌ బీట్​ రేట్​, బ్లడ్​ ప్రెజర్​ పెరుగుతాయి. మంచి కొలెస్ట్రాల్‌‌‌‌ అని పిలిచే హై డెన్సిటీ లిపోప్రొటీన్ (హెచ్​డీఎల్​) తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్‌‌‌‌ అని పిలిచే లో డెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్​డీఎల్​)తోపాటు ట్రైగ్లిజరైడ్స్​ పెరుగుతాయి. ఎక్కువగా పొగ తాగడం వల్ల రక్తం చిక్కగా మారుతుంది. ఇవన్నీ గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. 

హీలింగ్​కు ఎక్కువ టైం? 

స్మోకింగ్​ మానేసిన తర్వాత ఊపిరితిత్తులతోపాటు డ్యామేజీ అయిన అన్ని అవయవాలు తక్కవ టైంలోనే రిపేర్​ అవుతాయి. కానీ.. గుండెకు మాత్రమే ఎక్కువ టైం పడుతుంది. పొగ మానేసిన తర్వాత కొద్దిరోజుల్లోనే రక్తంలో నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ తగ్గిపోతాయి. ఆక్సిజన్ లెవల్స్​ పెరుగుతాయి. గుండెకు కూడా ఎక్కువ ఆక్సిజన్​ అందుతుంది. కొన్ని నెలల్లోనే ఊపిరితిత్తులు కూడా నయం అవుతాయి. కఫం లాంటివి తగ్గుతాయి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. గురక తగ్గుతుంది. చాలామందికి ఇదంతా సంవత్సరంలోనే జరుగుతుంది. కానీ.. గుండె ఆరోగ్యంగా మారడానికి మాత్రం ఐదేండ్లు పడుతుంది. అందుకే ‘‘స్మోకింగ్​ మానేసినా హెల్త్​ని నెగ్లెక్ట్​ చేయకూడదు. తప్పనిసరిగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఊబకాయం లాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి.

బీపీ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్​ చెక్​ చేసుకుంటూ కంట్రోల్​లో ఉండేలా చూసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల రిస్క్​ తగ్గుతుంది” అంటున్నారు డాక్టర్ అంబుజ్ రాయ్. 

రెట్టింపు ప్రమాదం

ఈ స్టడీ ముఖ్యంగా 45.8 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న మగవాళ్లపై చేశారు. వాళ్లను  సగటున 4.2 సంవత్సరాలు ట్రాక్ చేశారు. వాళ్లలో చాలామందికి స్మోకింగ్​ మానేసిన తర్వాత కూడా హార్ట్​ ఎటాక్స్​, స్ట్రోక్స్​, హార్ట్ ఫెయిల్యూయర్​ లాంటి సమస్యలు వచ్చాయి. గతంలో విపరీతంగా స్మోకింగ్​ చేయడమే అందుకు కారణమని డాక్టర్లు తేల్చారు.

అసలు సిగరెట్లు తాగని వాళ్లతో పోలిస్తే.. 30 ప్యాక్ ఇయర్స్​ తాగిన వాళ్లకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం రెట్టింపు ఉంటుందని తెలిసింది. కాబట్టి స్మోకింగ్​ మానేసిన వెంటనే ఆరోగ్యం బాగుపడుతుంది అనుకోవడం ఒక అపోహ మాత్రమే అని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. కొందరికి పూర్తిగా కోలుకోవడానికి కొన్ని దశాబ్దాలు కూడా పట్టొచ్చు. 

మానేయడం కాస్త కష్టమే కానీ..

సిగరెట్​ అలవాటును మానుకోవడం అంత ఈజీ కాదు. కానీ.. కుదరని పని కూడా కాదు. సిగరెట్​లోని నికోటిన్ మెదడులోని ప్లెజర్​ సెంటర్స్​ మీద పనిచేస్తుంది. కాబట్టి.. సిగరెట్​ తాగితే రిలాక్స్​డ్​గా అనిపిస్తుంది. అందుకే మానేసిన కొత్తలో చాలామందికి చిరాకు, ఆత్రుత, నిరాశ లాంటివి వస్తుంటాయి. ముఖ్యంగా మొదటి వారంలోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

కొన్నాళ్లకు క్రమంగా తగ్గుతాయి. సిగరెట్​ తాగాలనే కోరికను అదుపులో పెట్టుకోవడానికి ప్యాచెస్, గమ్స్​ లాంటి నికోటిన్ రీప్లేస్‌‌‌‌మెంట్లను తీసుకోవాలి. ఇవి క్రేవింగ్స్​ని తగ్గించడంలో సాయం చేస్తాయి. బాగా నీళ్లు తాగాలి. ఎప్పుడూ యాక్టివ్​గా ఉండాలి.  బ్రీతింగ్​ ఎక్సర్​సైజ్​లు చేయాలి.   

సైకలాజికల్​ ట్రిగ్గర్స్

స్మోకింగ్​ చేసేవాళ్లలో చాలామంది సిగరెట్​ని వాళ్ల డైలీ రొటీన్​లో భాగం చేసుకుంటారు. అంటే..  కాఫీతోపాటు లేదంటే లంచ్​ చేసిన వెంటనే సిగరెట్​ తాగుతారు. అలాంటివాళ్లు సిగరెట్​ తాగకపోతే రోజంతా ఏదో వెలితిగా ఫీల్​ అవుతుంటారు. ఇలాంటి సైకలాజికల్​  ట్రిగ్గర్లు ఉన్నవాళ్లకు సిగరెట్​ మానేయడం కాస్త కష్టమవుతుంది.

వాళ్లు తమ అలవాట్లను మార్చుకోవాలి. కాఫీతో పాటు సిగరెట్ తాగే అలవాటు ఉంటే కాఫీ మానేసి టీ తాగడం అలవాటు చేసుకోవాలి. లంచ్​ తర్వాత అలవాటు ఉన్నవాళ్లు లంచ్​ చేసిన వెంటనే ఏదో ఒకటి నమలాలి. లేదంటే వాకింగ్​ చేయాలి. సిగరెట్​ తాగడం మానేసినవాళ్లు.. ఆ అలవాటు ఉన్నవాళ్లకు కొన్నాళ్లపాటు కాస్త దూరంగా ఉండాలి. దానివల్ల టెంప్టేషన్ తగ్గుతుంది. 

ఒత్తిడిని ఎదుర్కోవటానికి.. 

సాధారణంగా చాలామంది ‘స్ట్రెస్​ నుంచి బయటపడేందుకే సిగరెట్​ తాగుతున్నా’మని చెప్తుంటారు. కొంతవరకు అది కూడా వాస్తవమే. నికోటిన్​ వల్ల కాసేపు సంతోషంగా ఉంటారు. కానీ.. స్ట్రెస్​ నుంచి బయటపడేందుకు సిగరెట్​కంటే బెస్ట్​ ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. క్రియేటివ్​ హాబీస్​, ఎక్స​ర్​సైజ్​, మెడిటేషన్​ లాంటివి కూడా స్ట్రెస్​ని దూరం చేస్తాయి. ఫిజికల్​ యాక్టివిటీ వల్ల ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. దానివల్ల మూడ్​ బూస్ట్​ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. 

అని అందరికీ తెలుసు. అయినా.. ఎంతోమంది సిగరెట్లు తాగుతూనే ఉన్నారు. వాళ్లలో ‘ఏదైనా సమస్య వచ్చినప్పుడు మానేద్దాం లే’  అనుకునేవాళ్లు కొందరైతే.. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్​ చేస్తాం. వయసు మీద పడిన తర్వాత మానేద్దాం లే’ అనుకునేవాళ్లు ఇంకొందరు. వాస్తవానికి ఇలాంటివాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. సిగరెట్​ మానేసిన వెంటనే పరిపూర్ణ ఆరోగ్యవంతులైపోరు. ముఖ్యంగా అది గుండెకు చేసిన డ్యామేజీ నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది.  

ఊపిరితిత్తుల మీద..

నికోటిన్ శ్వాసనాళాల(బ్రోనికల్​ ట్యూబ్స్​)ని విస్తరించే ఒక రిలాక్సెంట్​గా పనిచేస్తుంది. కాబట్టి.. సిగరెట్​ మానేసినప్పుడు ఊపిరితిత్తులు కుంచించుకుపోయినట్లు అనిపిస్తుంటుంది. దానివల్ల ఊపిరి తీసుకోవడంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అది హైపర్‌‌‌‌వెంటిలేషన్‌‌‌‌కు దారితీస్తుంది. కానీ.. వాటన్నింటినీ తట్టుకుంటే.. ఊపిరితిత్తులు హీల్ అవుతాయి. వాటికవే రిపేర్ చేసుకుంటాయి. కొన్నేండ్ల నుంచి సిగరెట్​ అలవాటు ఉన్నవాళ్లు తరచుగా కఫంతో దగ్గుతుంటారు.

కఫం ఎక్కువై కొన్నిసార్లు శ్వాసనాళాల్లో అడ్డుపడుతుంటుంది. అలాంటప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ.. సిగరెట్​ మానేస్తే.. ఈ సమస్య నుంచి కూడా తక్కువ టైంలోనే బయటపడతారు. యాక్టర్​ షారుఖ్ ఖాన్ ఒకప్పుడు రోజుకు 100 సిగరెట్లు తాగేవాడు. తప్పని తెలిసినా ఆ అలవాటును మానుకోలేకపోయాడు. కానీ.. తన 59వ పుట్టినరోజును అభిమానులతో కలిసి జరుపుకున్నప్పుడు ‘‘నేను ఇకపై స్మోకింగ్​ చేయను” అని ప్రకటించాడు. అప్పటినుంచి సిగరెట్​ ముట్టుకోవడం లేదు. అంటే.. కాస్త కష్టపడితే ఎవరైనా సిగరెట్​ మానేయొచ్చు.